- మూడు అంశాలతో ముందుకు వెళుతున్నాం
- ప్రపంచం భారత్‌వైపు చూస్తుంటే..ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి
- డిప్లొమాటిక్ ఔట్‌రిచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఇదేవిషయం చెప్పానని వెల్లడించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్ ఔట్‌రిచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ‘త్రీఐ’ మంత్రతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ..అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. నేడు రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిందన్నారు. ఫార్మస్యూటికల్ హబ్, బయోసైన్స్ హబ్‌గా ఉందని చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్ విడిభాగాలు ఇక్కడే తయారవుతాయని వెల్లడించారు. 15 వందలకు పైగా మల్టీనేషన్ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్, మెటా లాంటి కంపెనీలు అమెరికా తర్వాత తమ సెకండ్ బ్రాంచిని హైదరాబాద్‌లో ప్రారంభించాయని వెల్లడించారు. ప్రపంచంలో భారత్ నంబర్ వన్‌లో ఉండాలంటే ఇన్నేవేషన్, ఇన్‌ఫాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ అనే మూడు సూత్రాలు పాటించాలన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ నంబర్ వన్‌గా నిలవాలంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ అనే సూత్రాలు పాటించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచిందని అన్నారు.
ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంటే భారత్‌లోని రాష్ట్రాలన్ని తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. ప్రపంచంలో భారత్ నంబర్ వన్‌లో ఉండాలంటే 3 సూత్రాలు పాటించాలన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో వ్యవసాయంలో ప్రగతి సాధించాం. వ్యవసాయంలో 19 శాతానికిపైగా వృద్ధిరేటు ఉంది సాధించాం. మన పథకాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వారంతా బయటకు విమర్శలు చేసినా..వారి రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలను చూస్తేనే తెలుస్తుంది. అవి తెలంగాణ నుంచి స్ఫూర్తి తీసుకొని అమలు చేస్తున్న పథకాలు అని చెప్పుకొచ్చారు.




