ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

  •   ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ..
  • తెలంగాణ ఉన్నత విద్యామండలి  మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి

తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌గా తుమ్మ పాపిరెడ్డి ఉత్తర తెలంగాణలో ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా ఏడేళ్లు పనిచేసినప్పటికీ సీఎం కేసీఆర్‌కు తనకు వ్యక్తిగత వైరుధ్యాలు  లేవంటున్నారు. గత రెండేళ్లుగా కేసీయార్‌ నియంతృత్వం మితిమీరి పోయిందని మండిపడుతున్నారు. ఉన్నత విద్యారంగం, విశ్వవిద్యాలయాల్లో ఖాలీలు  నింపడంలో నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అడగంటి పోయిందని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు మార్పును కోరుతున్నారంటున్న ప్రొఫెసర్‌ పాపిరెడ్డితో ముఖాముఖి ఆయన మాటల్లోనే… మీరు పుట్టి పెరిగిన ఊరు, తల్లిదండ్రులు గురించి .. ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి : మాది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా. ఇపుడు మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌ మండలం పొంగనూరు. అదే గ్రామంలో ఐదో తరగతి వరకు చదువుకున్నాను.  మా నాన్న తుమ్మ గోపాల్‌ రెడ్డి,  అమ్మ సరోజనమ్మ. మాది మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వొచ్చాను. కాకతీయ విశ్వవిద్యాలయంలో 1976లో మొదటి బ్యాచ్‌ ఎం.ఏ. ఎకనామిక్స్‌ పూర్తి చేశాను. ఇదే విశ్వవిద్యాలయంలో 1981లో ఎకనామిక్స్‌ విభాగంలో అధ్యాపకుడిగా చేరాను.

కాలేజీ విద్యార్థిగా మీ రాజకీయాలు…
పాపిరెడ్డి : నేను ఇంటర్మీడియట్‌ రోజుల్లో నాకు ఏ రాజకీయాలు తెలియవు.ఐతే నేను వరంగల్‌కు వొచ్చాక విద్యార్థి సంఘాలు కాలేజీల్లో ఉన్నాయి.ఏబీవీపీ, ఎస్‌.ఎఫ్‌.ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధానంగా కనిపించేవి. ఇంకా అప్పటికీ ఎం.ఎల్‌ విద్యార్థి సంఘాలు ఉనికిలోకి రాలేదు. 1972`75 వరకు మా రూమ్‌ పక్కనే తెలిసిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు వారి మీటింగులకు పోయేది. పెద్దగా ఆసక్తి చూపించకపోయేది. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేశారు. పీజీ పూర్తయ్యాక సీకెఎం, ఆర్ట్స్‌ కాలేజీలో పార్టుటైమ్‌ అధ్యాపకుడిగా కొన్నాళ్లు పనిచేశాను. 1978లో ఎం.ఫిల్‌లో జాయిన్‌ అయ్యాను. చంద్రపుల్లారెడ్డి వర్గం పి.డి.ఎస్‌.యూలో కొన్నాళ్లు పనిచేశాను. ఆ తర్వాత వామపక్ష రాజకీయాలోచన విధానంలోనే ఆచరణ కొనసాగించాను.

కాకతీయ యూనివర్శిటీ అధ్యాపక సంఘ నాయకుడిగా ..
పాపిరెడ్డి : కాకతీయ యూనివర్శిటీలో 33 సంత్సరాలు అధ్యాపకుడి బోధనతోపాటు అధ్యాపకులు, యూనివర్శిటి ఉద్యోగుల సమస్యలపై సమాంతరంగా ఉద్యమాలు నిర్వహించి వాటిలో ప్రధాన భాగస్వామ్యం పంచుకున్నాను. అసోసియేషన్‌ ఆఫ్‌ కాకతీయ యూనివర్శిటి టీచర్స్‌ అధ్యక్షుడి, ప్రధానకార్యదర్శిగా వివిధ హోదాలలో టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఒకవైపు పోరాటాలు మరోవైపు పాఠాలు బోధిస్తూనే కాలం గడిచిపోయింది. అకుట్‌ ఉద్యమ కార్యాచరణపై ప్రారంభంలో సంఫ్‌ుపరివార్‌ ఆలోచనపరుల ప్రభావం ఉండేది. నేను నాయకత్వంలోకి వొచ్చాక వామపక్ష దృక్పథంలో యూనివర్శిటీ సమస్యలపై ఉద్యమించేవాళ్లం. యూనివర్శిటీలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు చేసే సమస్యల పరిష్కార కార్యచరణకు నేను ఎక్కువగా అకుట్‌ తరఫున అన్నిరకాలుగా ఎన్నుదన్నుగా నిలబడేవాళ్లం. మీకు తొలిసారిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన ఆలోచన ఎపుడు, ఎవరి ద్వారా కలిగింది. పాపిరెడ్డి : అదొక విచిత్రమైన సందర్భంలో మాకు తెలంగాణ సాధన ఆలోచన కలిగింది. 1995లో అనుకుంటా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ వైకుంఠం కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌గా నియామకం పొందారు. ఆయన పాలనలో ఆంధ్రా వాళ్లు గొప్ప, తెలంగాణ ప్రొఫెసర్లకు ప్రాధాన్యత తగ్గించడం ప్రారంభించిండు.

దీంతోనే యూనివర్శిటీ ప్రొఫెసర్లు, ఉద్యోగవర్గాల్లో ఒక రకమైన అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. దీంతో ఉద్యోగులు నిరసనలకు దిగడం అకుట్‌ తరఫున ప్రొఫెసర్‌ వైకుంఠాన్ని తీవ్రంగా నిరసించేవాళ్లం. ఇదే క్రమంలో అకుట్‌ ఎన్నికలు వొచ్చాయి. అపుడే నేను ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యాను.  ఇక్కడ కేవలం వీసీ వైకుంఠం ప్రాంతీయ వివక్ష చర్యలను ఎదుర్కోవడానికి కేవలం ఆకుట్‌ సరిపోదని, మిగతా బయట ఉన్న సంఘాలను కూడా కలుపుకొని పోరాడాలని నిర్ణయించాం. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వివక్షకు కారణం పాలకులు అనురిస్తున్న రాజకీయవైఖరిని కూడా ఎదుర్కొవాలని ఆలోచన కలిగింది.  ఒకసారి బాటనీ విభాగంలో కృష్ణారెడ్డి అనే పార్ట్‌టైం అధ్యాపకుడి స్థానంలో ఆ విభాగం ప్రొఫెసర్‌ ప్రసాద్‌ తన భార్యను నియమించుకోవాలని చూస్తే పెద్ద ఎత్తున నిరసన చేపట్టాం. తెలంగాణ ఆలోచన విధానం అపుడు భూపతి కృష్ణమూర్తి గారి ద్వారా కలిగింది. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయంలో స్థానిక ఉద్యోగాలు స్థానికులకే  దక్కాలని విసి వైకుంఠం చర్యలకు నిరసనగా కరపత్రాలు, పత్రికల్లో విస్తృతంగా ప్రచారంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆలోచనలు బలపడేలా చేశాయి. 1996 ఆగస్టు 15న దేవగౌడ ప్రధానిగా ఉన్నపుడు ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ పిలుపు మాలో కూడా కొత్త ఆశలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో 1, నవంబరు, 1996లో తెలంగాణ విద్రోహ దినంగా నిర్వహించడం మొదలు పెట్టాం. తొలిసారిగా వరంగల్‌లోని రామన్నపేట ఆర్యవైశ్యభవన్‌లో భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో నుంచి 500 మందితో భారీ సభ జరిగింది. ఈసభకు బొంబాయి హైకోర్టు రిటైర్డు చీఫ్‌ జస్టిస్‌ కొండ మాధవరెడ్డి కూడా హజరై సంఫీుభావం తెలిపారు. తెలంగాణ విలీనం వల్ల కలిగిన నష్టాలను క్రమంగా విద్యార్థులు, ప్రజల్లో భావ వ్యాప్తిలో పెట్టడం జరిగింది. మలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం పురుడు పోసుకుంది ఇక్కడి నుంచేనని గుర్తుంచుకోవాలి.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర..
పాపిరెడ్డి : ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళదామనే విషయంలో చాలా సార్లు చర్చలు జరిగాయి. అపుడు తెలంగాణ ఉద్యమ ఆవశ్యకత, భావజాల వ్యాప్తి, తెలంగాణ అనుకూల శక్తులను సంఘటిత చేయడం అనే మూడు అంశాలను ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఆ రోజుల్లో సమావేశం పెడితే 40 మంది వొస్తే మహా గొప్పగా ఉండేది. తెలంగాణలో ఆరోజుల్లో ప్రజలపై అణచివేత, ఉద్యమాల మీద నిర్బంధం ప్రధానంగా ప్రజలను తెలంగాణ దిశగా ఆలోచించడానికి మార్గం వేసింది. ఒకవైపు పోలీసులు, మరోవైపు నక్సల్స్‌ ఉద్యమాల ప్రభావం తప్పితే మధ్యలో ప్రజాస్వామిక హక్కుల వ్యక్తీకరణకు ప్రజలకు అవకాశం ఉండేది కాదు. ప్రజల్లో కూడా ప్రజాస్వామిక వాతావరణం ఉండాలనే ఆలోచన వినిపించేది. తొలుత వరంగల్‌ జిల్లాల్లో ఉన్న కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత తెలంగాణ ఆవశ్యకతపై ఎక్కువగా స్పందించి సభలు, సమావేశాలకు క్రమంగా హాజరుకావడం ప్రారంభించింది. ఇదే క్రమంలో పీపుల్స్‌వార్‌ నక్సలైట్ల నుంచి పత్రికల్లో వొచ్చిన ప్రకటన అన్ని వర్గాల్లో సంచలనం కలిగించింది. అదేంటంటే… తెలంగాణ ప్రజాసమితి భూపతి కృష్ణమూర్తి వ్యాపారాలు చేసి సంపాదించింది సరిపోలేదని, రాజకీయ వ్యాపారాలు మొదలు పెట్టాడని ఆరోపించారు. అదే విధంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ కూడా కె.యూ వి.సి.గా ఉన్నపుడు పోస్టుల భర్తీ, సమస్యలు ఎందుకు గుర్తు రాలేదని నక్సలైట్లు ప్రశ్నించారు. దీంతో మాక్కూడ షాకింగ్‌ అనిపించింది. అపుడు వి.సి వైకుంఠం పీపుల్స్‌వార్‌ ప్రకటన సారాంశాన్ని యూనివర్శిటీ టీచర్లు, ఉద్యోగులను లొంగదీసుకోవడానికి విఫలప్రయత్నం చేశారు. దీంతో నేను కూడా పీపుల్స్‌వార్‌ వైఖరిని తప్పుబడుతూ ప్రజాస్వామిక ఉద్యమాలకు పీపుల్స్‌వార్‌ అనుమతి అక్కరలేదని స్పష్టం చేశాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని కౌంటర్‌ సమాధానం  ఇస్తూ వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పాం.  ఆ తర్వాత కొన్ని రోజులకు పీపుల్స్‌వార్‌ పార్టీయే తెలంగాణ ఉద్యమానికి మద్దుతు ఉంటుందని కూడా ప్రకటించడం గమనార్హం.

1996లో తెలంగాణలో పోలీసు నిర్బంధం  ఎలా ఉండేది..
పాపిరెడ్డి: తెలంగాణ భావజాల వ్యాప్తి క్రమంలో విశ్వవిద్యాలయంలోని ప్రగతిశీల భావాలు కలిగిన ప్రొఫెసర్ల మీద తీవ్రమైన నిఘా, నిర్బంధాలను ఎదుర్కొన్నాం. అడుగు తీసి అడుగు వేసిన పోలీసుల డేగ కన్నులు మమ్ములను నీడలా వెంటాడుతుం డేవారు. ఎందుకీ సమస్య వొచ్చిందంటే ‘వార్‌’ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించి పోరాడాలని ప్రజలకు మద్దతు ప్రకటించింది. దీంతో సభలు, సమావేశాలకు ప్రజలు రావడానికి ఎంతో భయభ్రాంతులకు గురయ్యేవాళ్లు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌, నేను తదితరులు మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఉండే భూపతికృష్ణమూర్తి, కాంగ్రెస్‌ సీనియర్లు, జనసంఫ్‌ుకు చెందిన నాయకులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తూ  ఉండేవాళ్లం. పీపుల్స్‌వార్‌లో కూడా యూనివర్శిటీల్లో చదివిన మా విద్యార్థులే ఉండటం వల్ల ఎప్పటికపుడు పరస్పర భావజాల విషయాలు మాకూ తెలుస్తు ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆరోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పోలీసు అణచివేత, నిర్బంధ పరస్థితుల నుంచి ఉపశమనంగా ప్రత్యామ్నాయం ప్రజలకు స్వేచ్చా మార్గం ఒక తెలంగాణ రాష్ట్రం అని మాత్రమేనని కనిపించింది. అందుకనే హన్మకొండ జెఎన్‌ఎం స్టేడియంలో ఏఐపిఆర్‌ఎఫ్‌ జరిగిపిన తెలంగాణ సాధన తీర్మానం సభకు నిర్బంధాల మధ్యనే విజయవంతంగా ముగించడం ప్రజల బలమైన ఆకాంక్షను అర్థం చేసుకోవడంవల్లనే నిర్బంధాలను దాటుకుని రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు నడిపించాం. తెలంగాణ అంటేనే ఉద్యోగులు, విద్యార్థులను అరెస్టు చేయడం వరకు సాగింది. మధ్యలో ఇంద్రారెడ్డి వొచ్చినప్పటికీ కొన్ని రోజులకు ఆయన స్తబ్దంగా ఉండిపోయారు. మరోవైపు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఉద్యోగులు తెలంగాణ ప్రాతిపదికగా ఏకమై భావజాల వ్యాప్తిలో కీలకమైన పాత్రను పోషించారు.
                                                (సశేషం)
 -కోడం కుమారస్వామి,
కాళోజీ జంక్షన్‌(హన్మకొండ),
ప్రజాతంత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *