ఆకాశమంత ఆవేదన…

కవిత్వం ముందు / ఏదీ విలువైంది కాదు /వజ్రం కూడా బొగ్గే / కాని  దాని  కాంతి మాత్రం / మనస్సులో ముద్రించుకు పోతుంది / కవిత్వమంటే  అదే అన్నారు ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. విషయ వైవిధ్యంతో నిర్మాణాత్మకమైన పద్ధతిని అవలంబిస్తూ ప్రావీణ్యతను కనబరిచే కవిత్వాన్ని రాసే కవులు తమ కవిత్వంతో చిరకాలం గుర్తుండిపోతారు. మనిషిని ప్రేమించే కవి సమాజాన్ని ప్రేరేపించగల కవిత్వాన్ని  అందించగలుగుతాడు. కలవరపరిచే సంఘటనలను చూస్తూనే, అనేక కృత్రిమ అవస్థలను  దాటుతూ వెన్నెముక లాంటి కవిత్వాన్ని కవులు నిరంతరం అందిస్తూనే ఉన్నారు. కవిత్వం ఎప్పుడూ శ్రమ జీవుల పక్షాననే నిలిచింది. సహజ సిద్ధమైన ఆలోచనలతో, అలతి అలతి పదబంధాల అమరికతో  అల్లుకుపోయే వేకువ వంటి కవిత్వాన్ని  మర్మం  తెలిసి అందించిన కవులు సాహిత్య లోకంలో ఎప్పటికీ నిలబడిపోతారు. చక్కని రచనా  నైపుణ్యంతో నిరంతరంగా  కవిత్వాన్ని అందిస్తూ  పేరొందిన కవి గజ్జెల రామకృష్ణ. దీపముండగానె అన్న పేరుతో తన తొలి కవితా సంపుటిని ప్రచురించారు.  మలి ప్రయత్నంగా వచ్చిన కవిత్వపు కమనీయ కదంబమే  చంద్రుడు లేని ఆకాశం.

తాతంటే/  పిల్లలు చెప్పుకునే/  బారెడు గుబురు మీసాల బడాయి అని తాత గొప్ప తనాన్ని, ప్రేమాభిమానాలను  చెప్పి ఆయన ఈ లోకాన్ని భౌతికంగా  విడిచి వెళ్ళిన తరువాత పరిస్థితిని వివరిస్తూ ఇప్పుడు తాతంటే/ వరాలు కురువని /  కరువు మబ్బులు కమ్ముకున్న ఆకాశం అని  ఆవేదన చెందారు. నాతో వస్తారా నీలి మేఘాల ఊయలూగి, వాన చినుకులై రాలుదామంటారు. జాబిలి గిన్నెలో పొంగి/  దుముకుతున్న వెన్నెల్లో/  తడిసి ముద్దవుదాం అని ఎంతో భావుకంగా చెప్పారు. అలుగు దునుకుతున్నది కవితలో అమ్మ చేతి ముద్దకే కడుపు నిండిన బుడ్డోడు ఇల్లంతా అంబాడుతున్నట్టు/  చెరువు ఊరంతా పారాడుతున్నది అని చెరువు తన్మయత్వానికి అక్షర సోయగమద్దారు. తెల్ల కాగితం లాంటి/ ఆ గోడ పరాయి పెత్తనం కుప్ప కూల్చిన యుద్ధ ఫిరంగి /  ఏ  అర్థరాత్రి వేళకో/ ఏ  ఉద్యమ చిత్రకారుడో వస్తాడని /  రక్తంతో  తడిపి/  నాలుగు అక్షర సూర్యుల్ని/  వెలిగించిపోతాడన్న నమ్మకంతో  ఎదురు చూస్తున్నదని అన్నారు. ఇది కవిలోని శిఖరాయమానమైన అభివ్యక్తి శక్తికి నిదర్శనం.

తిన నేర్చిన నోరు ఉపాసముంటుందా..? /  పెద్దపులి లొట్టలేస్తున్నదని హెచ్చరించారు. నిద్ర కనురెప్పల చాటున ఇష్టంగా/  కమ్మటి కలల చిత్రాలు గీస్తూ ఉండగా/  ఉదయం ముఖంపై /  వేకువ నీళ్లు చల్లుతుంది అన్న వాక్యాలు కవి భావోన్నతికి ప్రతీకలుగా నిలిచాయి. అరిటాకంత విస్తారు కుడుతుండగా పేలిన/  రోడ్డు వెడల్పు మందు పాతర/  ఇప్పుడక్కడ/  ఏ గుండెను ముట్టినా దుఃఖం చిట్లుతున్నది అని జీవన ధైన్యాన్ని హృదయద్రావకంగా కవి చిత్రించారు. బ్రతుకే దూరమవుతుంటే /  ప్రగతి పథమా/  నిన్నెట్లా స్వాగతించేది అన్నారు. పాలు మరవని బిడ్డ/ తల్లి ఆవుకు దూరమయినట్టు/ అర్థరాత్రి కలవరింత /  అరికాలి ముల్లులా కలుక్కుమంటుంది అని చెప్పారు.  ఉలిక్కి పడ్డ గోడకు మేకు దిగని స్వతంత్రం అంటూ నిర్వేదన చెందారు. దేవతలు మెచ్చిన చెట్టు లాంటి అమ్మ ప్రేమకు కవిగా పాదాభివందనం  చేశారు. కలకాలం నిలిచే కవిత్వం అమృతం తాగినంత అనుభూతితో  సమానమని అభివర్ణించారు. ఎంత దాచుకున్నా రెక్కల కష్టం దోచుకునే వారే ఎక్కువ అని అన్నారు. తృప్తిగా ఒక్కసారైనా బతకడానికి తనకు విశ్రాంతి కోసం ఒక్క సెలవు కావాలని కోరుకున్నారు. అవసరానికి పావు కదిపే మనిషిది రాజకీయం తప్ప ఇక్కడ మరేమీ  లేదన్నారు. ఊరు వలస పాటతో దిగులులోని దయనీయతను చూపించారు. వెలితి రాగం సామాన్యుని బతుకును ప్రశ్నార్థకంగా మార్చేసిందని అన్నారు. మట్టి మనుషుల గుండెల మీద తొక్కుతూ ఇనుప కాళ్ల రాక్షసి కన్నీటి కాలువలు తవ్వుతున్నదని వేదన చెందారు.

కంటి మీద వాలుతున్న చీకటి/  తోక ముడుచుకుని పోయేలా/  ముఖానికి కట్టుకున్న లాంతరు/  కళ్ళజోడు కళ్ళు ఎత్తుకున్న ముక్కు మీది కిరీటం అని కళ్ళజోడు ప్రాధాన్యతను ఎంతో స్పష్టంగా విడమర్చి చెప్పారు. బస్సును కవిత్వం ఊరేగుతున్న ఏనుగంబారిగా చూపారు. ఆ మూలమీది చాయిబండి/  మానవ సమ్మేళనం అవుతుంది/  కొంతలో కొంత /  బాధల బరువు పంచుకునే/  వేదిక  అవుతుంది అని చెప్పారు. కవిత్వాన్ని కళ్ళకద్దుకోవాలన్నారు. ఊరుకుంటూపోతే /  ఉప్పు కూడా బంగారమయ్యే/  సుంకం పొద్దుపొడుస్తున్నదని ఆకాశాన్నంటిన అదుపులేని ధరల విపరీత పరుగును ఖండించారు. ఎదురీదు చేపలకు గమ్యం చేరేందుకు కొత్తనీరు సాయమవుతుందన్నారు. బాల్యమప్పుడే మనిషికి స్వేచ్ఛా ప్రపంచమంటూ ఇప్పటి వ్యధాభరిత జీవితాన్ని, కన్నీటి కొణాల్ని విశ్లేషించారు. బతుకు పద్యాన్ని పేనుకునే మేలు గంథం కోసం పరితపించారు. పాలకంకులు నములుకుంటూ నడిచిన బడిబాట జ్ఞాపకాల సద్దిమూటే అన్నారు. ఎట్లా చెప్పాలి/  ఈ పనే అట్లుంటది అని పోగుబంధాన్ని తెలిపారు. మృగశిర వేళ చేపల కూరంటే/  పిల్లలతో కలిసి/  పెద్దలు భోంచేసే  మీనోత్సవం అన్నారు. ఎప్పుడయినా ఎక్కడయినా బాధితులే బాధలను పంచిపెట్టే ప్రచారకర్తలు అని చెప్పారు. నాడె వట్టినప్పటి నుండి పేనుతున్న  బట్ట కట్టే భాగ్యం కలిగిందని తెలిపారు. చంద్రుడు లేని ఆకాశం కవితలో దిగులు గూట్లో ఒంటరి పద్యం, ఎండకొమ్మపై కునుకు అంటని ఏకాకి రాగాన్ని ప్రస్తావించారు. చెట్టు లాంటి సంఘానికి నీళ్ళు పోయాల్సింది పోయి నీళ్ళొదులుకున్నామని వేదన పడ్డారు.

పంట మీది కలలను దోచుకుపోయే వడగండ్ల కుట్రల్ని ఎండగట్టారు. తాటి వనాలను పగడపు దీవులతో పోల్చారు. అప్పులు, బాధలకు నాయిన పెట్టిన పేరు గుట్ట చుట్టూ తలకాయలని తెలిపారు. రాత్రిని మంచి నీళ్ళకుండ, పగలుని నెత్తుటి దీపంతో పోల్చారు. ఆడపిల్ల కరువయిన లోకాన కొలువు సంబంధాలు, చదువు దీపాల కోసం దిక్కులన్నీ గాలించిన భావనను వ్యక్తం చేశారు. నాయిన కాలం తోవలో ముండ్లున్నా తివాచీ పరిచినట్టుండేదని, ఇప్పుడు ఇల్లు దాటి ఊళ్ళోకి వెళ్ళడమంటే పిచ్చుక బ్రహ్మాస్త్రానికి ఎదురెళ్ళడమేనని తెలిపారు. భూ వ్యాపార బూచాడి కాటుతో పేదోడి కాళ్ళక్రింద భూకంపం ఏర్పడి భోరున ఏడ్చిన వైనాన్ని చెప్పారు. అనేకానేక అంశాలను సందర్భోచితంగా, సమయోచితంగా సమన్వయ పరుస్తూ విలక్షణమైన శైలితో        ఆసాంతం కవిత్వం కొనసాగింది. సమాజంలోని శ్రమను, దుఃఖాన్ని ఒకవైపు బాధ్యతతో మోస్తూనే మరోవైపు విషయ వైవిధ్యంతో,  మంచి ప్రావీణ్యతను కనబరుస్తూ అక్షర సూర్యుల్ని ఈ కవి నిమగ్న నిబద్ధతతో వెలిగిస్తున్నారు.
– డా. తిరునగరి శ్రీనివాస్
8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *