తెలంగాణ అభివృద్దికి మరింత కృషి… ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చాం… టిక్కెట్లు రాని వారికి మరిన్ని అవకాశాలు
శుభముహూర్తంలో అభ్యర్థుల జాబితా ప్రకటించామని సిఎం కెసిఆర్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : తెలంగాణ అభివృద్దికి మరింత కృషి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలకు చేరుస్తామని అన్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లను గెలుస్తామని అన్నారు. వరుసగా మూడోసారి గెలిచి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదైనా కార్యం తలపెట్టే ముందు శుభముహూర్తం చూసుకొని ప్రారంభించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఈ సంప్రదాయాన్ని పాటించారు. శ్రావణ సోమవారం మధ్యాహ్నం 2.38గంటలకు ధనుర్లగ్న శుభ ముహూర్తంలో పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. దనుర్‌లగ్నంలో జాబితాన ప్రకటిస్తున్నామని అన్నారు.
అత్యంత శుభప్రదమైన ఈ ముహూర్తంలో తలపెట్టిన కార్యాలు దిగ్విజయమవుతాయని అన్నారు. సీఎం తమ అభ్యర్థుల జాబితాను ఈ శుభ ముహూర్తంలో ప్రకటించడం విశేషం. ఇక బీఆర్‌ఎస్ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలోనే ఉంటూ అభ్యర్థులను గెలిపించుకోవాలని, రాబోయే రోజుల్లో వారికి కూడా మంచి అవకాశాలు వొస్తాయన్నారు. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయని అన్నారు. చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. గతంలోనూ అలానే చేశామని, ఈ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు. ఎన్నికల మేనిఫిస్టోలో ప్రకటించని అనేక అంశాలను అమలు చేశామని అన్నారు. కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, కెసిఆర్ కిట్ లాంటి పథకాలు ప్రారంభించామని అన్నారు. తెలంగాన అద్భుతంగా ముందుకు సాగుతుందని, మళ్లీ గెలవడం ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకుని పోతామన్నారు.
కాంగ్రెస్ వన్ ఛాన్స్ అన్న ప్రకటనటను ఎద్దేవా చేశారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన వారు ఏం చేశారని అన్నారు. దేశంలో తాము ఎన్నికలను పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం ఒక టాస్క్ అని సీఎం కేసీఆర్ అన్నారు. పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. భూపాలపల్లిలో వెంకట్రమణారెడ్డికి సీటు ఇస్తామంటే మధుసూదనాచారి అండదండగా ఉంటామన్నారు. తాండూరులోనూ పైలట్ రోహిత్‌రెడ్డికి ఇస్తామంటే మహేందర్‌రెడ్డి మద్దతిచ్చారని అన్నారు. ఉన్నంతలో అన్ని సర్దుబాట్లు చేసుకుని ఎలాంటి వివాదాలకు తావులేకుండా అభ్యర్థుల జాబితా విడుదల చేశామని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా టికెట్లు వొచ్చిన వాళ్లందరికీ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. జాబితాలో ఉన్నవారందరూ ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి గుర్తింపు ఇచ్చి సీట్లు ఖరారు చేశామన్నారు. టికెట్లు వొచ్చిన అభ్యర్థులందరూ అద్భుత విజయం సాధిస్తారని, సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ఇకపోతే అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మహిళలకు బీఆర్‌ఎస్ పార్టీ చోటు కల్పించింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 115 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఏడుగురు మహిళలకు స్థానం దక్కింది. 2018లో నలుగురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా వారిలో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా ముగ్గురు మహిళలకు జాబితాలో స్థానం కల్పించారు. 2018 ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి ఓటమిపాలైన కోవా లక్ష్మీతోపాటు మెదక్, ఆలేరు, ఇల్లందు, మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యేలైన పద్మా దేవేందర్ రెడ్డి, గొంగడి సునితా మహేందర్‌రెడ్డి, హరిప్రియా నాయక్, సబితా రెడ్డిలకు ఈసారి కూడా టికెట్లు కేటాయించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈసారి టికెట్ నిరాకరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి 2018 గెలుపొందిన సాయన్న మరణించడంతో ఆయన కూతురు లాస్య నందితను పోటీకి నిలపాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు.




