తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలు ( తినదగిన పదార్ధాలతో సహా ) ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు ఆహార అభద్రతను అనుభవిస్తున్నారు. ఇది మొత్తం ఆహార పదార్ధాలలో 19 శాతంగా ఉంది. గృహాల ద్వారా రోజుకు సుమారు ఒక బిలియన్ భోజనం వృధా అవుతుంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో దాదాపు ఐదవ వంతు వృధా అవుతుంది. సగటున ప్రతీ వ్యక్తీ 79 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. వృథాలో పావు శాతం ఆదా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో జీవిస్తున్న 870 మిలియన్ల మందికి ఆహారాన్ని అందించవచ్చు.
ఆహార వ్యర్థాల సూచిక 2024: యు.యన్.ఇ.పి – యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం మార్చ్ 27 తేదీన విడుదలచేసిన ఆహార వ్యర్థాల సూచిక 2024 ప్రకారం ఆహార వ్యర్థాలు 60 శాతం గృహాల నుండి, 28 శాతం ఆహార సేవారంగం నుండి, 12 శాతం రిటైల్ రంగం నుండి వస్తున్నాయి. ఇవి వరుసగా 631మి.ట, 290.మి.ట, 131 మి. ట గా ఉన్నాయి.( మి.ట అంటే మిలియన్ టన్నులు ) ప్రపంచంలోని వార్షిక తలసరి ఆహార వృధా 132 కిలోలుగా ఉంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 12.3 అనేది 2030 నాటికి రిటైల్ మరియు వినియోగదారు స్థాయిలలో తలసరి ప్రపంచ ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించాలని లక్ష్యించింది. చాలా దేశాలు యస్డిజి 12.3 చేరుకోడానికి తగిన వ్యవస్థలు కలిగి లేవు. నాలుగు జి20 దేశాలు (ఆస్ట్రేలియా, జపాన్, యుకె, అమెరికా) యూరోపియన్ యూనియన్ మాత్రమే 2030కి పురోగతిని ట్రాక్ చేయడానికి తగిన ఆహార వ్యర్థాల అంచనాలను కలిగి ఉన్నాయి. కెనడా, సౌదీ అరేబియా తగిన గృహ అంచనాలను మాత్రమే కలిగి ఉన్నాయి.
బ్రెజిల్ అంచనా 2024 చివరిలో అంచనా వేయబడిరది. ఆహార వ్యర్థాలు కేవలం సంపన్న దేశం సమస్య మాత్రమే కాదు. గృహ ఆహార వ్యర్థాల స్థాయిలు అధిక-ఆదాయ, ఎగువ-మధ్య మరియు దిగువ-మధ్య-ఆదాయ దేశాలలో సగటున తలసరి 7 కిలోల చొప్పున తేడాను కలిగి ఉన్నాయి. తాజా ఆహార పదార్థాలను ఎక్కువగా వినియోగించడం, బలమైన కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థకు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, కరువులు వలన ఆహారాన్ని సురక్షితంగా నిలువా చేయలేకపోవడం వంటి కారణాల వలన ఉష్ణ దేశాల గృహాలలో తలసరి ఆహార వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఆహార నష్టం, వ్యర్థాలు వార్షిక గ్లోబల్ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలలో 8-10 శాతం ఉత్పత్తి చేస్తున్నాయని ఇవి విమానయాన రంగం కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువని ఇటీవల డేటా తెలియజేస్తుంది. పెంపుడు జంతువులు, పశువులు మొదలైనవి అందుబాటులో ఉండడం వలన గ్రామీణ ప్రాంతాలు సాధారణంగా తక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నాయి. 2022 నాటికి కాబో వెర్డే, చైనా, నమీబియా, సియెర్రాతో సహా కేవలం 21 దేశాలు మాత్రమే జాతీయ వాతావరణ ప్రణాళికలు కలిగివున్నాయి. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు ఆహార వ్యర్థాలు తగ్గించే ఫలితాలను అందించే ఒక ముఖ్య సాధనం.
మన దేశంలో….ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఆహారంలో దాదాపు 40 శాతం ఆహారం అసమర్థమైన సరఫరా గొలుసు వ్యవస్థ కారణంగా ప్రతి సంవత్సరం వృధా అవుతుంది. విడ్డూరం ఏమిటంటే ఆహారం వినియోగదారునికి చేరకముందే నష్టం జరుగుతుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయబడిన రూ.50,000 కోట్ల విలువగల ఆహారం వృధా అవుతుంది. దేశంలో దాదాపు 23 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. జనాభాలో 15% మంది ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్నారు. నలుగురి పిల్లలలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దాదాపు 3000 మంది ప్రతిరోజు సరైన ఆహారం లేని కారణంగా అనారోగ్యంతో మరణిస్తున్నారు. ఆహార వ్యర్థాలు ప్రధానంగా ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ సమయాలలో జరుగుతుంది. ఇళ్లలో, వివాహాలు, పార్టీలు జరిగేటప్పుడు, హోటల్లలో, ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడిన ఆహారంలో మూడిరట ఒక వంతుకు పైగా వృధా అవుతుందని అంచనా వేయబడిరది.
జీవ పర్యావరణాలపై ప్రభావం: ఆహారం ఉత్పత్తి చేయడానికి మంచి నీరు, భూమి, శ్రమ అవసరం. ఆహారాన్ని వృధా చేసామంటే వీటిని కూడా వృధా చేసినట్లే…! ఈ వినియోగించని ఆహార పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా 8-10% కార్బన్ ఉద్గారాలకు కారణమవుతున్నాయి. ఇవి ప్రతి సంవత్సరం పర్యావరణంలోకి 3.3 బిలియన్ టన్నుల గ్రీన్హౌస్ వాయువులును విడుదల చేస్తాయి. పల్లపు ప్రదేశాలలో కుళ్ళిన ఆహారాలు నుండి విడుదలయ్యే మీథేన్ కార్బన్ డయాక్సైడ్ కంటే మరింత శక్తివంతమైన గ్రీన్హౌస్ వాయువు. ఇది మానవాళికి క్యాన్సర్, శ్వాసకోశవ్యాధులు వంటి వ్యాధులు రావడానికే కాకుండా అంగ వైకల్యంతో పిల్లలు పుట్టడానికి కారకం కూడా. ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది. ఇంకా పర్యావరణ పరంగా మొక్కలు జంతుజాతుల క్షీణత జరిగి దాదాపు 70% జీవ వైవిధ్య నష్టానికి ఈ ఆహార వ్యర్థాలు పరోక్షంగా కారణమవుతున్నాయి.
ఆహార వృధాను ఎలా తగ్గించాలి?
అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైన పరిమాణంలో ఆహారాన్ని కొనుగోలు చేయాలి. ఆహారాన్ని సరిగ్గా భద్రపరచాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి ఉపయోగించడం, అదనపు ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం, ఫుడ్ బ్యాంకులకు పంపించడం మొదలైనవి చేయాలి. మిగిలిన ఆహార వ్యర్థాలను కంపోస్టింగ్ చేయాలి. ఒక ఇంటి కంపోస్టింగ్ ద్వారా 150 కిలోల వరకు ఆహారవ్యర్థాలనునివారించవచ్చు. పండ్లు వంటి వాటిని నిలవాచేయడానికి శీతల గిడ్డంగులును నెలకొల్పాలి. నిలవాకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలి.
జనక మోహనరావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
8247045230





