అత్యాచార ఘటనలపై రాజకీయాలెందుకు…!?

  • నిందితులకు కఠిన శిక్షలపై దృష్టిసారించాలి
  • హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు…

ఏ నేరం చేసినా నిందితుడికి కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా చట్టాలు బలంగా ఉండాలి. అంతకంటే ముందు కోర్టుల్లో సత్వరమే విచారణ జరగాలి. పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరించాలి. కాలాపహరణం జరగకుండా చూడాలి. హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు. ఈ రోజు కోల్‌కొతాలో ఒక పీజీ వైద్య కోర్సుచదువుతున్న విద్యార్దిని, డాక్టర్‌పై జరిగిన నీచమైన ఘాతుకం యావత్తు ప్రపంచాన్ని కలవరపరిచింది. భారతావని సిగ్గుతో తలవొంచుకుంది.  అన్ని వర్గాల ప్రజలు, సభ్యసమాజం మానసికంగా కుమిలిపోయింది. మన దేశంలో అత్యాచారం సంఘటనల్లో 90 శాతం మంది నేరస్తులు చట్టానికి చిక్కకుండా శిక్షల నుంచి తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు. రేప్‌ సంఘటనల్లో  రాజకీయాలు ముదురుతున్నాయి. నిస్సిగ్గుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

 

2012 డిసెంబర్‌లో దిల్లీలో జరిగిన దుర్ఘటనను  మనం మర్చిపోలేదు. దేశమంతా కదిలింది. 23 ఏళ్ల ఫిజియోథెరపిస్టుపై దుర్మార్గులు చేసిన ఘాతుకం నుంచి మనం తేరుకోలేదు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత వైద్య విద్యార్థినిపై నేరగాడు దురాగతానికి పాల్పడ్డాడు. 2012 దిల్లీ కేసు నిర్భయ రేప్‌ కేసుగా పాపులరైంది. ఈ కేసు విచారణ ఆరేళ్లపాటు జరిగింది. ఆరుగురు నిందితుల్లో నలుగురికి శిక్ష పడిరది. కఠినమైన చట్టాలు వొచ్చాయి. కాని మహిళలపై అత్యాచారాల సంఖ్య తగ్గలేదు. ఇవి రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. అత్యాచారం సంఘటన జరిగినప్పుడల్లా దేశంలో ఆందోళనలు వొస్తాయి. ఆ తర్వాత మళ్లీ ఉద్యమాలు సర్దుమణుగుతాయి. మళ్లీ రేపిస్టులు విజ్బంభిస్తారు. మనకు దళసరి మందం పెరిగింది. సున్నితమైన స్పందనలు లేవా? అన్ని వ్యవస్థలు కూడా కుప్పుకూలుతున్నాయా అనే అనుమానం వస్తోంది.

ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకినప్పుడల్లా, కేంద్రం కఠినమైన చట్టాలు తెస్తోంది. ఆ కోవలోనే నిర్భయ చట్టాన్ని తెచ్చారు. నేర తీవ్రతను బట్టి మరణ శిక్షను కూడా చేర్చారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, నేరాలు తగ్గలేదు. పాలకులకు చీమకుట్టినట్లుగా ఉండడం లేదు. పైగా ఈ నేరాలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు స్పందించే తీరు జుగుప్సాకరంగా ఉంటోంది. ఉన్నత మధ్య తరగతి నుంచి బడుగు బలహీనవర్గాలపై అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. వర్గ బేధం లేదు. మహిళలు అత్యాచారాల వికృత చేష్టలకు బలవుతున్నారు. సాధారణ జనం బాధలకు, మానసిక ఆందోళన, అలజడికి అంతులేకుండా పోతోంది. ఉన్నత మధ్య తరగతి వర్గం మహిళ అత్యాచారానికి గురైనప్పుడు సమాజం వేగంగా స్పందిస్తోంది. అదే ఆదివాసీ, దళిత మహిళ బాధితురాలైనప్పుడు సమాజం స్పందన వేగంగా ఉండం లేదు. మీడియా కూడా అంతే పట్టించుకోవడం లేదు.

2012 నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు వొచ్చాయి. కాని ఆ నాటి కాంగ్రెస్‌  పార్టీ చిత్తుగా ఓడి పోయింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ప్రజలు నిర్భయ కేసులో ఆ నాటి పాలకుల తీరుపై తిరుగుబాటుచేసినంత పనిచేశారు. ఈ సంఘటన వల్ల కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెచ్చుమీరింది. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ తీరును ఆమోదించలేదు. అందుకే ఎన్నికల్లో గట్టి గుణ పాఠం చెప్పారు. ఈ తరవాత సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు జనం మనసును అర్ధం చేసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. అంతే కాని నిమ్మకు నీరెత్తినట్లు ఉండరాదు. రాజకీయ పార్టీలు ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు తమ పార్టీ ప్రయో జనాలకు ఉపయోగపడుతుందేమోనన్న కోణంలో ఆలోచిస్తాయి. వారికి ఎంత సేపు ఎన్నికల్లో లాభపడాలనే స్వార్థదృష్టిలో ఆలోచిస్తాయి. ప్రజల ఉద్యమాలు, వారి డిమాండ్లతో రాజకీయ పార్టీలకు పని ఉండదు. మనం లాభపడాలి. అధికారంలోకి రావాలనే దుగ్ధతోనే రాజకీయ పార్టీలు అడుగులు వేస్తాయి.

ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు జాతీయంగా వాటికి ప్రాచుర్యం వొస్తుంది. ముందుగా ప్రారంభమయ్యే ఉద్యమాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలు ఖరారు చేసుకుంటాయి. అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలనే తపన కంటే రాజకీయంగా తమకు ఎంత వరకు లాభమనే కోణంలో ఆలోచిస్తారు. 2012 నిర్భయ కేసు నుంచి చూస్తే మహిళ రక్షణకు తీనుకున్న చర్యల్లో పెద్ద మార్పులు లేవు. వీధుల్లో జరిగే ర్యాలీల నుంచి ఎలా లబ్ధి పొందాలన్న సంకల్పంతోనే క రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. రాజకీయ పార్టీలకు సిగ్గు శరం ఉండదు. వారికి సమాజ హితం కంటే, తమ పార్టీ ప్రయోజనాలే మిన్న అనే కోణంతో ముందుకెళుతాయి. వీరి అర్ధరహిత, జుగుప్పాకర వైఖరి సభ్య సమాజానికి చేటు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం పోటీలు కూడాపడుతూ పరస్పరం విమర్శలు చేసుకుంటాయి.
పశ్చిమబెంగాల్‌ ఉదంతంలో ఏమి జరుగుతుందో మనం చూస్తున్నాం. మమతాబెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌ ఉపందుకుంది. బీజేపీ ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తోంది.

 

అంటే ప్రజా ఉద్యమం కాస్తా రాజకీయ రంగు పులుముకున్నట్లయింది. సిద్ధాంతపరంగా, సమాజ, జాతి పరంగా సమాజం చీలిపోయేందుకు రాజకీయాలు కారణమయ్యాయి. మీడియా, రాజకీయ పార్టీలు తమలబ్ది కోసం  అన్నిరకాలుగా ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని అడ్డదార్లు తొక్కాయి. వొచ్చే ఎన్నికల్లో లాభపడేందుకు , ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ తొందరపడుతోంది. కోల్‌కతా ఘటన నేపథ్యంలో ఎగసిపడుతున్న విద్యార్థుల ఉద్యమం భారతీయ సమాజానికి కనువిప్పు కలిగించింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు తమకు వొచ్చే ప్రయోజనం ఎంత అనే కోణంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సంఘటనల వల్ల రేపిస్టులకు  కఠినమైన శిక్షలు వెంటనే పడేటట్లు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తమ విద్యుక్త ధర్మాన్ని మర్చిపోయి నీచ రాజకీయాలకు రాజకీయ పార్టీలు పాల్పడుతున్నాయి.

 

ఉద్యమాల వల్ల భవిష్యత్తులో అత్యాచారాల సంఖ్యను తగ్గించలేం. కాని నిందితుడికి కఠిన శిక్షలు వెంటనే పడేటట్లుచూడాలి. ఈ ఏడాది లోక్‌ సభ ఎన్నికల కంటే ముందు కూడా సందేశ్‌కాళీ కేసులో కూడా బీజేపీ పెద్ద ఎత్తున టీఎంసీకి వ్యతిరేకంగా ఉద్యమించింది. ఎన్నికల తర్వాత ఆమెను వదిలిపెట్టేశారు.  ఆ అంశాన్ని కూడా బీజేపీ మర్చిపోయింది. రాజకీయాలకు అతీతంగానే రాజకీయ పార్టీలు ఈ తరహా హేయమైన నేరాలు చోటుచేసుకున్న సమయంలో వ్యవహరించాలి. తాజా కోల్‌కతా మెడికో ఘటన భవివ్యత్తులో పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీల సంయమనంతో సమిష్టిగా వ్యవహరించాలి. పార్టీ ప్రయోజనాలకు తావులేకుండా కదలాలి. అంతేకాని ఎన్నికల కోణంలో రాజకీయ పార్టీలు ఈ తరహా నేరాలను చూడరాదు. పార్టీ ప్రయోజనాల కంటే సమాజ హితం, దేశంలో మహిళల సంరక్షణ, బెన్నత్యం మిన్న అనే కోణంలో రాజకీ పార్టీలు నడుచుకోవాలి.
-శామ్‌ సుందర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *