అగాధాల అంచుల మధ్య మొద్దు నిద్రపోతున్న ఆధునికం!

అన్నవస్త్రాలకు ప్రాకు లాడితే,ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా  మన సంస్కృతిలో నిక్షిప్తమైన మానవీయ కోణాన్ని  స్పృశించక, మానవ సంబంధాలకు స్వస్తి వాక్యం పలకడం, పరిణితి చెందిన మేథస్సును పక్కదారి పట్టించి,మానవత్వాన్ని విడనాడి, డార్విన్‌ జీవ పరిణామ క్రమాన్ని వెనక్కి నడిపించమే మన ధ్యేయంగా మారింది. మానవ జాతిని తిరిగి అధోగతి పాలు చేయడమే మన లక్ష్యమా?  ఈ అపసవ్య ధోరణి ఇదే విధంగా కొనసాగితే ఇక ఈ భూప్రపంచంలో భవిష్యత్తులో క్రూర మృగాల కంటే భయంకరమైన మానవజాతి  ఆవిష్కృతమౌతుంది.

అందుచేత  విలువలకు, వ్యక్తిత్వానికి అత్యధిక  ప్రాధాన్యత నివ్వాలి. విలువ అనేది ఒక మానసిక ఉన్నత స్థితికి నిదర్శనం. అది మనసులో వాస్తవంగా ప్రతిష్ఠింప బడాలి.గౌరవం సంతలో కొంటే కొనే వస్తువు కాదు. విలువ అంటే సద్వర్తనం,నైతిక బలం,వాక్‌ శుద్ది, చిత్తశుద్ది అనే పునాదులపై నిర్మితమయ్యే  సుందరమైన సౌధం. ఆ సుందరమైన సౌధంలో నివసించడం మాని, స్వార్ధం, సంకుచితత్వం,మూర?త్వం, అమానుషత్వం, పరపీడనత్వం వంటి సకల అవలక్షణ కళంకితులై మురికి కూపం లాంటి  శిథిల సదృశ్యమైన కాల్పనికి సౌధాల్లో జీవించి, మరణించినా చరిత్రలో ఛీత్కరించబడే జీవితాలు మనకు అవసరమా?కావు కావు మని కాకుల్లా అరుస్తూ, జనారణ్యంలో చిరకాలం జీవించడం కంటే మృదు మథురమైన, వీనుల విందైన శబ్ధాలు చేస్తూ చూపరులను తన్మయత్వానికి గురి చేసే కుహు..కుహు రాగాల కోయిలలా క్షణకాలమైనా జీవించి, గతించడం మేలు కదా? జీవిత సత్యాలు గాలిలో దీపంలా తయారైనాయి. నీతి శతకాల్లోని పద్య రత్నాలు నోటికి భారమైపోయాయి.

 

కారుణ్య భావాలకు చోటివ్వని జనంలో మనం కూడా మమేకమై, మానవత్వాన్ని మానవ తత్వాన్ని మంట గలుపుదామా, నిజానికి మసి బూసి మారేడు కాయ  చేద్దామా?  నిజాలను చీకట్లోకి నెట్టి అబద్ధాల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తే ఇక మానవ జాతి కి అర్ధమేమిటి? మానవ పుట్టుకకు సార్ధకత ఏమిటి?స్వార్ధం కోసం చేసే ఆరాటాలు, పోరాటాల మధ్య అలసి ‘‘పోయే’’ జీవితాలు చీకటికే అంకితాలు. అవి నిరర్ధకాలు. చరిత్రకంటే బురదమరకలు. అందుకే స్వంత లాభం కొంతమానుకుని పొరుగు వారికి పాటుపడమన్న గురజాడ అడుగు జాడల్లో నడవాలి. మనిషిగా పుట్టి, పశువుగా మారకూడదు. విలువలను విసర్జించరాదు. మానవీయతను మంట గలపరాదు. మనం పోతే  మన కట్టెతో  కాటివరకైనా నలుగురొస్తారన్న ఆశకూడా అడుగంటి పోయిన వర్తమానంలో మనమున్నాం. అన్నీ ఉండీ, అనాథగా తనువు చాలించే దౌర్భాగ్యపు దుర్ధినాలు దాపురించాయి. మానవ లక్షణాలు కోల్పోయిన నేపథ్యంలో జరుగుతున్న అమానుష సంఘటనలను  గూర్చి ఎంత  వివరించినా తక్కువే.’’గంగిగోవు పాలు గరిటెడైనను చాలు…’’అన్న వేమన పద్యం సర్వకాల సర్వావస్థలకు వర్తించే నిజ జీవిత సత్యం.

మనకు ఉన్నంతలో జీవించి, సక్రమ పద్ధతిలో జీవితాన్ని నెట్టుకు రావడమే నిజమైన మానవ లక్షణం. జీవించినంత కాలం పరులను పీడిరచుకు తినడం, మేలు చేసిన వారికి కీడు చేయడం, పరాన్న జీవనంలో సుఖాన్ని ఆస్వాదించడం అత్యంత హేయం. నిస్వార్ధంతో జీవిస్తూ, కటిక నేలపై పవళించినా సుఖనిద్ర ప్రాప్తిస్తుంది. పరులను వంచించి,పంచభక్ష్య పరమాన్నాలు భుజించినా జీర్ణం కాదు.పట్టు పవళింపు సేవల్లో మునిగినా కలత నిద్ర తప్ప, మనసుకు స్వాంతన చేకూరదు. ప్రశాంతమైన నిద్దురరాదు.స్వార్ధ రహితమైన కార్యసాధన  కష్టానష్టాలెదురైనా  సఫలీకృతమౌతుంది.ఎంతో విశిష్ఠత గల మానవుడు  సాటి మానవులను వేధించుకు తినడం మానవ లక్షణం కాదు.  గతతరం,నేటితరం,రేపటి తరం…ఇలా తరాల మధ్య అంతరాలున్నా ఆలోచనల్లో వైరుధ్యాలున్నా మనం మనుషులం…మానవ ధర్మమే మన ధర్మం. మానవులుగా జన్మించి,మానవ గుణాలను విస్మరించి అగాధాల లోతుల్లోకి జారి పోవడం అత్యంత బాధాకరం. ఇకనైనా మానవ సమాజం మేల్కొనాలి. మొద్దునిద్దుర విడనాడాలి.

సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్‌ స్పీకర్‌)
సంగాయగూడెం, దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *