ఎమ్మెల్యే దానం భూకబ్జాలపై ఫైర్‌

కఠిన చర్యలు తీసుకోవాలని సిఎంను కోరిన నారాయణ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో భూకబ్జాదారులు పేదల ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఈ.టి నరసింహ, జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, సనత్‌నగర్‌ నియోజకవర్గం కార్యదర్శి ఎండి సలీం ఖాన్‌లతో కలిసి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. కూల్చివేసిన ఇళ్లు తిరిగి నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని బస్తీ వాసులకు హామి ఇచ్చారు. దానం నాగేందర్‌ అనుచరులు తిరిగి పేదల జోలికొస్తే తాట తీస్తామని ఈ సందర్బంగా నారాయణ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇంతియాజ్‌ ఖాన్‌, సైఫ్‌ఖాన్‌, జావీద్‌, వెంకటేష్‌, దశరధ్‌ తో పాటు స్థానికులు పాల్గొన్నారు. బేగంపేట ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ పేదల ఇళ్లను నాయకులు బెదిరించి ఖాళీ చేయిస్తున్నారని జనవరి 2న బస్తీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం విూడియాలో రావడంతో అసలు విషయం తెలుసుకునేందుకు ఈనెల 3వ తేదిన మానవ హక్కుల వేదిక హైదరాబాద్‌ యూనిట్‌ బృందం ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లోని ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని మానవ హక్కుల వేదిక హైదరాబాద్‌ యూనిట్‌ ఉపాధ్యక్షులు బిలాల్‌, ప్రధాన కార్యదర్శి సంజీవ్‌తో కూడిన బృందం నిజ నిర్దారణ జరిపింది. జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి ఆ బస్తీ వాసులకు చట్టరిత్యా నివాస హక్కులు కల్పించాలని కమిటీ డిమాండ్‌ చేసింది. బస్తీ వాసులకు రౌడీల నుంచి పోలీస్‌ కవిూషనర్‌ పూర్తి రక్షణ కల్పించాలని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని నిజనిర్దారణ కమిటీ డిమాండ్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *