సమాయత్తమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు
రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ జాతీయస్థాయి నాయకుల తాకిడి
హ్యాట్రిక్ ఖాయమంటున్న బిఆర్‌ఎస్
హైదరాబాద్,ప్రజాతంత్ర న్యూస్ నెట్వర్క్,సెప్టెంబర్ 27: మరో మూడు రోజుల్లో రానున్న అక్టోబర్ నెల రాజకీయ పార్టీలన్నిటికీ ప్రాధాన్యం కానుంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఇదే నెలలో రాబోతుండడంతో రాజకీయ వర్గాలన్నీ ఎంతో ఉత్సుకతతో ఆ తేదీలకోసం ఎదిరి చూస్తున్నాయి. కేంద్ర ఎన్నికల అధికారులు అక్టోబర్ మొదటివారంలో రాష్ట్రంలో పర్యటించిన అనంతరం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రక్రియను మరింత చురుగ్గా సాగిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్ధుల ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్ నాలుగైదు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. ప్రధాన విపక్షాలు, జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంకా జాబితాలను సిద్ధం చేసే పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో తలమునకలైన ఈ పార్టీలు అక్టోబర్ నుండి సమర శంఖారావాన్ని పూరించే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అక్టోబర్ ఒకటినుండే బిజెపి ఆ దిశగా కార్యక్రమాలను రూపొందించుకుంది. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. మొత్తం మీద కనీసం నలభై బహిరంగ సభలను నిర్వహించాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉంది.
కాగా అక్టోబర్ నెలలో ముఖ్యంగా ముగ్గురు జాతీయ నేతలతో కనీసం ఒక్కొక్కరితో మూడు సభలకు తగ్గకుండా తొమ్మిది సభలను నిర్వహించేందుకు రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అక్టోబర్ ఒకటిన దేశ ప్రధాని నరేంద్ర మోదీని మహబూబ్‌నగర్ జిల్లాకు తీసుకురాబోతున్నారు. ఇక్కడ భారీ స్థాయిలో సమరభేరి సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే మూడవ తేదీన మరోసారి మోదీ నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల సందర్భంగా ఆయన రైల్వేకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు ఇతర శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపనున్నారు. ఆ మరుసటి రోజున్నే బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా పర్యటన ఖరారైంది. ఆయన రాక సందర్భంగా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ నాయకలు, కార్యకర్తల అనుసరించాల్సిన విధులపైన ఆయన మార్గదర్శకం చేయబోతున్నారు. అనంతరం దేశ హోంశాఖ మంత్రి అమిత్ షాతో మరో మూడు సభలను నిర్వహించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచిస్తోంది. ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీటితో పాటు బిజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనాయకులతో మరిన్ని సభలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్‌కూడా దూకుడుగా ముందుకు పోయేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర, కేంద్ర నాయకులతో చేపట్టాలనుకున్న బస్సు యాత్రను అక్టోబర్‌లోనే ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. బస్సు యాత్రను మూడు విభాగాలుగా ఏర్పాటు చేసి, వివిధ నాయకుల నేతృత్వంలో ఈ యాత్రను సాగించేందుకు ప్రయత్నిస్తున్నది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధుల ప్రకటన వెలువడిన వెంటనే ఈ యాత్ర కొనసాగించాలనుకుంటోంది. కాగా కేంద్ర నాయకులతో సభలు, సమావేశాలను నిర్వహించే కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తున్నది. అధికార బిఆర్‌ఎస్ కూడా హ్యాట్రిక్ దశగా అడుగులు వేస్తోంది. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా అక్టోబర్ నుండే ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. మొదటినుండి తమకు ఈసారి వంద సీట్లు గ్యారెంటీ అన్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నది. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి మిగతా పార్టీలకన్నా ముందు వరుసలో నిలిచింది. అయితే అభ్యర్ధుల ఎంపిక విషయంలో కొంత అభిప్రాయభేదాలున్నా ప్రచారంలో మాత్రం ముందుకు దూసుకుపోతున్నది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రకటిస్తున్న ఎన్నికల హామీలకు ధీటుగా తన ఎన్నికల మానిఫోస్టోను ప్రకటించనుందన్న ప్రచారం విస్తృతంగా జరగుతున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వంద సభల్లో బిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ సభల సందర్భంగా గత తొమ్మిదేళ్ళుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను ఏ మేరకు అభివృద్ధి చేసిందన్న విషయాన్ని ప్రజలకు సోదాహరణగా వివరించే అవకాశాలున్నాయి. దానితోపాటు మరోసారి ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడితే అందుకోబోయే సంక్షేమ ఫలాలను కూడా ఆయన వివరించనున్నారు. ముఖ్యగంగా మహిళలు, రైతుల వెంట తానున్నానని చెప్పే విధంగా ఎన్నికల ఎజండాను తయారుచేసే పనిలో ఆ పార్టీ ఉంది. నిరుపేద వర్గాలను ఆకట్టుకునే విధంగా గ్యాస్ సిలెండర్ ధరలో వెయ్యి రూపాయలు సబ్సీడిగా అందించే ఆలోచనలో ఉన్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన సామాజిక భద్రతా పెన్షన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న దానికన్నా మరింత ఎక్కువగా పెన్షన్‌ను పెంచే అవకాశముందనుకుంటున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తలదన్నే విధంగా తమ ఎజండా ఉండబోతుందని , అన్ని రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోయే విధంగా తమ పార్టీ ఎన్నికల ఎజండా ఉంటుందని మంత్రి హరీష్‌రావు పలు సందర్భాల్లో పేర్కొంటున్న విషయం తెలిసిందే. మొత్తంమీద అక్టోబర్ నెలలో తెలంగాణ రాజకీయాలు మంచి రసపట్టుకు చేరుకునేట్లుగా ఉన్నాయి.



