రేపటి నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతర
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ
2 వేల మంది వైద్య సిబ్బందితో 24 గంటల వైద్య సదుపాయం
6 వేల బస్సులు..50 ఎకరాల్లో తాత్కాలిక
బస్ స్టేషన్..మహిళలకు ఉచిత ప్రయాణం
70 సీసీ కెమెరాలతో…డ్రోన్లతో..ప్రత్యే
30 వేల ఉద్యోగులతో సాధారణ సేవలు
ములుగు, ప్రజాతంత్ర , ఫిబ్రవరి 19 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది. తెలంగాణ కుంభమేలాగా పిలువబడుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో ఆ నాలుగు రోజుల పాటు మేడారం అభయారణ్యం కాస్త జనారణ్యమై గిరిజనుల సంప్రదాయాల ప్రకారం భక్తకోటితో విలసిల్లుతుంది. రేపు బుధవారం ఫిబ్రవరి 21 నుంచి శనివారం 24వ తేదీ వరకు జరిగే జాతరకు ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు దర్శించుకు న్నారని, రెండు కోట్ల మంది భక్తులు వొచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మౌలిక వసతుల కోసం మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క)ల ప్రత్యేక చొరవతో సీఎం రేవంత్ రెడ్డి 110 కోట్ల రూపాయలను కేటాయించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజలతో పాటు అధికారులంతా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జాతరకు వారం ముందు నుంచే మేడారంలో భక్తుల కోసం 24 గంటల వైద్య సదుపాయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం తరపున 30 చోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అత్యవసరంగా రోగులను తరలించేందుకు108 వెహికిల్స్15, తాత్కాలిక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి 150 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 పడకలతో కూడిన వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి రెండు వేల మందికి పైగా ఉద్యోగులు జాతరలో విధులు నిర్వహిస్తారని ములుగు డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు. బైక్ అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచారు.
మేడారం మహా జాతర రూట్ మ్యాప్‌ను ములుగు జిల్లా పోలీసులు రెడీ చేశారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటు న్నారు. జాతరకొచ్చే వాహనాలను పార్కింగ్ చేయడానికి వీలుగా ములుగు ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ 1,462 ఎకరాల్లో 33 పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేసింది. వీఐపీ, వీవీఐపీ, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ప్లేస్‌లు ఇచ్చారు. పస్రా-మేడారం, భూపాలపల్లి-మేడారం, తాడ్వాయి-మేడారం, ఏటూరునాగారం-మేడారం మార్గాల్లో ఈ పార్కింగ్ స్థలాలు చదును చేశారు. అక్కడ ఇన్, ఔట్‌లెట్లు, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తున్నారు.
మహాలక్ష్మి స్కీమ్ కింద పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జాతరకు వొచ్చే మహిళలకు ప్రభుత్వం ఫ్రీ జర్నీ వసతి కల్పిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల బస్సుల్లో సుమారు 40 లక్షల మంది భక్తులను తీసుకురావడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నేతృత్వంలో ఇప్పటికే మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 47 క్యూలైన్లు నిర్మించారు. 70 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులను పర్యవేక్షిస్తున్నామని వరంగల్ ఆర్‌ఎం శ్రీలత ప్రకటించారు. ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తున్నది. బస్సుల్లో వచ్చే భక్తులు గద్దెలకు అర కిలోమీటర్ దూరందాకా చేరుకోవచ్చు. ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్‌ఎం ప్రకటించారు.
జాతర జరిగే 4 రోజుల్లో కోటి మందికి పైగా భక్తులు వొస్తారని అంచనా. ఆ సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు వన్‌వే రూట్లను ప్రకటించారు. ప్రైవేట్ వాహనాల్లో భక్తులు జాతరకొచ్చే దారి, వెళ్లిపోయే దారులు వేర్వేరుగా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి వొచ్చే భక్తులు గుడెప్పాడ్, పస్రా మీదుగా మేడారం చేరుకోవాలి. కరీంనగర్, ఆదిలాబాద్ రూట్ల నుంచి వచ్చేవాళ్లు గాంధీనగర్, జంగాలపల్లి క్రాస్, పస్రా మీదుగా లేదా కాటారం, చింతకాని మీదుగా మేడారం చేరుకోవచ్చు. ఆంధ్రా, చత్తీస్‌గఢ్ నుంచి వొచ్చేవాళ్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చిన్నబోయినపల్లి రూట్ నుంచి వొచ్చిన వాళ్లు అదే రూట్‌లో వెళ్తారు. మిగిలిన అందరూ కూడా మేడారం-నార్లాపూర్ క్రాస్‌మీదుగా భూపాలపల్లి దగ్గర్లోని కమలాపూర్ క్రాస్ రోడ్?కు చేరుకొని అక్కడి నుంచి తమ దారిలో వెళ్లిపోతారు. ఈ వన్ వే రూట్ల ప్రకారమే పోలీసులు పార్కింగ్ స్థలాలను సైతం కేటాయిస్తున్నారు.
మేడారం జాతరలో 30 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందించడానికి రెడీగా ఉన్నారు. ఒక్క పోలీస్ శాఖ తరపునే10 వేల మందికి పైగా డ్యూటీలు వేశారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలందిస్తారు. మంత్రులు, రాష్ట్ర, జిల్లాస్థాయి ఆఫీసర్లతో పాటు ములుగు కలెక్టర్, ఎస్పీ వారం పాటు మేడారం జాతరలోనే ఉండేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగులకు డ్యూటీ లెటర్లు పంపించారు.
మేడారం మహాజాతరలో ఏ మూలకు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే పోలీసులు, ఇతర ఆఫీసర్లు అక్కడికి చేరుకోవడానికి వీలుగా జాతర చుట్టూ 500 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను ఫిక్స్ చేశారు. రహదారులతో పాటు జాతర కోర్‌ఏరియా, భక్తుల క్యూల్కెన్లు.. ఇలా అన్ని చోట్లా కెమెరాలు బిగించారు. పోలీస్ శాఖ 3 డ్రోన్ కెమెరాలతో జాతరను పర్యవేక్షణ చేయనున్నట్లు ఎస్పీ శబరీశ్ ప్రకటించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించడం కోసం అన్ని శాఖల అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు. 1996లోనే మేడారం రాష్ట్ర పండుగ జాబితాలోకి వొచ్చింది. జాతీయ పండుగ గుర్తింపు పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుంది. జాతరలో భక్తులకు తాగునీటి అవసరాల కోసం 4.21 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేసింది. ఇక మేడారం వొచ్చే భక్తులందరూ జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఇందుకోసం వారం రోజుల పాటు లక్నవరం నుంచి నీళ్లు వదలాలని నిర్ణయించారు. నీళ్లల్లోకి దిగి స్నానాలు చేయలేని వారి కోసం జంపన్నవాగుకు రెండు వైపులా సుమారు 4 కి.మీ పొడవునా రూ.1.5 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్‌ట్యాప్స్ ఏర్పాటు చేసింది. రూ.50 లక్షలతో జంపన్నవాగులో నిర్మించిన బావుల పూడికతీత పనులు పూర్తయ్యాయి. మోటార్లు పనిచేయడానికి కరెంట్ కనెక్షన్లతో పాటు జనరేటర్లను సైతం ఏర్పాటు చేశారు. కాగా, జంపన్నవాగు వద్ద స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా టెంపరరీ రూములను ఏర్పాటుచేశారు. మేడారం జాతరలో బట్టలు మార్చుకునే గదులు సరిపోక గతంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఈసారి జంపన్నవాగు పొడవునా 4 కి.మీ దూరం రెండు వైపులా ప్రతి 20 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ సైతం ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేస్తోంది. హెలికాప్టర్ల ద్వారా వచ్చే వారికోసం కావలసిన హెలిప్యాడ్ లను సిద్ధం చేశారు.
మహా జాతర తేదీలు
ఫిబ్రవరి 21 : సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు వొస్తారు
ఫిబ్రవరి 22 : సమ్మక్క తల్లి గద్దెకు వొస్తుంది
ఫిబ్రవరి 23 : సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు సమర్పించుట
ఫిబ్రవరి 24 : అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది




