పార్టీ వీడుతున్న పార్టీ శ్రేణులు
వలస నాయకులకు పెద్ద పీఠ వేయడమే కారణమంటున్న విశ్లేషకులు
అసలైన ఉద్యమ కారుల పట్ల నిర్లక్ష్యం
(మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రతినిధి)
బిఆర్ఎస్ మరోసారి అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూకుమ్మడిగా తెరాస ఎమ్మెల్యేలను తీసుకుపోయినప్పుడు ఎదురైన సమస్యకన్నా పెద్ద సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వొస్తుంది. ఒకరివెనుక ఒకరుగా రోజూ ఎవరో ఒకరు పార్టీని వీడుతుండడంతో పార్టీ అచేతనానికి గురి అవుతున్నది. ఒకరిద్దరిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో చూస్తూ ఊరుకోవడంకన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇప్పుడాపార్టీ ఉంది. ఒకనాడు బిఆర్ఎస్(టిఆర్ఎస్)కు ఎదురొడ్డి నిలబడాలంటే జంకే పార్టీల నుండి నేడు పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినా స్వీయపార్టీ నేతలు పారిపోతున్న పరిస్థితి ఏర్పడిరది. అభ్యర్ధుల ఎంపికకు ముందే తాము పోటీ చేయబోమని కొందరు ప్రకటిస్తుంటే, పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ‘సారీ’ అని చెబుతున్నవారితో పార్టీ అధినాయకత్వం షాక్‌కు గురి అవుతున్నది. తాజాగా వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య తీసుకున్న నిర్ణయంతో బిఆర్ఎస్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది.
వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కడియం కావ్యను ఎంపిక చేయడంలోనే సిట్టింగ్ ఎంపిని పార్టీ కోల్పోయిం ది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ లోకసభ సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ మరోసారి తనకే అవకాశం ఇవ్వాలంటూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనను కాదని రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, స్టేషన్‌ఘణపూర్ బిఆర్ఎస్ ఎమ్మేల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురు డా. కావ్యకు ఈ సీటు ఇప్పించుకోవడంలో కృతకృత్యుడైనాడు. దీనితో అలిగిన పసునూరి దయాకర్ కాంగ్రెస్ కండువ కప్పుకోవడంతో బిఆర్ఎస్ తన సిట్టింగ్ ఎంపీని కోల్పోయిం ది. ఎంతో రాజకీయ చైతన్యం గల వరంగల్ టికెట్ విషయంలో బిఆర్ఎస్కు చెందిన అనేకులు పోటీపడినప్పటికీ, కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని కావ్యకే పార్టీ అవకాశాన్నిచ్చింది. కాని, ఎవరూ ఊహించని విధంగా తాను పోటీచేయడంలేదంటూ కావ్య సరాసరి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌కు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా ఆమె పార్టీ విధానం పైన విమర్శలు కూడా చేశారు. దిల్లి లిక్కర్ కేసులో కవిత ఆరెస్టు కావడం, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణంలాంటి పలు ఆరోపణలతో పార్టీ అప్రదిష్టపాలు అవడంవల్ల తాను పార్టీ పక్షాన పోటీ చేయలేనని ఆ లేఖలో స్పష్టంచేసినట్లు తెలుస్తున్నది. అయితే మరో విచిత్రకర విషయమేమంటే పార్టీకి ఎంతో లాయల్‌గా ఉంటున్న ఆమె తండ్రి కడియం శ్రీహరికూడా పార్టీ వీడేందుకు సిద్ధపడడం.
తెలుగుదేశం నుండి బిఆర్ఎస్లోకి వొచ్చిన కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి లాంటి పదవిచ్చి గౌరవించిన కెసిఆర్‌ను కాదని ఆయన తన కూతురుతో సహా పార్టీ ఫిరాయించడాన్ని బిఆర్ఎస్ తట్టుకోలేకపొతున్నది. కడియం శ్రీహరికి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్గణపూర్ టికెట్ ఇచ్చే విషయంలో కూడా పార్టీ మరో సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మేల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను వదులుకోవాల్సి వొచ్చింది. పార్టీ టికెట్ కోసం చివరి వరకు పోరాటం చేసిన రాజయ్య తన మాతృసంస్థ కాంగ్రెస్‌లో చేరిపోయారు. రాజయ్య ఒక విధంగా తెలంగాణ కోసం ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడిన మొదటి వ్యక్తి. ఆవిధంగా శ్రీహరి, కావ్యలకు సీట్లు కేటాయించడంలో ఇద్దరు నాయకులను బిఆర్ఎస్ కోల్పోవాల్సివొచ్చింది. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ తనకు అత్యున్నత స్థానాన్ని కలిగించినా తన మాతృ సంస్థలోనే సంతృప్తిగా కన్నుమూస్తానని పార్టీ సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు ప్రకటించడం బిఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్.
ఆయన కూడా తన కూతురు హైదరాబాద్ నగర మేయర్ (బిఆర్ఎస్) విజయలక్ష్మితో సహా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. తనను కెసిఆర్ ఎంతో గౌరవించారంటూనే పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిరదని చెబుతున్నారు. అంతెందుకు ఆ ముగ్గురు తప్ప ఏ బహిరంగ సభలోనైనా ఇతరులకు అవకాశం లభించకపోవడాన్ని ఆయన ఎత్తిచూపుతున్నారు. ప్రతిభావంతులు, సమర్ధులు పార్టీలో అనేకులున్నా వారికి తగిన ప్రాధాన్యత లేకపోవడం, పుష్కలంగా క్యాడర్ ఉన్నా దాన్ని సమర్థవంతంగా వాడుకోకపోవడం ఆ పార్టీ పతనానికి కారణంగా మారుతుందంటూ మీడియా ముందు తన అభిప్రాయాలను కెకె వెల్లడిరచడం గమనార్హం. అనేక ఆరోపణల వలయంలో ఆ పార్టీ చిక్కుకోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వొచ్చిందని బిఆర్ఎస్ ఎమ్మేల్యే కడియం శ్రీహరి అంటున్నారు. ఏదిఏమైనా తండ్రి బిడ్డల రెండు జంటలు త్వరలోనే కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపిలు, ఎమ్మేల్యేలు మరి కొందరు సీనియర్ నాయకులు, వివిధ సంస్థల ఛైర్మెన్ లు పార్టీ మారినా పెద్దగా స్పందించని కెసిఆర్ కెకె వెళ్ళడాన్ని మాత్రం తట్టుకోలేకపోయినట్లు కనిపించింది. తాను ఏం తక్కువ చేశానని ఇలా నమ్మినవాళ్ళు తనను నట్టేట ముంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.
ఉద్యమంలో తనవెంట లేకపోయినా, వివిధ సమీకరణలతో వారిని దగ్గరకు తీసుకుని అందలం ఎక్కిస్తే అధికారం కోల్పోగానే తన నమ్మకాన్ని వమ్ము చేస్తారా అని కెసిఆర్ అసహనానికి గురిఅయినట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు రెండు జాతీయ పార్టీలతో పెంచుకున్న వైరం కారణంగా ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య నలిగిలోపోవాల్సి వొస్తున్నది. బిఆర్ఎస్ నుండి బయట పడుతున్న వారంతా కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో చేరిపోతున్నారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల్లోకి వెళితే పదవులు అనుభవించవొచ్చు, పనులు చేసుకోవొచ్చన్నది వారి ఆలోచన. ఇదిలా ఉంటే ఉద్యమ నాయకులను కాదని వలస నాయకులను అందలం ఎక్కించడమే బిఆర్ఎస్ పార్టీ చేసిన పెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాటం చేసిన వారిని గుర్తిస్తే పార్టీకి మళ్ళీ పునర్వైభవం కలుగుతుందంటున్నారు.





