అధికారమే లక్ష్యంగా కూటములు

రానున్న ఎన్నికల్లో దేశాధిపత్యాన్ని చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే  ఏ ఒక్క పార్టీకో పూర్తిస్థాయి అధికారం లభించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, అంతకు ముందు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ ‌రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలువలేమన్న నిర్ణయానికి వొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు తమ పాత, కొత్త సన్నిహిత పార్టీల బలాలను బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి. ఈ రెండు పార్టీలు కూడా కొత్త కలయికల కూటమి సన్నాహాలతో ఇప్పుడు బిజీబిజీగా ఉన్నాయి. ఇంచుమించుగా ఈ రెండు పార్టీలు కూడా ఒకటి రెండు రోజులు అటూఇటుగా తమ మిత్రపార్టీలతో సమావేశాలు నిర్వహించాయి. గత ఎన్నికల్లో ఎన్‌డిఏ భాగస్వామ్య  బలాలతో ప్రమేయం లేకుండానే ఒంటరిగా అధికారంలోకి వొచ్చిన భారతీయ జనతాపార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలనాటికి కాస్తా కంగారు పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకు భాగస్వామ్యపక్షాలను పెద్దగా పట్టించుకున్నట్లులేని బిజెపి ఇప్పుడు అత్యవసరంగా ఆ పార్టీలకు తోడు, మరికొన్ని చిన్నాచితక పార్టీలను కూడగట్టుకుని ఈ నెల 18న దిల్లీలో  సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఎన్నికల్లో గెలువటం ద్వారా హ్యాట్రిక్‌ ‌కొట్టాలన్న లక్ష్యంగా తన సైన్యాన్ని సన్నద్ధం చేసుకుంటోంది బిజెపి.

2019 తర్వాత మొదటిసారిగా తన భాగస్వామ్య పక్షాలతో సమావేశం జరిపిన బిజెపికి పలు సవాళ్ళు ఎదురవుతున్నాయి. బిజెపి ఒంటెద్దు పోకడ నచ్చక కొన్ని భాగస్వామ్య పక్షాలు ఎలా దూరమైనాయన్న విషయాలపైన కూడా ఈ సందర్భంగా చర్చ జరగినట్లు తెలుస్తున్నది. వాస్తవంగా ఎన్‌డిఏ ఏర్పాటు చేసి దాదాపు పాతికేళ్ళు అవుతున్నా భాగస్వామ్య పక్షాలు బిజెపి గొడుగుకింద పెద్దగా ఎదగలేకపోతున్నాయన్న వాదన కూడా లేకపోలేదు. అయినప్పటికీ తమ బలాలను నిరూపించు కోవడంతోపాటు మోదీ సారధ్యంపై కూటమి పక్షాలు మరోసారి తమ పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవతీర్మానం చేయడం గమనార్హం. అయితే ఈ 25 ఏళ్ళలో ఎన్‌డిఏ అనేక ఇబ్బందులను ఎదుర్కుని నిలబడిందన్నది వాస్తవం. అధికారంలో ఉన్నా లేకున్నా దేశంలో స్థిరత్వాన్ని తెచ్చేందుకు, ప్రజలందరినీ ఏకం చేసేందుకు నిర్విరామ కృషిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సభ్య పార్టీలకు మరోసారి గుర్తుచేశారు. కాగా కాంగ్రెస్‌ ‌పార్టీ దేశాన్ని అస్థిరపరుస్తున్నదని దానినుండి దేశాన్ని రక్షించుకోవాల్సి ఉందని, అందుకు రానున్న ఎన్నికల్లో 50 శాతం వోట్ల సాధనే లక్ష్యంగా కృషిచేయాల్సిన అవసరాన్ని మోదీ ఈ సందర్బంగా కూటమి పార్టీలకు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే దేశం కోసమే తమ ఈ కొత్త కలయిక అంటున్నాయి కాంగ్రెస్‌ ‌మిత్రపక్షాలు. సుమారు 26 పార్టీలతో బెంగుళూరులో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన భేటీలో  బిజెపి ప్రభుత్వాన్ని పడదోసే విషయంలో ఆ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వొచ్చాయి.

వాస్తవంగా బిజెపి భేటీలో 30 రాజకీయ పార్టీలు భాగస్వామ్యమైనప్పటికీ చాలావాటి పేర్లు ఇంతవరకు దేశ ప్రజలకు తెలియనివి కావడం గమనార్హం. చాలా వాటికి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేని పార్టీలున్నాయి. కాగా కాంగ్రెస్‌ ‌భేటీలో దాదాపు 26 పార్టీలు సమావేశమైనాయి. వీటిల్లో దాదాపు 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కూడా దేశంకోసమే తమ పోరాటమంటున్నాయి. హిందుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు. భారతీయ జనతాపార్టీ దేశాన్ని పాలించడంలేదని, ఒక విధంగా ఒక్కో రాష్ట్రాన్ని అక్రమిస్తూ, దేశన్ని విభజించి పాలించే ధోరణిలో  కొనసాగుతున్నదన్నది కాంగ్రెస్‌ ‌కూటమి ఆరోపణ. అందుకే విభేదాలను  పక్కకుపెట్టి ఉమ్మడి పోరాటానికి వారంతా తమ సంసిద్దతను ప్రకటించడంతో పాటు పోరాటానికి ఉమ్మడి వేదికకు ‘ఇండియా’గా నామకరణం చేసారు. గతంలో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో కొనసాగిన యుపిఏకు బదులుగా ఇప్పుడు ఇండియన్‌ ‌నేషనల్‌ ‌డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలవెన్స్ (‌భారత జాతీయ ప్రగతిశీల సంఘటిత కూటమి)గా దానికి నామకరణంచేసి,  11 మందితో ఒక సమన్వయ కమిటీని, ప్రచార నిర్వహణకోసం ఒక సెక్రటరేట్‌ను త్వరలో ముంబాయిలో ఏర్పాటుచేయనున్న సమావేశంలో ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 2024 ఎన్నికలకు గాను ఈ కొత్త కూటమి నిర్వహించే ముంబాయి సమావేశం మూడవదవుతుంది. మొదటిసారిగా పాట్నాలో కాంగ్రెస్‌తో సహా పదహారు రాజకీయ పార్టీలతో ఉమ్మడిగా సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

మొత్తంమీద దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి నెగ్గలేమన్న అభిప్రాయానికి వొచ్చినట్లు దీనివల్ల స్పష్టమవుతున్నది. ఈ రెండు కూటములు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకే కూటమి కట్టినట్లు చెప్పుకుంటూనే ప్రతిపక్ష కూటమి అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నదని తూలనాడుతున్నాయి. ఎవరికి వారు తామే స్థిరమైన పాలనను ఏర్పాటుచేయగలమంటున్నాయి. దేశంలో పెచ్చు పెరిగి ఉన్న అవినీతి దారులను మూసివేయగలిగామని, దేశ భద్రత, ప్రగతి, పౌరుల సాధికారత ప్రధాన లక్ష్యంగా పాలనచేశామని ఎన్డీయే చెప్పుకుంటుంటే, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బిజెపి ధ్వంసం  చేసిందని వాటిని కాపాడాల్సి ఉందంటోంది కొత్తగా నిర్మాణమైన ఇండియా కూటమి .. ప్రధానంగా అధికారమే లక్ష్యంగా ఇడి, సిబీఐ లాంటి స్వయంప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థలను విపక్షాలపై ప్రయోగిస్తున్న విధానంపైనే తమ పోరాటం సాగుతుందని ఆ పక్షాలు చెబుతున్నాయి. అయితే ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా వారు తేల్చుకోలేదు. కాకపోతే కాంగ్రెస్‌ ‌మాత్రం స్పష్టత ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో కాబోయే ప్రధాని విషయంలో తమకు ఆసక్తిలేదన్న విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం విశేషం. దీంతో గత యుపిఏ పక్షాలు నేటి ఇండియా పక్షాలు తమ సారధిని ఎన్నుకునే పనిపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *