- మీరు చూపిస్తున్న ప్రేమకు వెల కట్టలేను
- నేనెన్నడూ ఎమ్మెల్యేగా అనుకోలేదు..నా కుటుంబం అనుకుని పని చేశా
- కాంగ్రెసోళ్ల చేతికి వెళ్లితే కుక్కలు చింపిన రాష్ట్రమే
- సిద్ధిపేట ఎన్నికల రోడ్ షోలో మంత్రి హరీష్ రావు
- విజయోత్సవ ర్యాలీని తలపించిన రోడ్ షో
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 28: మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ఈ జన్మంతా సిద్ధిపేటకు అంకితం అని సిద్ధిపేట బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక శాఖ తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజైన మంగళవారం సిద్ధిపేటలో నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొని మంత్రి హరీష్‌రావు మాట్లాషఱంజూ…సిద్ధిపేటలో ప్రతిసారి తన మెజారిటీ పెంచుతూ వొస్తున్నారనీ, తన పట్ల ప్రజలు చూపెడుతున్న ప్రేమకు వెల కట్టలేననీ, వారికి తాను ఎంత చేసినా తక్కువేననీ, తనపై చూపెడుతున్న ప్రేమాభిమానాన్ని మాత్రం నిలబెట్టుకుంటానని అన్నారు. తాను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోలేదన్నారు. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులు అనుకున్నానీ, సిద్ధిపేట ప్రజలే తన అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, తల్లిదండ్రులు అనుకుని పని చేశానని, దేవుడి ఇచ్చిన శక్తి మేరకు ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. లీడర్లు అంటే ఎన్నికలప్పుడే వొస్తారని అంటారు, కానీ, తాను మాత్రం ఐదేళ్లు ఎన్నికల మాదిరిగానే ప్రతిరోజూ పని చేశాననీ, సిద్ధిపేట ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ఏ కష్టమొచ్చినా ఆదుకున్నానని అన్నారు. ఏ పండుగ అయినా సిద్ధిపేటలో ప్రజలందరి సమక్షంలో చేసుకున్నట్లు గుర్తు చేశారు. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగం అన్నారు.
సిద్ధిపేట అంటే అభివృద్ధి, అభివృద్ది అంటే సిద్ధిపేట అనే విధంగా దేశంలోనే సిద్ధిపేటను రోల్ మోడల్‌గా చేశాననీ అన్నారు. సిద్ధిపేటలో చక్కటి అభివృద్ధి చేసుకున్నామనీ, అవార్డులు అంటేనే సిద్ధిపేట, సిద్ధిపేట అంటే అభివృద్ధి అనే విధంగా చేసుకున్నామన్నారు. సిద్ధిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు కళ్లలో పెట్టు కున్నారన్నారు. సిద్ధిపేట అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు ఈ ఎన్నికల్లో వోటు అనే ఆయుధంతో తగు విధంగా గుణపాఠం చెప్పాలన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త తానే హరీష్‌రావు అనుకుని ఈ ఎన్నికల్లో వార్డు, వార్డులో ప్రచారం చేయడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థుల తరపున ప్రచారాన్ని చేసినట్లు తెలిపారు. సిద్ధిపేటలో తాను ప్రచారం చేయకున్నా తన తరపున్న ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ వొచ్చిందనీ, తెలంగాణ రావడంతోనే ఎన్నో దశబ్దాల కలలైన గోదావరి జలాలు, రైలు, సిద్ధిపేట జిల్లా ఏర్పాటైందన్నారు. వెయ్యి పడకల దవాఖాన, రెండు పంటలు పండేలా రిజర్వాయర్లను నిర్మించుకున్నామనీ..ఇవన్నీ కేసీఆర్, ప్రజల దీవెనలతో చేసినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. మరో రెండ్రోజుల పాటు కార్యకర్తలందరూ కష్టపడి వోటింగ్ శాతాన్ని పెంచి మరోసారి సిద్ధిపేట పేరును రాష్ట్రంలో మారుమోగేలా చేయాలన్నారు. సిద్ధిపేట పరిసర నియోజకవర్గాలలోనూ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో మనం వేసే ప్రతి వోటు కేసీఆర్‌కు, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కోసం అని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పనిచేసే వారికి వోటు వేయాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెసోళ్ల చేతికి వెళ్లితే కుక్కలు చింపిన రాష్ట్రమే…
ఎన్నికలు అనగానే రాష్ట్రంలో కొందరు తెలంగాణ ద్రోహులు, దొంగలు బయలుదేరారనీ కాంగ్రెస్ పార్టీ నేతలనుద్దేశించి మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వీళ్లు తెలంగాణ కోసం ఏనాడైనా కొట్లాడారా. తెలంగాణ కోసం రాజీనామా చేశారా. దీక్ష చేశారా. అన్ని చేసింది కేసీఆర్. తెచ్చింది కేసీఆర్. ఇప్పుడు కుర్చీ మీద కూర్చుంటమని బయలుదేరారు. వీరి చేతికి వెళ్లితే రాష్ట్రం ఉంటుందా..అంటూ హరీష్ రివు ప్రశ్నించారు. గతిలేని సంసారం నడపవచ్చు. సుతిలేని సంసారం నడపరాదు. కాంగ్రెసోళ్లది సుతిలేని సంసారం, ఒక్కరికి ఒకరికి పడదు. తప్పిపోయి కాంగ్రెసోళ్ల చేతికి రాష్ట్రం వెళ్లితే మాత్రం ఆగమైతది, కుక్కలు చింపిన రాష్ట్రమే అవుతుందన్నారు. ఇప్పుడిప్పుడే వొచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటనే మంచిగా ఉంటుందన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?అని ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో వోట్లు వేయాలని, సిద్ధిపేట అభివృద్ధిని ఓర్వలేక ఇన్నాళ్లు కళ్లలో పెట్టుకున్న వారందరికీ వోటు అనే ఆయుధం ద్వారా గుణ పాఠం చెప్పాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.
విజయోత్సవ ర్యాలీని తలపించిన హరీష్‌రావు రోడ్ షో..
మంగళవారం సిద్ధిపేట పట్ణణం గులాబీమయమైంది. పట్టణంలో ఎక్కడ చూసినా గులాబీ కండువాలు, గులాబీ పూలే. గులాబీ పాటలే. సిద్ధిపేట బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజున జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజల ఆశీర్వాదం కోరుతూ..పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో గల వేములవాడ కమాన్ నుంచి వేలాది మందితో రోడ్ షో నిర్వహించారు. వేములవాడ కమాన్ నుండి ప్రారంభమైన ఈ భారీ రోడ్ షో నర్సాపూర్ చౌరస్తా, లాల్‌కమాన్, గాంధీ చౌక్, వెంకటేశ్వర దేవాలయం, కాంచీట్ చౌరస్తా, గణేష్‌నగర్, దూది మల్లారెడ్డి రోడ్డు మీదుగా ముస్తాబాద్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్ వరకు రోడ్ షో, భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ రోడ్ షోలో అడుగడునా జనం నీరాజనం పట్టారు. ఓ వైపు మహిళలు మంగళహారతులు, బోనాలతో స్వాగతం పలికారు. మరోవైపు యువత డ్యాన్స్‌లు, డప్పు వాయిద్యాలతో ఉర్రూతలూగించారు. భారీ గజమాల పూలదండలతో సత్కరించారు.
మంత్రి హరీష్ రావు సైతం చిరు నవ్వు చిందిస్తూ…విక్టరీ సింబల్ చూపిస్తూ చేతులు ఊపుతూ, చేతులు జోడిరచి ప్రజలకు నమస్కారం పెడుతూ..అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములందరూ, అమ్మా తాతలందరూ కారు గుర్తుకు వోటేయ్యాలంటూ కోరుతూ ముందుకుసాగాడు. మంత్రి హరీష్‌రావు సైతం ఈ ర్యాలీలో చాలా జోరుగా, హుషారుగా కనిపించాడు. ఆత్మీయ అన్న…మా సిద్ధిపేట ప్రజల ఇంటి మనిషి హరీష్ అన్న అంటూ… స్వాగతం పలుకుతూ అన్ని వర్గాల ప్రజలు ఈ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి హరీష్‌రావు అభిమానులు, శ్రేయోభిలాషులు వేలాదిగా పాల్గొనడంతో విజయోత్సవ ర్యాలీని తలపించింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, బిఆర్‌ఎస్ నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, మోహన్‌లాల్, ఆలకుంట మహేందర్, బత్తుల చంద్రం, బెల్లంకొండ వెంకట్‌తో పాటు కౌన్సిలర్లు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజున సిద్ధిపేటలో నిర్వహించిన రోడ్ షోలో వేలాదిగా పాల్గొనడంతో ఈ ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావుకు లక్షన్నర వోట్ల భారీ మెజారిటీ ఖాయమని పార్టీ శ్రేణులు దీమాను వ్యక్తం చేశారు.





