(మహేందర్ కూన, జర్నలిస్ట్)
‘‘వెయ్యి తుపాకి గుండ్లకన్నా శత్రుత్వం వహించిన నాలుగు పత్రికలు భయంకరమైనవి’’ అన్నారు ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ బోనా పార్టె. సైనికాధికారి నుండి సామ్రాజ్యాధినేతగా ఎదిగి నియంత పాలన సాగించిన నెపోలియన్ పత్రికా స్వేచ్చపై ఉక్కు పాదం మోపాడు. ఆయనను ధిక్కరించి ఎదురు నిలిచిన పత్రికలతో వేగలేక అన్న మాటలవి.
కరుడు కట్టిన నియంతలను మట్టికరిపించిన చరిత్ర పత్రికలది. రాజరికపు కాలం నుండి ప్రజారాజ్య వ్యవస్థల వరకు పత్రికల పాత్ర మారలేదు. వాటి ఆవిష్కరణలకు కూడ చారిత్రక ఆవశ్యకత నేపథ్యం ఉన్నాయి. ‘‘పత్రికే నియంత పక్కలో బల్లెమ్ము’’ అన్నారు సుప్రసిద్ద సంపాదకులు నార్ల వెంకటేశ్వర్ రావు. నిరంకుశ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడే వరకు పత్రికలు పోషించిన పాత్ర చరిత్రలో మరువ లేనిది. కాలగమనంలో ప్రతి పత్రిక ఆవిర్బావానికి సమయం సందర్భాలు ఉన్నట్లే తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన ‘‘ప్రజాతంత్ర దిన పత్రిక’’ కు ఓ నేపథ్యం ఉంది.
స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు అనేక పత్రికలు వెలువడ్డాయి. అమృతాంజనం పరిశ్రమను నెలకొల్పిన కాశీనాధుని నాగేశ్వర్ రావు ఆంధ్రపత్రికను తొలుత బొంబాయి నుండి వెలువరించి ఆ తర్వాత మద్రాస్‌కు తరలించారు. పత్రికల్లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు రాజద్రోహ నేరం కింద ఖఠిన కారాగార శిక్ష అనుభవించిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మొదటి సంపాదకుడిగా ఆంధ్రపత్రిక ప్రారంభమైంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు పత్రికలు మొదలయ్యాయి. భావ ప్రకటన స్వేఛ్చపై ఉన్న నిషేధాన్ని ధిక్కరిస్తూ తెలుగు పత్రికలు వెలువడ్డాయి. ఇనుగుర్తి గ్రామం నుండి ఒద్దిరాజు సోదరులు తెనుగు పత్రిక వెలువరించారు. అ తర్వాత పూర్తిస్తాయి పత్రికగా గోలకొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి అధ్వర్యంలో వెలువడిరది. తెలంగాణ ప్రజలకోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా పుట్టుకువచ్చిన పత్రిక ఇది. భాగ్యరెడ్డి వర్మ, మందుముల నర్సింగరావు నిజాం పాలన నుండి ప్రజలను చైతన్య పరిచేందుకు పత్రికలు నడిపారు. రజాకార్ల ఆగడాలను నిలదీస్తూ ఇమ్రోజ్ పత్రికలో వరుసగా వార్తలు రాసినందుకు షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు కాల్చి చంపారు.
ఆయన చేతులు నరికి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీకి బహూకరించారు. ఇదంతా స్వాతంత్య్రం రాకముందటి తెలంగాణం పత్రికల చరిత్ర. దేశానికి స్వాతంత్య్రం తర్వాత భారత ప్రభుత్వంలో హైదరాబాద్ స్టేట్ విలీనం ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో బలవంతాన కలిపిన తదనంతరం తెలంగాణాకు సంపూర్ణ స్వంత దిన పత్రికలు పెద్దగా లేకుండా పోయాయి. ఆంధ్రవలస పాలనలో తెలంగాణ ప్రాంతం అడుగడుగునా దోపిడీ, అణిచివేత దశాబ్దాల పాటు కొనసాగేందుకు ఇక్కడి నుండి సంపూర్ణ దినపత్రికలు లేక పోవడం ఓ కారణంగా చెప్పవచ్చు. తెలంగాణ పదం అనేది నిషేదించారు. శాసన సభలోనే ఈ పదం ఎత్త నీయలేదు. ప్రధాన పత్రికల యాజమాన్యాలన్ని ఆంధ్ర ప్రాంతం వారివే. వాటిని నడిపే కీలక భాద్యతల్లో అందరూ ఆంధ్ర ప్రాంతం వారే. ఈ పరిస్థితుల్లో 1990 అనంతరం మొదలైన తెలంగాణ ఆకాంక్షకు సంభందించిన వార్తలు అస్సలు పత్రిక్లలో వొచ్చేవి కావు. తమకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ప్రజలు గొంతెత్తేందుకు వేదికలు లేవు. తెలంగాణ పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిస్టులకు కీలక స్థానాల్లో బాధ్యతలు అప్పగించే వారు కాదు.
అట్లా ఎందరో జర్నలిస్టులు ఆంధ్ర ప్రాంత యాజమాన్యాల్లో అన్యాయాలకు గురైన వారు మద్యలో వృత్తినే వదిలేసిన వారు అనేక మంది ఉన్నారు. ఉదయం పత్రికలో కీలక స్థానంలో పనిచేసిన పాశం యాదగిరి నుండి ఆంధ్ర ప్రభలో పనిచేసిన దేవలపల్లి అమర్, అంబటి శ్రీనివాస్ వంటి వారు అనేక మంది యాజమాన్యాల బాధితులే. ఆంధ్ర ప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులో సంపాదకుడి స్థాయికి ఎదగాల్సిన దేవులపల్లి అమర్‌ను తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు కీలక స్థానం నుండి తప్పించి ప్రాధాన్యత లేని స్థానం ఇచ్చారు. తెలంగాణ మలి దశ ఉద్యమం ఊపిరి పోసుకుంటున్న కాలం అది. పత్రికల్లో తెలంగాణ ప్రాంత వార్తలు పూర్తిగా నిషేదం. తెలంగాణ వార్తలు రాసే జర్నలిస్టులను ఓ కంట కనిపెట్టి వారిని ఎలాగోలా బయటికి పంపించే కుట్రలు చేసారు. జూనియర్లు అయిన ఆంధ్ర ప్రాంతం వారి కింద వేయడం..కీలక స్థానాల్లోకి రాకుండా చేయడం వారికై వారు ఉద్యోగానికి రాజీనామాలు చేసి వెళ్లే విధంగా చేసారు. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. దేవులపల్లి అమర్ ఇలాంటి బాధితులే. ఈ నేపథ్యం నుండే చారిత్రక అవసరం కోసం దేవులపల్లి సోదరులు అమర్, అజయ్, విజయ్ నేతృత్వంలో ‘ప్రజాతంత్ర’ తెలుగు పత్రిక ప్రస్తానం మొదలైంది. అమర్ సంపాదకత్వంలో పత్రికకు విశేష స్పందన వొచ్చింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఈ పత్రికకు అండగా నిలిచాయి. అధ్యాపకులు, విద్యార్థులు, తమ తెలంగాణ ప్రాంత పత్రికగా పత్రికను ఆదరించారు.
‘‘తెలంగాణ హృదయ స్పందనగా ‘‘ప్రజాతంత్ర’’ వార పత్రిక మొదలు దిన పత్రిక వరకు తెలంగాణ వార్తలు విశేషాలతో ఉద్యమ వార్తలతో ఆంధ్ర ప్రాంత పాలకుల అన్యాయాలను వివక్షను నిలదీసే విధంగా పత్రిక నిలిచింది. ఆదరణ కోల్పోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటూనే సుదీర్ఘ ప్రస్తానంలో ప్రజాతంత్ర పాతికేళ్ల మైలు రాయిని దాటింది.
తెలంగాణ రాష్ట్రం వొస్తే స్వరాష్ట్రంలో పత్రికకు గుర్తింపు లభిస్తుందని తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు భావించారు. ఎందరో జర్నలిస్టులు ఆంధ్ర పత్రికల యాజమాన్యాల్లో నిర్దాక్షిణ్యంగా ఉద్వాసలనకు గురైతే వారిని ప్రజాతంత్ర ఆదుకుంది. ఇందులో అనేక మంది ప్రముఖ జర్నలిస్టులు ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే కాకుండా హక్కుల పరిరక్షణ కోసం ప్రజాతంత్ర పత్రిక ఏకంగా ఓ ఉద్యమమే నడిపింది. కన్నబిరాన్, బాలగోపాల్, కోవెల సంపత్కుమార చార్య వంటి మేధావులు తమ ఆలోచనలతో ప్రజాతంత్రకు అక్షరాలను కూర్చి బలోపేతం చేశారు.
అన్ని అర్హతలు ఉన్నా ఆంధ్ర పాలకుల వివక్షను ఎదుర్కున్న పత్రిక ‘ప్రజాతంత్ర’.
ఆంధ్ర పాలకులే కాదు తెలంగాణ పాలక ప్రభుత్వాలు పత్రికకు యాడ్స్ ఇవ్వకుండా వివక్ష చూపారు. తెలంగాణ స్వరాష్ట్రంలో అయినా పత్రికకు న్యాయం జరగలేదు. పత్రిక నిష్పక్ష పాత ధోరణి ప్రజా పక్షం వహించే విధానం తెలంగాణ ప్రాంత పాలకులకు కూడ మింగుడు పడ లేదు. ఈ పత్రిక గురించి ఈ పత్రిక చరిత్ర గురించి పాలక ప్రభువులకు తెలియంది కాదు. జనతంత్రం వదిలి పాలకుల భజన మంత్రం చేయక పోవడమే పాలకుల దృష్టిలో పత్రిక చేసిన తప్పిదం. తెలంగాణ ప్రాంత ఆస్తిత్వం కోసం కంకణ బద్దమైన తన విధివిధానాలను విడనాడకుండా సత్యనిష్టతో, సర్వదా తెలంగాణ ప్రజల కోసం పరితపిస్తూ పత్రిక కొనసాగుతుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత జర్నలిస్టుల కోసం, తెలంగాణ అస్థిత్వమే ఊపిరైన ప్రజాతంత్ర పత్రికను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రజలకు, తెలంగాణ పాలకులమని చెప్పుకునే ప్రభువులకు ఉంది. 26 వసంతాలు పూర్తి చేసుకుని..27 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ‘ప్రజాతంత్ర’ ప్రజల పక్షాన నిలబడుతుందన్న నమ్మకంతో.. పత్రిక సిబ్బందికి శుభాకాంక్షలు.





