ఏడాది గడిచే పోయింది.
ఏడ పోయిందో నా తల్లి

తొలిసూరు కాన్పులోనే
ఏం తొంద రొచ్చిందనో
అసమర్థపు కొడుకుని కని అంబురాని కే•గింది నా అమ్మ

ఎండకి ఎండిపోతానని
వానకు ముద్దయితా ననేమో
నులి వెచ్చని మాసంలో
పురుడు పోసుకొని నను కనింది నాతల్లి

కృష్ణమ్మ ఒడి నుండి
గోదారి తీరానికి
పొత్తిళ్ళలో నను పొదివి పట్టి
నాన్న తో నడిచొచ్చింది

వెన్న ముద్దుల్లోంచి
వెన్నెల కురిసే వెలివాడనుంచి
దండ కారణ్యం లోనికి
నన్నెత్తుకుని నడిచొచ్చింది నాకోసం

నీ కోసమే నను కన్నానని
నీ చేతుల్లో పెట్టి పోతే
తీరా వచ్చేసరికి తలుపులు మూసి
నా తల్లికి నను దూరం చేశావు

పసి పాపలా ఏడ్చాను
పల్లేరుల పై నడిచాను
రక్తాశ్రువులే రాల్చి
తనువు చాలించే వేళ

నా పెద్ద కొడుకు వంటూ
శిశిరం లో ఉష్ణోదయం లా
నులి వెచ్చని నీ ఒడి నిచ్చావు
నుదుటి పై ముద్దాడి లాలించావు

కళ్ళు తెరిచి చూసే లోగా
వరద గోదారిలో ఒంటరినయ్యాను
కుంతీ పుత్రుణ్ణి నేను
చరమాంకంలో రాధేముణ్ణి కాలేదు

వసంతం పెళ్ళి పోయింది
కోకిల గానం ఆగి పోయింది.
జ్ఞాపకాల గ్రుడ్లను పొదుగుతూ
ఈ మ్రాను పై ఏకాంతంగా
కుంభ వృష్ఠి లో తడిసి ముద్దనై
దశదిశలు చూస్తూ కాకినై మిగిలున్నా
– కోట దేవదానం, అడ్వకేట్‌, ‌భద్రాచలం
9705693226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *