చైత్ర శుద్ధ పాడ్యమి రోజు..
క్రోధి నామ సంవత్సరం అడుగు పెట్టింది
సకల శుభాల తెలుగు వారి నూతన
సంవత్సరమిది!
శిశిరపు పొర తొలగి వసంత శోభ
చిగుర్లు తొడిగే వేళ
మామిడి పువ్వుకు మాట వస్తుంది
కోయిల గొంతుకు కూత వస్తుంది
వేపకొమ్మకు పూత వస్తుంది
పసిడి బెల్లానికి పలుకు వస్తుంది
ఉరుకుల పరుగుల జీవితానికి
ఉల్లాసం తెచ్చిపెట్టే ఉగాది వస్తుంది
ఊరంతా వెలుగు జిలుగులు తెస్తుంది
నరనరాన నవచైతన్యం నింపుతుంది
షడ్రుచుల పచ్చడి గొంతులోకి
జాలువార్చి మాధుర్యం అందిస్తుంది
ఆరు రుచుల్ని ఆసాంతం కొరికి తింటే
ఆనందం నట్టింట్లో నిలుచుంటుంది
బంధు మిత్రుల పలకరింపులతో
మది పులకరించి సేదతీరుతుంది
గుమ్మాలకు చుట్టిన పచ్చి మామిడి
కొమ్మలు పచ్చని తోరణాకులు పంచాంగ
శ్రవణం తీర్చి దిద్దిన పిండి ముగ్గులు తోడైతే ఉగాది సంబరం అంబరాన్ని తాకుతుంది
– భీమవరపు పురుషోత్తమ్
రాజమండ్రి, సెల్:9949800253.
ఉగాది శోభ!





