కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం వంటి చర్యల ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటే అది పొరపాటు కాగలదు. అక్రమార్కులను నిజంగానే లోపల వేస్తున్నదని గట్టిగా నమ్మిక వొస్తే తప్ప బిజెపివన్నీ రాజకీయ ఎత్తుగడలుగానే ప్రజలు భావిస్తారు.
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే ఎపిలో, తెలంగాణలో ఏదో కేసుల్లో అందరినీ ఇరికించి ఏడ్పించినవారే. రేవంత్ రెడ్డిని కేసులో ఇరికించిన కెసిఆర్‌కు భంగపాటు తప్పలేదు. అలాగే జగన్ కూడా టిడిపి వారిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడిపారు. ఈ క్రమంలో రాజకీయాలను పరిశీలిస్తే కక్షసాధింపు రాజకీయాలను ప్రజలు సహించరని గుర్తించాలి. అక్రమాలు లేదా అన్యాయాలు జరిగితే అన్ని కేసులను ఒకే తరహాలో చూసి, వాటిపై చర్య తీసుకోవాలి. కేజ్రీవాల్ అరెస్ట్, కవితల అరెస్ట్ మోదీ ప్రభుత్వానికి సాధారణంగానే కనిపించవచ్చు. కానీ ఇంతకన్నా ఘోరంగా ఉన్నాయనుకుంటున్న కేసుల్లో ఇడి రంగంలోకి దిగడం లేదు. అందుకే ప్రజలకు కేంద్రం దర్యాప్తులపై అనుమానాలు ఉన్నాయి.
తెలంగాణలో మోదీ పర్యటించిన రోజే కేసీఆర్ కుమార్తె కవితను దిల్లీ మద్యం కేసులో అరెస్టు చేశారు. సరిగ్గా వారం రోజులకు ప్రధాని భూటాన్‌లో ఉన్నప్పుడు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌ను అరెస్టు చేశారు. కవిత అరెస్టుతో కేసీఆర్ ఆత్మరక్షణ లో పడిపోయారు. ఇది కెసిఆర్ ఊహించివుండడు. ఇక కేజ్రీవాల్ అరెస్టువల్ల వొచ్చే రాజకీయ పర్యవసానాలను ఎదుర్కోవడానికి కూడా బిజెపి సిద్ధమై ఉండే వుంటుంది. అందుకే ఈ ఇద్దరి అరెస్ట్‌ను ప్రజలు పెద్దగా స్పందించడం లేదు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువగా అక్రమాలు, అన్యాయాలు చేసిన వారిని వొదిలి పిచ్చుకలపై పడ్డారన్న భావన ప్రజల్లో ఇప్పుడిప్పుడే చర్చ సాగుతోంది. అందువల్ల అవినీతికి సంబంధించిన ఎలాంటి కేసులైనా వొదలకుండా ముందుకు సాగితేనే బిజెపి నిజాయితీ గురించి సానుకూలంగా స్పందిస్తారు. ఈసారి దిల్లీ ఎన్నికలు ఆరవ దశలో మే 25న నిర్ణయించారు. అంటే కేజ్రీవాల్ అరెస్టు జరిగిన రెండు నెలలకు దిల్లీ లో ఎన్నికలు జరుగబోతున్నాయన్నమాట. దిల్లీ లో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ మాత్రం సమయం చాలునని నరేంద్రమోదీ అంచనావేసుకుని ఉంటారని అనిపిస్తోంది. దిల్లీ లో గత ఎన్నికల్లో ఏడుకు ఏడుసీట్లు గెలిచిన బీజేపీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చేతులు కలపడంతో కొంత ఎదురు గాలి తప్పదని భావించి ఉంటుంది.
కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఆప్‌ను పూర్తిగా అణచివేయాలన్న లక్ష్యం మోదీలో కనిపిస్తోంది. అంతెందుకు మోదీ తన హయాంలో ప్రాంతీయ పార్టీలను దగ్గరకు తీసుకోవడం, వాటిని తుదముట్టించడం అన్న యత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మోదీ వల్ల ప్రజలకు అంతా మంచే జరిగితే ప్రజలు వీటిని పెద్దగా పట్టించుకోరు. అలాకాకుండా తన రాజకీయ ఎదుగుదలకు అడ్డంగా ఉన్న పార్టీలను మట్టుబెట్టి, ప్రజలను కూడా ధరలు ఇతరత్రా జిఎస్టీ లాంటి పన్నలుతో దెబ్బ తీయాలని చూస్తే ప్రజలకు కూడా ఎక్కడో ఒకచోట గట్టిగా దెబ్బకొడతారని బిజెపి గుర్తిస్తే మంచిది. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్ తరవాత పరిశీలిస్తే దిల్లీ ఎన్నికల షెడ్యూలే కాదు, ఇతర రాష్టాల్ల్రోఎన్నికల తేదీలు కూడా బీజేపీ వ్యూహరచనకు అనుగుణంగా ఉన్నాయని గమనించవచ్చు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేని తమిళనాడు, కేరళ ఎన్నికలు మొదటి రెండు దశల్లోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బీజేపీ తనకు అనుకూలంగా ఉన్న రాష్టాల్ల్రో ఎన్నికలను వివిధ దశల్లో చివరి వరకూ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌కూ, బీజేపీకీ మధ్య ముఖాముఖి పోటీ జరిగితే బీజేపీదే పై చేయి అవుతుందని మోదీ భావనగా కనిపిస్తోంది. అందుకే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తే కాంగ్రెస్ చచ్చిన పాము కనక దాని సంగతి తరవాత చూసుకో వొచ్చన్న భావన ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన రేవంత్ ప్రభుత్వాన్ని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఒకే గాటన కట్టి విమర్శలు చేయడం వల్ల కూడా బిజెపికి పెద్దగా లాభం ఉండదు. ఇక్కడ కవితను అరెస్ట్ చేయడం వల్ల బిఆర్‌ఎస్ ను దెబ్బతీయడం జరగవచ్చు. కానీ అప్పుడే రేవంత్‌పై నిందలు వేస్తే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వొస్తుందని బిజెపి గుర్తిస్తే మంచిది. తెలంగాణలో ఇటీవలే అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ దూకుడును తట్టుకొని బీజేపీ ప్రభంజనం సృష్టించడం కూడా అంత సులువు కాదు. 17 సీట్లు గెలుస్తామని చెప్పడం అతిశయోక్తి కాక తప్పదు. మోదీ ఎంత బలవంతుడైనా స్థానిక నేతలు బలంగా లేకపోతే విజయం సాధించడం కష్టం. స్థానిక నాయకత్వం బలంగా లేకపోవడం కారణంగా తెలంగాణలో కనీసం 17మంది గట్టి నాయకులను తయారు చేసుకోలేక పోయారు. ఇతర పార్టీ నేతల్ని, వ్యాపారస్తుల్ని లాగి వారికి అప్పటికప్పుడే సీట్లు ఇవ్వడం చూస్తే దీనిని అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ బిజెపికి సొంతంగా బలం లేదు. అక్కడ పొత్తులో భాగంగా టిడిపి, జనసేన ఊపులో ఒకటి రెండు సీట్లు గెలిస్తే ఎక్కువే. ఆరు సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీని తెలుగుదేశం గెలిపిస్తే తప్ప గట్టెక్కలేరు. కేరళలో కేంద్ర మంత్రులతో పోటీ చేయించినా ఖాతా తెరుస్తుందా అన్నది అనుమానమే. కర్ణాటకలో కూడా బీజేపీ గత ఎన్నికల్లో 28కి 26 సీట్లు గెలిచినా ఈసారి అన్నిసీట్లు గెలవడం సాధ్యపడదని ప్రచారం సాగుతోంది. అధికారం పోవడంతో మళ్లీ యడ్యూరప్పకు ప్రాధాన్యత పెంచారు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి స్థాపించిన ’కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీ వల్ల బీజేపీకి వొచ్చిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను బీజేపీలో చేర్చుకోవల్సి వొచ్చింది. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం వంటి చర్యల ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటే అది పొరపాటు కాగలదు. అక్రమార్కులను నిజంగానే లోపల వేస్తున్నదని గట్టిగా నమ్మిక వొస్తే తప్ప బిజెపివన్నీ రాజకీయ ఎత్తుగడలుగానే ప్రజలు భావిస్తారు. అందువల్ల ఇలాంటి చర్యలకన్నా ప్రజలకు ఏం మంచి చేస్తే తమ వెంట ఉంటారో ఆలోచన చేస్తే మంచిది.
-ప్రజాతంత్ర డెస్క్





