‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం…

(గత సంచిక తరువాయి)

‘‘పెరుగుతున్న కుటుంబ హింస’ – సారా వ్యతిరేక,
మద్య నిషేధ ఉద్యమంలో రాజ్య నిర్భందాన్ని, గుండాల దాడిని ఎదుర్కొన్న ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తలు’’

సజయ : అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వుధృతంగా వ్యాపించటంలో ‘పీవోడబ్ల్యూ’ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతారు. మీరు ఎక్కడెక్కడ క్రియాశీలకంగా పనిచేశారు?
సంధ్య: 92లో సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరులో అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా సీతమ్మ కథ ద్వారా నెల్లూరు దూబగుంట లో ఒకవైపున ప్రారంభమైంది. ఇంకోవైపున కరీంనగర్‌ ‌లో ఉత్తర తెలంగాణలో అంతకుముందు నుంచీ ఈ ప్రాంతాల్లో కూడా సారాకు వ్యతిరేకంగా స్త్రీల పోరాటం మొదలైంది. అయితే చాలామంది నెల్లూరు దూబగుంట నే ప్రధానంగా చెబుతారు. అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా అక్కడ పనిచేసిన విజయభారతి అక్క లాంటి వాళ్లు చాలా గ్రామాల్లో తిరిగి స్త్రీలను చైతన్యవంతం చేశారు. దీనికన్నా ముందే ఖమ్మం జిల్లా వేపగుంట్ల అనే గ్రామంలో స్త్రీలు వాళ్ల వూర్లో సారా వుండటానికి వీల్లేదని పోరాటం చేశారు. సారా కాంట్రాక్టర్లు దానిని ఒక ప్రిస్టేజ్‌ ఇష్యూ గా తీసుకుని ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలపై దాడి చేశారు.

అక్కడ జరిగిన పోరాటం మీద ప్రజా రచయిత కళాకారుడు శక్తి ‘పులిజూదం’ అనే నవల రాశాడు. ఆ ప్రాంతంలో వచ్చిన ప్రజా ఉద్యమం నేపథ్యంలో ఆ నవల వచ్చింది. దానిలో, గ్రామ మహిళలు ఎందుకు సారా వద్దనుకున్నారు, కలిసి ఎలా నిర్ణయం తీసుకున్నారు, వారికి మహిళా సంఘం ‘పీవోడబ్ల్యూ’ ఎలా అండగా నిలబడింది అని వివరంగా వుంటుంది. జిల్లా సంఘం మొత్తం ఆ మహిళల పోరాటం వెనుక దన్నుగా నిలబడింది. అటు కాంట్రాక్టర్లు భయోత్పాతాన్ని, దాడులను చేస్తే, ఇటు పోలీసులు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు మా కార్యకర్తల మీద. అప్పుడు ఖమ్మం జిల్లా నాయకులుగా అరుణ, ఝాన్సీ, కల్లూరు ప్రాంతంలో రమ, బయ్యారం ప్రాంతంలో విమల నాయకత్వం వహిస్తున్నారు. మహిళా సంఘంగా కానీ, పార్టీ గా కానీ ఆ ఉద్యమం చాలా ప్రభావం చూపించింది. ఇంకోవైపు ఉత్తర తెలంగాణ లో కూడా సారాకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. అప్పుడు గోదావరిఖనిలో చాలా పెద్ద రాలీ జరిగింది. తర్వాత నెల్లూరులో డాక్టర్‌ ‌విజయకుమార్‌ ‌గారు వాళ్లు ఒక పెద్ద మీటింగ్‌ ‌పెడితే మేమందరం గోదావరిఖని నుంచీ చాలామందిమి నెల్లూర్‌ ‌వెళ్లి అక్కడి ఉద్యమాన్ని పరిశీలించి, అందులో పాల్గొన్నవాళ్లను, సపోర్ట్ ‌గా నిలిచిన ఇంటలెక్చ్యువల్స్ ‌ను కలిసి మాట్లాడి వచ్చాము. అక్కడినుంచీ నెల్లూరు కావలి మధ్యనున్న సాయిపేట కి వచ్చాము.

అక్కడ విప్లవోద్యమం నాయకత్వంలో ఉద్యమం నడుస్తోంది. ‘పీవోడబ్ల్యూ’ స్త్రీ విముక్తి శ్రీదేవి ఇంకా కొంతమంది ఆధ్వర్యంలో అక్కడ పోరాటం సాగుతోంది. అక్కడికి కూడా వెళ్లి పరిశీలించాము. మా ‘పీవోడబ్ల్యూ’ ఆధ్వర్యంలో ఖమ్మంలో, నిజామాబాద్లో జ్యోత్స్న అక్క ఇతర కార్యకర్తలు వూరూరా వెళ్లి తిరిగి ప్రచారం చేశారు. కర్నూల్లో స్త్రీ విముక్తి తరఫున సంధ్యక్క నాయకత్వంలో వాళ్లు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అట్లా వివిధ ప్రాంతాల్లో ‘పీవోడబ్ల్యూ’ గా వున్న సంఘాలు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లటంలో ప్రధాన బాధ్యత వహించారు. ఖమ్మం, వరంగల్‌ ‌ప్రాంతాల్లో సారా కాంట్రాక్టర్లకి మాకు బాహా బాహీ యుద్ధమే జరిగింది. మొదటిసారి ఒక ప్రైవేట్‌ ‌సైన్యం లాగా కాంట్రాక్టర్లు మహిళా ఉద్యమం మీద దాడిచేసిన సందర్భం సారా వ్యతిరేక ఉద్యమంలో జరిగింది. అయితే నెల్లూరు ఒకటే చాలామంది చూశారు. కానీ ఆ సమయంలో, ఆబ్కారీ వేలంపాటలను (అదికూడా అక్టోబర్‌ 2 ‌గాంధీ జయంతి రోజు జరుగుతాయి!) మేము వొంగోలు లో ఆపగలిగాము. వరంగల్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం, నల్గొండ లలో ప్రొటెస్ట్ ‌చేశాము. ఇలా చాలా సెంటర్స్ ‌లో మిలిటెంట్‌ ‌రోల్‌ ‌ని ‘పీవోడబ్ల్యూ’గా మేము తీసుకున్నాము. ఆ దశలో హైదరాబాద్‌ ‌లో ఒక పెద్ద రాలీ కూడా తీసాము.

ఐక్య ఉద్యమం చేద్దాం అని మేము ‘పీవోడబ్ల్యూ’ గా ఇనీషియేట్‌ ‌చేసి అన్ని వామపక్ష మహిళా సంఘాలతో ఐక్య కార్యాచరణ చేశాము. ఐద్వా నుంచీ మల్లు స్వరాజ్యం గారు, పుణ్యవతి, మహిళా సమాఖ్య నుంచీ గుజ్జుల సరళాదేవి, సుగుణక్క, సావిత్రి గారు వచ్చారు. ఇది 92-93 ప్రాంతంలో! అయితే, అప్పుడు వాళ్లు తెలుగుదేశంతో పొత్తులో వున్నారు. ఈ ఉద్యమంలో తెలుగుమహిళ సంఘాన్ని కూడా కలుపుకు పోదామని వీళ్లందరూ ప్రతిపాదన చేశారు. వాళ్లతో కలిసి పని చేయాలా వద్దా అని చర్చించుకుని, సరే పిలుద్దాం అనుకుని పిలిచాం. తెలుగు మహిళ తరఫున ప్రతిభా భారతి వచ్చారు. నెల్లూరు లో సభ అయిన తర్వాత హైదరాబాద్‌ ‌లో కోటి విమెన్స్ ‌కాలేజీ పార్క్ ‌దగ్గర నుంచీ రాలీ తీసి, ఎల్బి స్టేడియం బాబుజగజ్జీవన్రామ్‌ ‌విగ్రహం వద్ద ఒక పెద్ద సభ పెట్టాము. అక్కడ వావిలాల గోపాల కృష్ణయ్య గారు, సూర్యదేవర రాజ్యలక్ష్మి గారిని వేదికల మీదకు పిలిచాము. దాదాపు ఎనిమిది వేలమంది దాకా మహిళలు వచ్చారు. ఆ సమయం లోనే సారా వ్యతిరేక ఉద్యమం మద్య నిషేధ ఉద్యమంగా మారింది. అప్పుడు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నాడు. అక్టోబర్‌ 2 ‌వ తేదీ గాంధీ జయంతి రోజున సికంద్రాబాద్‌ ‌పాట్నీ సెంటర్‌ ‌లోని గాంధీ విగ్రహం దగ్గర మోహరించి, విగ్రహానికి దండ వేయడానికి వచ్చిన ఆయన్ని రాకుండా అడ్డుకున్నాం.

తర్వాత ప్రతిపక్షంలో వున్న ఎన్టీఆర్‌ ‌వచ్చాడు. ఆయన్ని కూడా ఆపేశాము. ‘సీసాల్లో వున్న సారాని వారుణ వాహిని పేరుతో పాకెట్లలోకి నువ్వు మార్చావు, ఇదంతా మీ వల్లనే జరిగింది’ అని ఆయన్ని కూడా అడ్డుకున్నాం. ఎన్టీఆర్‌ ‌మొహం ఎర్రగా కందగడ్డలాగా చేసుకుని చాలాసేపు ఏమీ మాట్లాడకుండానే పక్కన నిలబడ్డాడు. చంద్రబాబు వచ్చి ఆయన్ని దండ వేయనీయండి అని మాతో అంటున్నాడు. మేము ససేమిరా అని అంటుంటే, అప్పుడు మల్లు స్వరాజ్యం గారు, గుజ్జుల సరళాదేవి గార్లు ‘ఆయన మన మిత్రపక్షం గా వున్నారు, దండ వేయనిద్దాం’ అని నచ్చచెప్పారు. అప్పుడు ఎన్టీఆర్‌ ‘ఏం ‌చేస్తే దండ వేయనిస్తారు’ అని అడిగితే, మీ పార్టీ విధానంగా నిషేధం ప్రకటించండి అని డిమాండ్‌ ‌చేశాం. నేను అందించిన మైక్‌ అం‌దుకుని ‘మేము అధికారంలోకి వస్తే, వెంటనే మద్య నిషేధం ప్రకటిస్తాము’ అని చెప్పి గాంధీ విగ్రహానికి దండ వేశాడు. మల్లాది సుబ్బమ్మ, త్రిపురాన వెంకటరత్నం అందరూ వున్నారు.

అప్పుడు అక్కడ. ఆ తర్వాత ప్రతిపక్షంలోవున్న ఎన్టీఆర్‌ ‌ని దండవేయనిచ్చి ముఖ్యమంత్రి ని అడ్డుకున్నామని పోలీసులు లాఠీ ఛార్జీ చేసి మమ్మల్ని చితకకకొట్టారు. హైదరాబాద్‌ ‌బస్తీల నుంచీ వచ్చిన మహిళలతో మూడువేలమందికి పైగా వున్నాం. వాళ్లు కొట్టిన కొట్టుడికి నేనయితే సొమ్మసిల్లి పడిపోయాను. అంత భీభత్సంగా కొట్టారు. మమ్మల్ని చెల్లాచెదురు చేసిన తర్వాత ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి వచ్చి గాంధీ విగ్రహానికి దండవేసి వెళ్లాడు. మర్నాడు అన్ని పేపర్లు ఆరోజు జరిగిన ఈ సంఘటనని హెడ్‌ ‌లైన్స్ ‌లో వేశారు. ఈ సంఘటన తర్వాత మద్య నిషేధం ఎన్నికల నినాదంగా మారింది. దాన్ని తెలుగుదేశం బాగా వాడుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ ‌తాను చెప్పినట్లుగానే మద్య నిషేధం పెట్టాడు. ఆ తదనంతరకాలంలో జరిగిన పరిణామాలతో మా అందరి మధ్యా నిషేధమా, నియంత్రణా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది.

సజయ: అంతకు ముందు దీనిమీద ఏ రకమైన చర్చా జరగలేదా?
సంధ్య: అంతకు ముందు నిషేధమే అనేదానితో అందరం వున్నాం. ఎందుకంటే సారా మీద ఎక్కువ ఫోకస్‌ ‌వుండేది. అది పేదవర్గాలకు సంబంధించినది, శ్రామికవర్గ కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మా దృష్టిలో వుండేవి. సారా వ్యతిరేక ఉద్యమానికి, మద్య నిషేధ ఉద్యమానికి మధ్య ఒక సంవత్సరం మాత్రమే దూరం వుంది. చాలామంది ఈ రెండింటి మధ్యా చాలా ఎక్కువ సమయం వుందనుకుంటారు. అసలు చర్చ ఎప్పుడు మొదలయిందంటే, ఈ నిషేధం తర్వాత రకరకాల డ్రామాలు జరగటం.. రాష్ట్ర సరిహద్దుల నుంచీ మద్యం లోపలికి వస్తోందని, ఎకానమీ దెబ్బ తింటోందనీ, ఉద్యోగులకు జీతాలు ఆపేయటం ఇలా చాలా డ్రామాలు జరిగాయి. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ ‌ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు అధికారంలోకి రావటం, మద్య నిషేధం ఎత్తివేసి దశల వారీగా నియంత్రణ అమలు చేస్తామని చెప్పటం ఇవన్నీ జరిగిపోయాయి. (అయితే, అప్పటి నుంచీ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు మద్యం విషయంలో సంక్షేమ పథకాలకు ముడిపెడుతూ అవే డ్రామాలు చేస్తూ వస్తున్నాయి. అది వేరే విషయం.) దీనిమీద చాలా రియాక్ట్ అయ్యాము మేము. మద్య నిషేధం వల్ల ఉపయోగం పొంది మనశ్శాంతి వచ్చిన అనేక లక్షల కుటుంబాలు వున్నాయి. సారా వ్యతిరేక ఉద్యమం కన్నా మద్యనిషేధ ఉద్యమంలో మధ్యతరగతి స్త్రీలు ఎక్కువ మంది వచ్చారు.

సారావ్యతిరేక ఉద్యమం అచ్చంగా గ్రామీణ శ్రామిక వర్గాలకు సంబంధించిన విషయంగా వుంది. అయితే, నిషేధం వున్నప్పుడు కుటుంబ ఆదాయాలు ఎంత పెరిగాయి, పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం ఎంత పెరిగింది అని ఎన్టీఆర్‌ ‌ప్రభుత్వం మొదటి సంవత్సరం ప్రకటించింది. మహిళా సంఘాలని పిలిచి ఒక రివ్యూ మీటింగ్‌ ‌కూడా పెట్టి రిపోర్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ అయితే, ‘అమ్మా మీరందరూ ఈ విషయంలో చాలా కష్ట పడ్డారు’ అని కూడా చెప్పాడు ఈ సమావేశంలో. ఈ ఉద్యమాలన్నిటిలో అన్ని‘పీవోడబ్ల్యూ’ సంఘాలు చాలా కీలకపాత్ర వహించాయి. చాలా నిర్బంధాన్ని, కేసులను కూడా మా కార్యకర్తలు ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్ల ప్రైవేట్‌ ‌గుండాల దాడులను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుచేసుకోవాలి. సింగరేణి బెల్ట్ అం‌తా కూడా మద్యం ఏరులై ప్రవహించేది. ఎక్కడైతే ఆదాయం స్థిరంగా వుంటుందో అక్కడ వీటి అందుబాటు, అమ్మకాలు ఎక్కువ వుంటాయి. అక్కడ కుటుంబ హింస కూడా ఎక్కువ వుంటుంది. ఇది మా ప్రత్యక్ష అనుభవం. ఈ మద్యం వల్ల భార్యాభర్తల మధ్య ఎడతెగని పంచాయితీలు వుండేవి. భార్యల మీద చెప్పలేనంత క్రూరమైన హింస జరిగేది. గునపాలతో పొడవటం, తల నరకటం వంటి సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. అలాంటి ఒక పంచాయితీలో సర్ది చెప్పబోయిన మా కార్యకర్తలు ఇద్దరు హత్య చేయబడ్డారు. ‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం.. పెరుగుతున్న కుటుంబ హింస’ అని ఒక కరపత్రం వేసి చాలా పెద్ద కాంపైన్‌ ‌చేశాము.
(ఇంకా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page