దిల్లీ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు
నీట మునిగిన జాతీయ రహదారులు
ఉత్తరాఖండ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 24 : దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చారు. భారీ వర్షాలకు ఉరుములు, గోడలు కూలడం, ఇళ్లు ధ్వంసం అవడం లాంటి ఘటనతో ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫిరోజాబాద్‌లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోనూ వరద ప్రభావం కనిపిస్తోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎక్స్ ప్రెస్ వేలో వరద నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు హర్యానాలో కూడా భారీగా వానలు పడుతున్నాయి. అంతేకాదు వచ్చే రెండ్రోజుల పాటు భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హర్యానాలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మోకాలి లోతు నీటిలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యయాయి. వరదల వల్ల హైవేలపై భారీగా ట్రాఫిక్ జాం అవుతందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిచిపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా కైలాస మానససరోవరం యాత్రకు వెళ్లే రహదారిలో కొండ చరియలు విరిగిపడడంతో యాత్రికులు నిలిచిపోయారు. తవాఘాట్ జాతీయ రహదారి వద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నజాంగ్ తంబా గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చాలాచోట్ల రహదారులు స్తంభించిపోయాయి. రిషికేశ్-గంగోత్రి జాతీయ రహదారి కూడా బండ రాళ్లతో బ్లాక్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ డియాలో వైరల్ గా మారింది.




