స్వరాష్ట్ర సాధన పోరులో
యువకిశోరాలు దండుగట్టి
రణ దండోరా మోగించినయ్
మరిగే నెత్తురు పిడికిళ్ళెత్తి
వలసవాదుల పాలన మీద
ధిక్కార జ్వాల రాజేసినయ్
జై తెలంగాణ నినాదమెత్తి
బూర్జువా శక్తుల గుండెలపై
మిలియన్ మార్చ్ చేసినయ్
కాఖీ లాఠీ దెబ్బకు వెరవక
తుపాకి తూటాకు తలొగ్గక
తిరుగుబాటుకు తెగబడ్డయ్
ప్రాణాల గడ్డిపోచగా ఎంచి
తెగించి పోరాటం చేసినయ్
వలసపాలకుల తరిమినయ్
కోటి స్వప్నాల సాకారంచేసి
తెలంగాణ రాష్ట్రం సాధించి
అస్తిత్వ జెండా ఎగరేసినయ్
వెలిగే అమరజ్యోతి సాక్షిగా
ఉరి తాళ్లను పూలదండగా
ధరించిన అభినవ కర్ణులకు
జనగణాల జయ హారతులు
ఫెస్టిసైడ్లను పరమాన్నంగా
భుజించిన ఘనచరితులకు
ఆత్మగౌరవాల నీరాజనాలు
పెట్రోలను పుణ్యస్నానంగా
ఆచరించిన త్యాగధనులకు
సబ్బండ వర్గాల సలాములు
మృత్యువును ధరహాసంతో
ముద్దాడిన అమర వీరులకు
తెలంగాణా తల్లి నివాళులు
(తెలంగాణ అమరుల ‘‘జ్యోతి’’కి నివాళి అర్పిస్తూ…)
– కోడిగూటి తిరుపతి, 9573929493




