అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లకు గోస
ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు
చేవెళ్ల అసెంబ్లీ సవిూక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని..అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఆదేశించారని చెప్పారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ..మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్‌ మోసం చేసిందని విమర్శించారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను సర్కారు గోసపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు రావడం లేదని చెప్పారు. రైతు బంధు అడిగితే చెప్పుతీసి కొడతామని అంటున్నారని విమర్శించారు. రైతు భరోసా ఇచ్చామంటూ అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెబుతున్నారని కెటిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్‌ను వోటుతో కొడదామన్నారు. అధికారంలోకి వొచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, ఇప్పటికీ అది అమలు కాలేదని చెప్పారు.

రుణం తెచ్చుకున్న రైతులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తామని రేవంత్‌ చెప్పారని గుర్తు చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్‌ మర్చిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం సామాన్య కాంగ్రెస్‌ కార్యకర్త ప్రసంగం కంటే హీనంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 420 హావిూలిచ్చిందని, ఆ హావిూలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతామన్నారు. నోటికొచ్చిన హావిూలిచ్చి ఇరుక్కుపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఐదేండ్లు అధికారం నిలుపుకుంటుందా..లేదా వేచి చూద్దామన్నారు. పార్లమెంటు ఎన్నిల కోడ్‌ రాకముందే హావిూలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భయపడొద్దని సూచించారు. ఎలాంటి కష్టం వొచ్చినా తాము అండగా నిలబడతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలో ప్రజల్లోకి వొస్తారని చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ చేసిందేవిూ లేదన్నారు. బీజేపీ వొచ్చాకే మనం బొట్టు పెట్టుకోవడం నేర్చుకున్నాం అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీఐఆర్‌పై బండి సంజయ్‌ ఒక్క మాట మాట్లాడలేదని, తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడేది బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రమేనని కెటిఆర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *