‘‘అక్షరాలు దిద్దాలి – అభివృద్ధికి తోడ్పడాలి’’

అక్షరాలను దిద్దని చేతులు సమాజానికి గుదిబండలు. అక్షరజ్ఞానం లేని మెదళ్ళు అభివృద్దికి విఘాతాలు.
ఎక్కడ అక్షరం జనం చేతిలో ఆయుధమై,లక్ష్యసాధనకు మార్గమై వికసిస్తుందో,అక్కడ అజ్ఞానం పారద్రోలబడుతుంది. అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. అక్షరం మూగబోయిన కోట్లాది గొంతుల్లో చలనం కలిగిస్తుంది. అలాంటి అక్షరాన్ని దిద్దాలి. మానసిక వికాసం పెంపొందించుకోవాలి.అక్షరం’’ లక్ష్యసిద్ధికి సోపానం. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి అవసరం. అక్షరం అజ్ఞానాంధకారాన్ని ఆవలికి గెంటి విజ్ఞాన కాంతులను విరజిమ్మే మహత్తర సాధనం.
అణ్వాయుధాలు వినాశనాన్ని కలిగిస్తే అక్షరాయుధాలు జ్ఞాన సంపదకు తోడ్పాటు నిస్తాయి.ఆటవిక ప్రవృత్తి నుండి ఆధునిక నాగరికతవైపు నడిపించింది కేవలం  మానవుని జిజ్ఞాస. ఆటవిక జీవనం వదలి, నాగరిక జీవనం దిశగా సాగిన  మానవుని ప్రస్థానంలో అనేక మలుపులు,మజిలీలు ఎదురైనాయి. అయినప్పటికీ మానవుని అన్వేషణ నిరంతరం కొనసాగింది.మనలో దాగిఉన్న  విజ్ఞాన భావాలను విస్తృత పరచడానికి కావలసిన మాద్యమం కోసం సాగిన అన్వేషణా ఫలితమే అక్షరం. మానవుని విజ్ఞాన తృష్ణ అక్షర రూపకల్పనకు నాంది పలికింది.సృష్టిలో దాగి ఉన్న రహస్యాలను చేధించాలనే తపన,ఆలోచనలు పలు రకాల ఆవిష్కరణలకు దారితీసాయి. వారి ఆలోచనా పరంపర నుండి జనించినదే విజ్ఞానం. ఆ విజ్ఞాన సముపార్జన సక్రమమైన దిశలో కొనసాగడానికి జరిగిన ప్రయత్నాలే కాలక్రమంలో గురుకులాలుగా,శిక్షణా కేంద్రాలుగా, నేటి కాలపు విద్యాలయాలుగా పరివర్తన చెందాయి. కొత్తనీరొచ్చి పాత నీరుని ఆవలికి గెంటినట్టుగా ఆధునిక యుగంలో అనేక మార్పులు సంభవించాయి. విద్యావ్యవస్థ నూతన రూపం సంతరించుకుంది.అయితే కాలక్రమేణా విద్యావ్యవస్థ వెర్రితలలు వేసి,వ్యాపారాత్మకంగా మారింది. విద్యాలయాలు ఫక్తువ్యాపార కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. ప్రభుత్వ విద్య పడకేసింది. ప్రైవేటు విద్య పడగవిప్పింది. ప్రభుత్వ విద్యాలయాలంటే నామోషీగా మారాయి. రంగుల ప్రపంచం వైపు విద్యార్థుల తల్లిదండ్రులకు మోజుకలిగింది. వాస్తవానికి ప్రభుత్వ బడులన్నీ వెవవెలబోతున్నాయి. కేవలం పేద విద్యార్దులకు మాత్రమే ప్రభుత్వ విద్య అనే విధంగా మారింది. అయితే ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యంతో  విద్యార్థులకు అనేక పథకాలు ప్రవేశబెట్టబడుతున్నాయి.ఎక్కడ చదివినా చదువు చదువే. విజ్ఞాన,సాంకేతిక విప్లవం వెల్లువెత్తి, పోటీతత్వం పెరగడం వలన విద్యార్ధుల ప్రాధాన్యతాక్రమం మారింది. భవిష్యత్తులో రాణించాలంటే ఉత్తమ ఫలితాలు సాధించాలి.పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడితేనే ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్న   కారణంతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను రెండు మూడు సంవత్సరాల పసిప్రాయంలోనే  ఇంటికి దూరంచేసి, ప్రేమాప్యాయతలను చెరిపేసి,చిరుప్రాయంలోనే దూరప్రాంతాలకు పంపించి,లక్షలు వెచ్చించి తాము ఆర్ధిక బాధలకు గురైనా, తమ పిల్లలు గొప్పవారు కావాలనే ఏకైక లక్ష్యంతో  కష్టాల పాలౌతున్నారు. బాహ్య ప్రపంచానికి దూరమై కారాగారవాసం లాంటి విద్యాలయాల్లో అర్ధం లేని చదువులను బట్టీ పడుతూ, మానసిక వికాసం కోల్పోయి, మరబొమ్మలుగా తయారవుతున్న తంతును చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారే కాని తాము తమ పిల్లలను మానసికంగా ఎదగనీయకుండా యంత్రాల్లా తయారుచేస్తున్నామన్న ప్రాథమిక సత్యం మరచిపోతున్నారు.రాశి పెరిగి వాసి తగ్గిన నేటి చదువులు ‘‘విగ్రహం పుష్ఠి- నైవేద్యం నష్ఠి’’ అన్నట్టుగా తయారైనాయి. ప్రాథమిక స్థాయిలోనే ఐ.ఐ.టి ఓరియెంటెడ్‌ ‌విద్యలంటూ  ఆర్భాటం చేయడం మూలవిగ్రహానికి నైవేద్యం లేదు- ఉత్సవ విగ్రహ ఊరేగింపు చేయమన్నట్టు  హాస్యాస్పదంగా ఉంది. బండెడు బరువుతో మోయలేని పుస్తకాలతో, అర్ధంకాని పాఠ్యాంశాలతో తీవ్ర ఒత్తిడికి గురౌతున్న విద్యార్ధికి ఐ.ఐ.టి కోర్సుల పేరిట అదనపు భారం మోపడం చిల్లర దేవుళ్ళకు చేరువైతే అసలు దేవుడికే దూరమైన చందంగా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముంది.
గర్భంలోని శిశువు భూమిపై అడుగుపెట్టకుండానే  ముందుగానే అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం నేటి పోటీ ప్రపంచంలో వెర్రితలలు వేస్తున్న అనైతిక విద్యావ్యవస్థ కు పరాకాష్ఠ. ప్రభుత్వాలు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టాలి. అలాగే విద్యార్థులపై అనవసరమైన భారం తగ్గించాలి.విద్యార్ధులను ఒత్తిడికి గురిచేసి మానసికంగా హింసించే విద్యలకు స్వస్తి చెప్పాలి. విద్య అనేది విద్యార్ధుల మనస్సుల్లో  ఆసక్తిని పెంచేవిధంగా ఉండాలి.ఉన్మాదులుగా, మానసిక వికాసం లేని వారిగా భావితరాన్ని  తయారు చేయడం అనర్ధదాయకం.  శాస్త్ర,సాంకేతిక రంగాల్లో యువతరాన్ని  నిష్ణాతులుగా తయారు చేయాలి. వ్యవసాయరంగాన్ని,వైద్యరంగాన్ని  విశేషంగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఇది కోవిడ్‌  ‌నేర్పిన పాఠం. భావితరాన్ని మద్యానికి, మాదక ద్రవ్యాలకు,అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. యుక్తవయసులోనే  వ్యక్తిత్వ వికాసం అలవడాలి.ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకా నిరక్షరాస్యత తాండవించడం కడు శోచనీయం. నిరక్షరాస్యత వలన కలిగే అనర్ధాలను తెలియచెప్పి, ప్రజలను చైతన్య పరచడం ద్వారా అక్షరాస్యతా శాతం పెంచాలనేది ‘‘యునెస్కో’’ అభిప్రాయం.1966 వ సంవత్సరం నుండి ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ 8 ‌వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం జరపాలని యునెస్కో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత పెరుగుతున్నా, ఇంకా చాలా మంది ప్రజలకు అక్షరం గగనకుసుమంలా మారింది. ఈ పరిస్థితులు మారాలి. ప్రతీ ఒక్కరూ అక్షరబాట వైపు సాగాలి. నిరక్షరాస్యత ఒక శాపం. అక్షరం దిద్దని జీవితం వ్యర్థం. అక్షరం అనే పునాదులపై విజ్ఞానపు సౌధాలు నిర్మించాలి.  ప్రపంచ గతిని మార్చాలి.
image.png
సుంకవల్లి సత్తిరాజు,  9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *