పటాన్ చెరు నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిలా పని చేస్తాం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం
పటాన్ చెరు, ప్రజాతంత్ర,డిసెంబర్ 9: మినీ ఇండియాగా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసన సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించడం మరింత బాధ్యతను పెంచిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మూడోసారి పటాన్ చెరు ఎమ్మెల్యేగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో.. కేటీఆర్, హరీష్ రావు ప్రోత్సాహంతో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల అండ దండలతో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు.ప్రజల ఆకాంక్షలు ఆలోచనలకు అనుగుణంగా గత దశాబ్ది కాలంలో 9000 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు.రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అందించి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి తోడుగా నిలుస్తామన్నరు.గత 35 సంవత్సరాలుగా కష్టసుఖాల్లో గెలుపు ఓటముల్లో వెన్నంటి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.