Take a fresh look at your lifestyle.

ఈడి, మోడీలకు అదరం.. బెదరం

  • ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవు
  • ఎన్నికలు వచ్చే రాష్ట్రంలోనే ఈడి, ఐటి సంస్థలు దిగుతాయి
  • దేశంలో 155 మెడికల్‌ ‌కాలేజీలు ఇచ్చి తెలంగాణలో ఒక్కటి ఎందుకు ఇవ్వలే?
  • కేంద్ర ప్రభుత్వ దమన నీతి పై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ‌ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ ఉద్యమాల తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కుట్రలు, కుతంత్రాలు సాగవని రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మోడీ, ఈడి లకు భయపడబోమని ఇటువంటి విద్వేష రాజకీయాలు తెలంగాణకు కొత్త కావని హరీష్‌ ‌రావు ధ్వజమెత్తారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆగడాలు సాగవని మండిపడ్డారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ దేశంలో 155 మెడికల్‌ ‌కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్‌ ‌కాలేజీ మంజూరు చేయకున్నా.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇప్పటికే 17 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని, మరో 16 జిల్లాలలో ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అని రాష్ట్రంలో విద్య, వైద్యం కోసం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ ‌జిల్లాకు చెందిన 3 తాలూకాల ప్రజలు తమ గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి జరగడంలేదని తమను తెలంగాణ రాష్ట్రంలో కలిసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి ఐ కె రెడ్డిని కలిశారని హరీష్‌ ‌రావు తెలిపారు. తమ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు, మంచినీళ్లు, కరెంటు, తదితర సంక్షేమ పథకాలు ఏవి దిక్కులేవని బిజెపి పాలిత సర్పంచులు వచ్చి తమను తెలంగాణను కలుపుకోవాలని ఐకే రెడ్డిని కోరినట్లు హరీష్‌ ‌రావు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఇక్కడి బిజెపి నాయకులకు కనిపించడం లేదని, కానీ మహారాష్ట్రలోని బిజెపి నాయకులకు మాత్రం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి హరీష్‌ ‌రావు రాష్ట్ర బిజెపి నాయకులను ఎద్దేవా చేశారు.

రాష్ట్ర బిజెపి నాయకులు చేస్తున్న పాదయాత్రలు వెలవెలబోతున్నాయని టీఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభలకు లాస్ట్ ‌కు వచ్చి వెనిదిరిగిపోయే ప్రజలంతా మంది కూడా బిజెపి పాదయాత్రలకు రావటం లేదని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బిజెపి నాయకుల మాటలు ఎక్కువ..పనులు తక్కువ, డైలాగులు ఎక్కువ.. జనం తక్కువ అన్న రీతిలో పాదయాత్రలు కొనసాగుతున్నాయని హరీష్‌ ‌రావు సెటైర్లు విసిరారు. బిజెపి నాయకులు బ్లాక్‌ ‌మెయిల్‌ ‌రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ఈడి, ఐటి, రైడింగులు బిజెపి ప్రభుత్వం చేస్తుందని ఇది దేశంలో రాష్ట్రాలకు కొత్త కాదని అన్నారు. బిజెపి వదిలిన బాణాలు, పెట్టించిన పార్టీలు ప్రజలకు అన్ని తెలిసేనని అన్నారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌ ‌లోనో లేదా బీహార్‌ ‌లోనో మీ బాణాలు, కుట్రలు నడిచినయేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో అటువంటివి నడవవని ఇది పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల ఆకాంక్షగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రమని.. ఇక్కడ ఎటువంటి బిజెపి కుట్రలు కుతంత్రాలు సాగవన్న విషయాన్ని బిజెపి నాయకులు గ్రహించాలని హరీష్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీ
పోస్టుల మంజూరుపై మంత్రి హరీష్‌ ‌రావు హర్షం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ‌ఖమ్మం, కరీంనగర్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ‌జనగామ, నిర్మల్‌లోని మెడికల్‌ ‌కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు ఈ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను కేటాయించింది. వైద్య కళాశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయడంపట్ల మంత్రి హరీశ్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని అన్నారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌ ‌రావు ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply