ఒంటరిగా దారి వెంట నడుస్తూ ఉంటే
మనసు పరిపరి విధాల పోతోంది
నేను ఒంటరి అయినా మనసు ఒంటరి కాదు కదా
అంతరంగానికి తనకంటూ ఎవరో వెంటే ఉన్నారు
కలిసి పంచుకున్న క్షణాలు ఎవరితోనో అది పంచుకుంటుంది
ఎవరు వెంట రాకపోయినా అది ఎవర్నో వెంట తెచ్చుకుంటుంది
కలద నిద్రలో సైతం తనకు తాను కెలుక్కున్న గాయాలెన్నో
ఓపలేని జ్ఞాపకాలన్నీ ఆకాశం మీదికి విసిరితే చుక్కలైనాయి
వీస్తున్న గాలిలో సైతం అది గుసగుసలు వెతుక్కుంటుంది
దాని చూపులు చుక్కల వెంట జాతర చేస్తాయి
దిగివచ్చిన చుక్కలే మనసు తీవకు మల్లెలవుతాయి
జ్ఞాపకాలని వలేసి అది నన్ను హత్తుకుంటుంది
కోల్పోయిన ఆప్యాయతని తిరిగి గుర్తు చేస్తుంది
కాలువ పక్కన పూసిన పూలు మనసున ముసి నవ్వులు మురిపిస్తాయి
ఒంటరితనం మనిషి అంతరంగపు సమూహం అని
ఒంటరితనం మనిషి నలువైపులా విస్తరించటం అని
ఏకాంతం మనిషి అంతర్నేత్రమని
వెల్తురు చూడని అంతరంగపు మూలల్లోకి ఏకాంతం సూక్ష్మ దర్శిని అని
అంతరంగపు సంభాషణ నిశ్శబ్దపు బయటి ప్రపంచంతోనని
సమూహపు ప్రతిఫలనమే అంతరంగం అని
ఏకాంతం సమూహపు నిశ్శబ్ద భాష అని వికసించిన అంతర్నేత్రపు మౌనరాగం అని
మనిషి అంతరార్థమని
మనసుకు సాంత్వన అని
అస్తిత్వపు సారమే ఏకాంతం అని
ఒంటరితనంలోనే ఏకాంతంలోనే నాతో నేను రమిస్తానని
ఒంటరితనమే మనిషి అంతరంగపు ఇంద్ర చాపమని
మనసు అంతరార్థపు అంతస్సారం
ఒంటరి ఏకాంతం
ఏకాంతపు ఒంటరితనం..
-టి.హరికృష్ణ
9494037288





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల