రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లోనూ రాజకీయ పార్టీలు ఎవరిదారి వారిదే అన్నట్లు మరీ పోటీపడి కార్యక్రమాలను చేపట్టాయి. తొమ్మిది సంవత్సరాల కింద ఏర్పడిన తెలంగాణకు కారణం తామంటే తామని చెప్పుకునేందుకు ఈ పార్టీలు నానా అవస్థలు పడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్న తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు సకల జనులతో పాటు సకల రాజకీయ పార్టీలుకూడా ఎంతో కొంత కారణమన్నది నిజం. ఈ పార్టీలు మొదట్లో ముందుకు రాకపోయినా, వొచ్చినప్పటికీ ద్వంద్వ విధానం అవలంభించడం, ఆఖర్లో అంగీకరం తెల్పడం వల్ల ఇవ్వాళ తెలంగాణ ఏర్పాటుకు ఫలానా పార్టీ అని ప్రజలతో ప్రగాఢ ముద్ర వేయించుకోలేకపోతున్నాయి విపక్షాలు. ఒక విజయం వెనుక సమిధ•లైనవారెందరున్నా విజయం సిద్ధించేనాటికి ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిపేరే స్థిరస్థాయిగా నిలబడిపోతుందన్నది కాదనలేని నిజం. భారత స్వాతంత్య్ర చరిత్రను ఒక్కసారి తిరగవేస్తే.. మహత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూకన్నా ముందు ఉద్యమించిన ఝాన్సిరాణి మొదలు లాలా లజపత్‌రాయ్, దాదాబాయ్ నవరోజ్ లాంటి మహామహులెందరో ఆంగ్లేయుల లాఠీ దెబ్బలకు, తుపాకి గుండ్లకు బలైనవారున్నారు. కాని, స్వాతంత్య్రం వొచ్చేనాటికి వారంతా కనుమరుగైపోయారు. బ్రిటీషువారు దేశాన్ని అప్పగించేనాటికి ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న మహత్మాగాంధీ, నెహ్రూ, వల్లబాయ్‌పటేల్ లాంటి వారుండడంతో వారిపేర్లే వెలుగులోకి వొచ్చాయి. ముఖ్యంగా గాంధీ జాతిపితగా పిలబడ్డారు.
తెలంగాణ విషయంలోనూ అదే జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరున మద్రాసునుండి విడిపోయిన ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకువొచ్చి అప్పటికే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కలిపినప్పటినుండి తెలంగాణలో అసంతృప్తి నెలకొంది. అది మొదలు విడతలవారిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం స్థానిక నాయకులనేకులు ఉద్యమించినప్పటికీ ఎక్కువ కాలం పోరాటం చేయలేకపోయారు. ఇంద్రారెడ్డి, బద్రీ విశాల్‌పిట్టి, జానారెడ్డి, కేశవరావు, చెన్నారెడ్డి లాంటివారు ఉద్యమాన్ని ఆఖరివరకు తీసుకుపోలేకపోయారు. 1969 ఉద్యమాన్ని ఉర్రూతలూగించడంలో చెన్నారెడ్డి కొంతవరకు సఫలుడైనప్పటికీ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇంద్రజాలం ఆయన్ను కట్టిపడేసింది. సుమారు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయినా ఫలితంమాత్రం దక్కలేదు. పైగా ఆ ఉద్యమం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది కూడా తెలంగాణ వారికే. అనాడు ఉద్యమంలో ముందు వరుసలో నిలబడిన విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా జైళ్ళపాలై వేతనాలను కోల్పోవాల్సి వొచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలంటేనే భయపడి పోయారు. అప్పటికే అయిదారు సార్లు ఉబికివొచ్చిన ఉద్యమాలు చల్లారిపోవడమే అందుకు కారణం. కాని ముప్పై సంవత్సరాల వ్యవధి తర్వాత సుదీర్ఘంగా సాగిన ఉద్యమం ఆఖరికి రాష్ట్రాన్ని సాధించుకోగలిగింది. అయితే 2001 నుండి సాగిన మలివిడత ఉద్యమమే తెలంగాణ సాధించగలిగిందా అంటే దాని ప్రభావం కొంతవరకే అని చెప్పాల్సి ఉంటుంది. పదమూడు ఏండ్ల కింద ఈ ఉద్యమం ప్రారంభానికి ముందే తెలంగాణ వాదులు మిణుగురు పురుగుల్లా అక్కడక్కడ గత ముప్సై ఎండ్ల మధ్యకాలంలో తమ గొంతు వినిపిస్తూనే వొచ్చారు. అందులో చెప్పుకోదగ్గవారిలో కాళోజీ, జయశంకర్‌లాంటివారనేకులున్నారు.
తెలంగాణలోగాని, ఆంధ్రలోగాని వారికి కల్పించే ఏ వేదిక• పైన అయినా తమ తెలంగాణ అస్థిత్వాన్ని వినిపిస్తూ రావడం ఉద్యమానికి ఊతమిచ్చింది. అప్పటికే తెలంగాణ పేరున అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. ఎవరికి వారు తమ బాణిలో ఉద్యమాన్ని రగిలిస్తూ పోయారు. ఇలా ఎవరిదారిన వారు ఉద్యమాలు చేసుకుంటూ పోతే సంఘటిత శక్తి లోపిస్తుంద•న్నప్పుడు ‘అన్ని పాయలు చివరకు కలిసేది సముద్రంలోనే కదా’ లక్ష్యం ఒకటైనప్పుడు వేరువేరుగా ఉద్యమిస్తేనేమని కాళోజీ ఇచ్చిన ప్రోత్సహం ఒక ఎత్తుకాగా, ఆనాటి ప్రభుత్వాలకు భయపడి పట్టుమని పదిమందికూడా రాని సభ మొదలు వేలాది మంది హాజరైన తెలంగాణ వాదులనుద్దేశించి జయశంకర్ సార్ చేసిన ప్రసంగాలైతేనేమీ మలిదశ ఉద్యమానికి బలాన్నిచ్చాయి. అంబేడ్కర్ చెప్పిన భావాజాల వ్యాప్తి సూత్రాన్ని జయశంకర్‌సార్ ఆచరణలో పెట్టారు. ఈ హంగులన్నీ మలివిడత ఉద్యమకారుడిగా కెసిఆర్ నిలదొక్కుకోవడానికి కారణమైనాయి. కెసిఆర్ తరుచు తన ఉపన్యాసాల్లో చెబుతున్నట్లు ఏ పనినైనా ఆరంభిస్తే దాన్ని మధ్యలో వదిలివేయకుండా చివరంటా తీసుకెళ్ళినవాడే సిపాయి అన్నట్లు, మలివిడత ఉద్యమాన్ని ప్రారంభించిన కెసిఆర్, ఉద్యమఫలితాన్ని అనుభవించేవరకు ఉండడం వల్లే ఇవ్వాళ ఆయకే తెలంగాణ సాధకుడిగా పేరు వొచ్చింది. అంతమాత్రాన ఇంకెవరూ ఉద్యమంలో భాగస్వాములు కాలేదనడానికి వీలులేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది.. కార్యసాధకుడు అయినా కాకపోయినా కెసిఆర్‌కు జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే గతంలో తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకులెవరూ ఆ తర్వాత రాజకీయాల్లో లేకుండా పోలేదు. మంచి పదవులు అలంకరించిన చరిత్ర వారికుంది. అలాగే కెసిఆర్‌కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఏదో పార్టీ పక్షాన కొనసాగేవాడు.
ఎందుకంటే ఆయన పక్కా రాజకీయవాది.. తెలంగాణను ఆయన వాడుకున్నాడా.. తెలంగాణనే ఆయనను వాడుకున్నదా..ఆలోచించాల్సిన అంశం ..!తెలంగాణా రాష్ట్రం ఏర్పడని పక్షంలో కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఇతర రూపంలో కొనసాగేది ..కానీ ఉద్యమకారులు మళ్ళీ ఉద్యమబాట ఎన్నుకోవాల్సి వొచ్చేది ..! ఈ విషయం పక్కకు పెడితే.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినాయి. ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ తెచ్చుకున్నామోఈ తొమ్మిదేళ్ళలో ఆ ఆకాంక్షలేవీ నెరవేరలేదన్నది ఇప్పుడు ప్రజలనుండి తెలంగాణా రాష్ట్రం వొస్తున్న అభియోగం. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామన్నది మొదలు దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మేలైన విద్యను అందిస్తామని ఇలా అనేకానేక విషయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్న ఆరోపణలున్నాయి. దండుగనుండి పండుగ చేశామని చెప్పుకుంటున్న వ్యవసాయ రంగంలో నిత్యం రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలతో రాష్ట్రమంతా అట్టుడికి పోతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గతంలోకన్నా పంట విస్తీర్ణం పెరిగి, దిగిబడి పెరిగి ఉండవొచ్చుగాక, కాని సకాలంలో పంట కొనుగోలు గాకుండా, కొన్న ధాన్యం డబ్బులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకతకు దారి తీస్తున్నది. అలాగే ధరణి తప్పులు, పట్టని నిర్వాసితులగోడు ఇలా ఉత్పన్నమవుతున్న పలు సమస్యపై ఉద్యమించడానికి విపక్షాలకు ప్రభుత్వమే అవకాశాన్నిచ్చినట్లు అవుతున్నది. ఆఖరికి అధికార పార్టీని గద్దె దించాలన్న లక్ష్యంగా ఆ పార్టీలన్నీ ప్రణాళికలను రచించుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకలను కూడా ఆ పార్టీలు రాజకీయానికి వాడుకుంటున్నాయి. దేశ స్వాతంత్య్ర దినం, గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా ఎలా ఐక్యంగా చేసుకుంటామో, రాష్ట్ర అవతరణ వేడుకలు కూడా అలానే ఐక్యంగా చేసుకోవాల్సి ఉండగా ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లుగా ఎవరికి ఇష్టంవచ్చినట్లుగా వారు కార్యక్రమాలను రూపొందించుకుని వేడుకలను జరుపుకున్నారు. ఇవిప్పుడు రాజకీయ బల ప్రదర్శన వేదికలుగా మారాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సచివాలయంలో జాతీయ పతాకావిష్కరణచేసి రాష్ట్ర అవతరణ ఉత్సవాలను లాంచనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజుపాటు రోజుకో భిన్న కార్యక్రమంతో తొమ్మిదేళ్లుగా తాము సాధించిన ప్రగతిని ప్రజలకు విన్నవించుకునే ప్రణాళికను వారు ఏర్పరుచుకున్నారు.
కాగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ సహకారంతో చారిత్రక గోలకొండ కోటపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయడంద్వారా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణకోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను ఆయన సన్మానించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించారు. తన పుట్టిన రోజుకూడా కలిసి రావడంతో రాజభవన్ విఐపి)తో నిండిపోయింది. ఈ సందర్భంగా ఆమె ఆమరవీరులకు జోహార్లు సమర్సించారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. చప్పుళ్ళు తాళాలతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. బాబు జగ్‌జ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి గాంధీభవన్‌వరకు పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమారిని తీసుకువచ్చారు. ఆమె ముందుగా గన్‌పార్క్ వద్ద ఉన్న ఆమర వీరుల స్థూపంవద్ద అమరులకు నివాళులర్పించారు. ఇలా ఈ మూడు ప్రధాన పార్టీలతోపాటు తెలుగుదేశం, బిఎప్సీ తదితర పార్టీలుకూడా తమ వంతు కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహించుకోవడం గమనార్హం.




