స్పీకర్ పదవికి పోటీని పెట్టిన కాంగ్రెస్
ఓంబిర్లాకు పోటీగా కొడికున్నల్ సురేశ్ నామినేషన్
దేశ చరిత్రలో తొలిసారిగా నేడు స్పీకర్ ఎన్నికకు వోటింగ్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 25: దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నికకు పోటీ జరుగుతోంది. అధికార ఎన్‌డిఎ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి సై అంటోంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏక గ్రీవం అవుతారని భావించిన బీజేపీ, ఎన్డీయే కూటమికి విపక్ష కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నా.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది. ఈ మేరకు కేరళ నుంచి 8 సార్లు ఎంపీగా గెలుపొందిన కొడికున్నిల్ సురేష్‌ను ఇండియా కూటమి నుంచి స్పీకర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నిర్ణయించింది. ఆయన మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి అప్పగించాలన్న సంప్రదా యాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందని రాహుల్ ఆరోపించారు.
ఇకపోతే సీనియార్టీ ప్రకారం సురేశ్ ప్రోటెం స్పీకర్ కావాల్సి ఉన్నా, అధికార ఎన్‌డిఎ కూటమి ఒడిషాకు చెందిన మరో సీనియర్ భర్తృహరిని ఎంపిక చేసింది. ఈ నిర్ణయంపై ఇండియా కూటమి ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో కనీసం డప్యూటి స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. డిప్యూటి పదవిని తమకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే సయోధ్య కుదరక పోవడంతో దేశ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటికి వరకు జరిగిన లోక్‌సభ స్పీకర్ పదవులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. కాగా 75 ఏళ్ళ దేశ చరిత్రలో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారి కానుంది. తొలుత స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం అవుతుందని భావించారు. కానీ స్పీకర్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ మెలిక పెట్టింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇండియా కూటమి సభ్యులతో జరిపిన చర్చల్లో.. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇస్తే స్పీకర్‌కి మద్దతు తెలుపుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి దాదాపు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
కానీ, కాంగ్రెస్ అనూహ్యంగా అభ్యర్థిని పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ పదవికి తొలిసారి పోటీ జరుగబోతున్నది. తొలిసారి ప్రతపక్ష అభ్యర్థిగా కొండికునాల్ సురేశ్ పోటీపడుతున్నారు. కాగా ఎన్ డిఏ అభ్యర్థిగా ఓమ్ బిర్లా పోటీపడుతున్నారు. నామినేషన్ల పక్రియ మధ్యాహ్నం 12.00 గంటలకు ముగిసింది. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ తో మోడీ నేతృత్వంలోని ఎన్ డిఏ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ విషయంలో ఓ అంగీకారానికి రాలేకపోయింది. దాంతో స్పీకర్ పదవికి పోటీ నెలకొంది.18వ లోక్ సభ తొలి రోజు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా 262 మంది కొత్తగా ఎన్నికయిన ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. కాగా మిగతా 281 మంది కొత్త ఎంపీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేసారు.
వారిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగనున్నది. ఇదిలావుండగా ఇండియా బ్లాక్ కు చెందిన ఎంపీలు పార్లమెంటు లోపల, వెలుపల ’ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అన్న నినాదాలతో, రాజ్యాంగం ప్రతులను పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27 న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే పక్రియ కొనసాగనున్నది. వచ్చే వారం ఉభయ సభలలో ప్రధాని మోడీ చర్చలపై సమాధానాలు ఇవ్వనున్నారు.





