ఇం‌తకూ ఏ రెండు పార్టీలు ఒక్కటిగా ఉన్నట్లో !!

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ  రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలు తీవ్రతరం అవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిత్యం రాష్ట్రంలో రాజకీయ వేడి రాచుకుంటోంది. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈ మూడు పార్టీలుకూడా ఒకదానిపైన ఒకటి నిందారోపణలు చేసుకుంటూ ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఈసారి కూడా ఎట్టి పరిస్థితిలో విజయం తమదేనని ఢంకా భజాయించి చెబుతున్నది. ఈ నేపథ్యంలో  రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌బిజెపిలపైన బిఆర్‌ఎస్‌ ‌విరుచుకు పడుతోంది. వాస్తవంగా బిఆర్‌ఎస్‌ ‌పుట్టిందే ఈ రెండు పార్టీలకు వ్యతిరేక కూటమి కట్టేందుకు. అందుకు చేసిన ప్రయత్నాలు సఫలమైన దాఖలాలు లేవు.  తాజాగా ఈ విషయంలో బీహార్‌లో జరిగిన బిజేపి యేతర  కూటమి సమావేశానికి కూడా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు ఆహ్వానం అందలేదంటే కెసిఆర్‌ ‌సారధ్యంపైన సమావేశంలో పాల్గొన్న పార్టీలకు విశ్వాసం లేకపోవడమైనా అయిఉండాలి, లేదా కెసిఆర్‌ ‌మరో ఎత్తుగడతో ముందుకు పోతున్నట్లైనా అయి ఉండాలి. ఏది ఏమైనా బిఆర్‌ఎస్‌ ‌మాత్రం మొదటినుండీ చెబుతున్నట్లు తాము బిజెపి, కాంగ్రెస్‌కు సమాన దూరం  పాటిస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భ•ంగా మరోసారి పునరుద్ఘాటిస్తోంది. కాని, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం ఆ మాటలను విశ్వసించడంలేదు. బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటే నంటోంది కాంగ్రెస్‌. ఎం‌దుకంటే నిన్నటి వరకు బిజెపిపైన ఒంటి కాలుపై లేచిన కెసిఆర్‌ ఇప్పుడు తగ్గటమే కారణమని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మోదీకి కెసిఆర్‌ ‌లొంగి పోయాడని అందుకే  ఇంతకాలం మౌనంగా ఉండి ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాష్ట్రానికి సహాయం అందించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు మంతనాలేంటి అంటోంది కాంగ్రెస్‌. ‌రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు బిజెపితో కలిసి ఎన్నికలకు పోవాలన్న వ్యూహంతోనే మంత్రి కెటిఆర్‌ను కెసిఆర్‌ ‌దిల్లీకి పంపాడంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఐటి దాడుల్లో కెసిఆర్‌ ‌కుటుంబానికి చెందిన  రహస్య ఆస్తులు వెలుగు చూశాయని, వాటినుంచి బయటపడేందుకే  కెసిఆర్‌ ‌మోదీకి లొంగిపోయాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా దిల్ల్లీ లిక్కర్‌ ‌కేసులో  కవితకు  ఈడీ నోటీసులిచ్చినప్పటికీ  ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం వెనుక బిఆర్‌ఎస్‌, ‌బిజెపి అంతర్ఘత సంబంధాలేనన్నది కాంగ్రెస్‌ ‌చేస్తున్న ప్రధాన ఆరోపణ. దాన్ని వారు ఫెవికాల్‌ ‌బంధంగా పోలుస్తున్నారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి బిజెపిలోకి వెళ్ళిన నాయకులు ఇదే విషయమై కేంద్ర నాయకత్వంపై అలిగినట్లు తెలుస్తున్నది. తాము కెసిఆర్‌ను ఎదిరించి బిజెపిలో చేరితే కెసిఆర్‌పైన ఇంతవరకు  ఎలాంటి చర్యలను తీసుకోలేకపోవడం తమకు అవమానంగా ఉందంటు పార్టీ పెద్దల ముందు వాపోతున్నారు.. కేంద్రం చర్యలపై అలిగిన ఈటల  రాజేందర్‌, ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని తాజాగా దిల్లీకి  పిలిచినప్పుడు కూడా ఇదే అంశాన్ని వారు ప్రస్తావించిన కారణంగానే అమిత్‌షాతో  కేటీఆర్‌  అపాయింట్‌మెంట్‌ ఆగిపోయిందంటున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌, ‌భారాస ఒక్కటే అంటోంది బిజెపి. కాంగ్రెస్‌ ‌కు వోటు  వేస్తే బిఆర్‌ఎస్‌కు వోటు  వేసినట్లే అవుతుందని, కాంగ్రెస్‌ ‌టికెట్‌  ‌పై గెలిచిన అభ్యర్థులు ఆ తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరిపోతారన్న ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది బిజెపి. బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయంగా బిజెపి ఎదుగుదలను చూడలేకపోతున్న కాంగ్రెస్‌,  ‌బిఆర్‌ఎస్‌తో కలిసి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటున్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఆ రెండు ఒకటవుతున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌పార్టీ ఎవరికి టికెట్‌ ఇవ్వాలన్నది కూడా కెసిఆరే చెప్పే దశలో వారి స్నేహం ఉందని, ఆయా అభ్యర్థులకు ఆర్థిక సహకారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నది బిజెపి ఆరోపణ.
కాగా, కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఒకటేనంటోంది బిఆర్‌ఎస్‌.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని సాక్షాత్తు రాష్ట్ర ఐటి శాఖమంత్రి కెటిఆర్‌ ఆరోపించిన విషయం తెలియందికాదు. ఇటీవల బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు పాట్నాలో సమావేశమై నప్పుడు దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌ ‌డిమాండ్‌ ఆరణ్యరోదనే అయింది. దాన్ని కెటిఆర్‌ ఎత్తిచూపుతున్నారు. నిజంగానే బిజెపిపైన దాడికి సిద్ధమైతే  అరవిందకేజ్రీవాల్‌ ‌డిమాండ్‌పై కాంగ్రెస్‌ ఎం‌దుకు మౌనం వహించిందో చెప్పాలంటాడాయన. దిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేలా  కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువొచ్చింది. దానిపై స్పందించాల్సిందిగా పాట్నా సమావేశంలో కేజ్రీవాల్‌ ‌పలుసార్లు కాంగ్రెస్‌కు గుర్తు చేసినా లాభంలేకపోయిందంటే ఎలా అర్థం చేసుకోవాలన్నది ఆయన ప్రశ్న. దేశానికి ప్రమాదకరంగా మారిన పై రెండు జాతీయ పార్టీలను రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే ఎదుర్కోనున్నట్లు కెటిఆర్‌ ‌స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
నిజంగానే బిఆర్‌ఎస్‌- ‌బిజెపికి దగ్గరవుతున్నదా అన్న అనుమానాన్ని వామపక్షపార్టీలు వ్యక్తంచేస్తున్నాయి. బిజెపి లాంటి మత తత్వ పార్టీని వ్యతిరేకిస్తున్నందుకే తాము బిఆర్‌ఎస్‌తో జతకడుతున్నామంటున్న వామపక్షాలకు బిఆర్‌ఎస్‌, ‌బిజెపికి దగ్గరవుతుందంటూ వొస్తున్న వార్తలు ఇప్పుడు కొరుకుడు పడడంలేదు. దీంతో తమ సంగతేంటో తేల్చుకోవాలను కుంటున్నాయి. దీనిపై కెసిఆర్‌తో ప్రత్యేక సమావేశం కోసం ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అంతేగాక పాట్నా సమావేశంలో పాల్గొనడం ద్వారా తాము బిజెపిని వ్యతిరేకిస్తున్న విషయాన్ని వారు మరోసారి చెప్పకనే చెప్పినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *