ప్రతీ ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలవల్ల కాస్తు కాలాన్ని ఒక నెల ముందుకు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. అది వేసవి అయినా వర్షాకాల పంటలైన ఏదో కారణంగా రైతు ఆరుగాల కష్టాన్ని పుట్టి ముంచుతున్నాయి. అనుకోని తుఫాన్ వల్ల లేదా అతి వర్షాలు, వర్షాలు ఆలస్యంగా పడడం ఏదైనప్పటికీ చివరకు నష్టపోతున్నది రైతే. గతంలో ప్రతీ వేసవి పంటలకు నీటి కొరత కనిపించేది. కాని, తెలంగాణ ప్రభుత్వం కొన్నేండ్లుగా చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా నూటికి 90 శాతం వ్యవసాయ రంగానికి నీటి కొరత లేకుండా పోయింది. చాలా వరకు చెరువులు, కుంటలు సమృద్ధిగా నిండిఉండడంతో వేసవి పంటల విషయంలో రైతులు పెద్దగా ఆందోళన చెందండంలేదు. పంట విస్తీర్ణంతోపాటు, దిగుబడికూడా బాగేనే పెరుగుతూ వొచ్చింది. అయితే ఉత్పత్తి ధాన్యాన్ని సకాలంలో కొనడంలో ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో వివిధ జిల్లాలో నేటికీ ఇంకా కొనుగోళ్ళు పూర్తి స్థాయిలో జరుగలేదంటే అందుకు ప్రభుత్వ యంత్రాంగం లోపమని చెప్పకతప్పదు. అనేక జిల్లాల్లోని అనేక గ్రామాల్లో అనుకోకుండా పడిన వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దఅయింది. చాలా ప్రాంతాల్లో ధాన్యం బస్తాల్లో నింపినవాటిల్లో మొలకలు వొచ్చాయి. మరికొన్ని చోట్ల వర్షానికి ధాన్య కొట్టుకుపోయింది. రైతు పడిన కష్టమంతా వర్షార్పణమైంది.
ఇది ఈ ఒక్క సంవత్సరమని కాకుండా ప్రతీఏటా కోతల సమయంలో ఈదురు గాలులు, తుఫాన్ ప్రభావంతో వ్యవసాయరంగాన్ని నష్టపరుస్తూనే ఉంది. వీటన్నిటి దృష్ట్యా పంటకాలాన్ని కనీసం ఒక నెల రోజుల ముందుకు తీసుకు వెళ్ళాలని ప్రభుత్వం సూచన చేసింది. దానివల్లనైనా కొంతవరకు ఇబ్బందిని అధిగమించవొచ్చనుకుంది. కాని మనం అనుకున్నట్లు సహకరిస్తే ప్రకృతి ప్రధాన్యమేముంటుంది. ఉదాహరణకు వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడుస్తున్న తొలకరి మాటేలేదు. రోహిణిలో రోళ్ళు పలిగే ఎండలైనా, వానలైనా ఉంటాయంటారు. కాని, ఈసారి ఎండ తీవ్రతే ఎక్కువగా ఉంది. ఏ జిల్లాలో చూసిన 40 నుంచి 45 డిగ్రీలకు మించే ఉష్ణోగ్రత నమోదు అవుతున్నది. ఉదయం తొమ్మిది గంటలనుండే వేడిగాలులు వీస్తున్నాయి. ఈ నెల 14 నుండి పాఠశాలలు తెరిచినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను పూర్తి స్థాయిలో స్కూళ్ళకు పంపడంలేదంటే ఎండ తీవ్రత ఎలా ఉందన్నది అర్థమవుతున్నది. మరి కొద్ది కాలం ఒంటిపూట బళ్ళు పెట్టాలని కొందరు, సెలవులు పెంచాలని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే వాతావరణ నిపుణుల లెక్కల ప్రకారం జూన్ ఆరున తొలకరి జల్లులు పడాల్సి ఉండింది. అందుకు రైతులు ముందస్తుగానే దుక్కులు దున్ని తమ వ్యవసాయక్షేత్రాలను సిద్ధం చేసుకున్నారు.
కావాల్సిన విత్తనాలు, ఎరువులను కూడా కొనుగోలుచేసి వర్షం ఎప్పుడొస్తుందా అని ఆకాశంవైపు ఎదురు చూస్తూ కూర్చున్నారు. తెలంగాణలో దాదాపు 1.36 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో దాదాపు 50శాతం వర్షాధారంగా పండే పంటలే ఉంటాయి. ప్రభుత్వం చెబుతున్న పంటల మార్పిడిపై రైతులు శ్రద్ధ పెట్టక పోవడంవల్ల వరి లాంటి పంటలకు సాగునీరు అవసరం తప్పనిసరి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాల్లో లేని వర్షాభావం ఈసారి ఏర్పడబోతున్నదా అన్న అనుమానానికి తావేర్పడుతోంది. పదిరోజులు గడిచిన చిన్న చినుకుకూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులుకూడా రైతులను తొందరపడవొద్దని హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఆలస్యంగా చేరుకునే అవకావం ఉండడంతో రైతులు తొందరపడకుండా వర్షం పడినతర్వాతనే విత్తనాలు చల్లుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ చెబుతున్న దాన్ని బట్టి ఈ నెల 20, 21 తేదీ వరకు వర్షాభావ పరిస్థితులే కొనసాగుతాయని తెలుస్తున్నది. గత నెల మూడవ వారంలో పడిన ఆకాల వర్షాలు పంటలకు నష్టం చేశాయేగాని ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఈ నెల 11వ తేదీన ఏపీని తాకిన రుతుపవనాలు చలనంలేకుండా అక్కడే నిలిచి పోయాయని వాతావరణ అధికారులు చెబుతున్నమాట. అవి మరో రెండు రోజుల్లో ఆ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని, ఆ మరుసటి రోజు వరకు తెలంగాణకు విస్తరిస్తాయంటున్నారు. అందుకు మరో రెండు మూడురోజులవరకు రైతులు ఆకాశంవైపు చూస్తూ ఉండక తప్పదు.




