‌హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు..

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌ ) ‌రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌కొట్టడం ద్వారా సరికొత్త రికార్డును సాధించాలన్న పట్టుదలతో ఉంది. భారత దేశంలో ఇటీవల కాలంలో మూడవ సారి ముఖ్యమంత్రి అయిన వారు అరుదు కావడంతో ఎలాగైనా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కెసిఆర్‌ ‌వ్యూహరచన చేస్తున్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనా )క్ష్యంగా 2001లో టిఆర్‌ఎస్‌ను స్థాపించిన కెసిఆర్‌ ‌రెండు విడుతలుగా తిరుగులేని మెజార్టీతో పాలన సాగిస్తున్నారు. అయితే 2024లో జరుగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు బదులుగా బిఆర్‌ఎస్‌తో రంగంలో నిలువబోతున్నారు. పార్టీ రంగు, జండా, గుర్తు ఏదీ మారకున్న పార్టీ పేరు మాత్రం మారుతున్నది. జాతీయ పార్టీగా రూపుదిద్దేందుకు మార్చిన ఈ పేరును ప్రజలు ఏమేరకు అమోదిస్తారన్నది భవిష్యత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాయి. ఇదిలాఉంటే బిఆర్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితిలో హ్యాట్రిక్‌ ‌కొట్టనీయవద్దన్న )క్ష్యంగా రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నీ పోరాటం చేస్తున్నాయి. ఉభయ కమ్యూనిస్టులు, ఎంఐఎం తప్ప బిజెపి, కాంగ్రెస్‌, ‌వైఎస్‌ఆర్‌టిపి, బిఎస్పీ, తెలంగాణా జనసమితి పార్టీలు వేటికవి ఆమేరకు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఈ పోటీల్లో ముందువరుసలో నిలుస్తున్నాయి. విచిత్రమేమంటే ఈ రెండు పార్టీలు కూడా బద్ద శత్రువులే. అయితే అధికార పార్టీతో ములాఖాత్‌ అయిందంటూ ఒకదానిపై ఒకటి ఈ రెండు పార్టీలు నిత్యం ఆరోపణ చేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో ఏ పార్టీ అధికార పార్టీకి సన్నిహితంగా ఉందో తెలియదుగాని, అధికార పార్టీ మాత్రం  బిఆర్‌ఎస్‌ ‌పార్టీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ రెండు పార్టీలను తమ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ముందుగానే స్పష్టంచేసింది. ఏదియేమైనా ఈ రెండు పార్టీలు కూడా బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా నైతికంగా బలహీన పర్చే విషయంలో మాత్రం పోటీ పడుతున్నాయి. బిఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులను, రానున్న ఎన్నికల్లో టికట్‌  అవకాశాలు లేవనుకునేవారిని చేరదీసే విషయంలో ఆకర్ష్ ‌పథకాన్ని ఈ రెండు పార్టీలు ప్రవేశపెడుతున్నాయి. అలాగే వోటు  హక్కు ఉన్న యువత, విద్యార్థి లోకం ఎన్నికలను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో వీరి పాత్ర గణనీయమైనది. ఆ తర్వాత బిఆర్‌ఎస్‌ ‌రెండు సార్లు అధికారంలోకి రావడం వెనుక కూడా యువత, విద్యార్థులే కారణమన్నది తెలియందికాదు. అలాంటి యువతను  రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు తమ వైపు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల పరీక్షా పేపర్లు లీకేజీ విషయాన్ని ఈ పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. దానితో పాటు నిరుద్యోగ ఉపాధి విషయంపై యువత, విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలను ఇంకా కొనసాగిస్తునే ఉన్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఈ విషయంలో విడివిడిగా,  ‘అఖిల పక్షం భరోసా’ పేరున  సంఘటితంగా నిరసన కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్నాయి. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న బిఆర్‌ఎస్‌ ‌విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టే ప్రణాళికలను రచిస్తోంది. ఇప్పటికే ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు  ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్న ఆ పార్టీ యువతను, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా  కార్యక్రమాలను చేపట్టే దిశగా ఆలోచన చేస్తున్నది. వివిధ వర్గాల వారితో చేపడుతున్న ఆత్మీ సమ్యేళనాలను మరింత విస్తృతపరుస్తూ యువకులు, విద్యార్థులకోసం ప్రత్యేక సమ్మేళనాలను నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులను అధినాయకుడు కెసిఆర్‌ ఆదేశించినట్లు తెలుస్తున్నది. యువకులు, విద్యార్థులు ఆనాడు తెగించి పోరాటం చేయకపోయి ఉన్నట్లైతే తెలంగాణ వొచ్చి ఉండేదికాదన్నది ఎవరు అవునన్నా కాదన్న ఒప్పుకోవాల్సిందే. ప్రత్యేక రాష్ట్రంలో నైనా తమకు ఉపాధి లభిస్తుందన్న ఆశతో భీకర పోరాటం చేసిన యువత ఆ తర్వాత కాలంలో తీవ్ర నిరాశకు లోనైనారు. గత ఏడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించకపోయినా, ఖాలీగా  ఉన్నవాటినైనా భర్తీ చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా మంది వయసు మీరి ఉద్యోగావకాశాలను కొల్పోయారు. అలాగే తాజాగా ఉద్యోగ నియామకాలకోసం నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అయితేనేమీ, పదవ తరగతి పేపర్‌ ‌లీకేజీ వ్యవహారాలు యువకులను, విద్యార్ధులను కలిచివేస్తున్నాయి.

దీన్ని ప్రతిపక్షాలు అవకాశంగా వాడుకోవడాన్ని తిప్పి కొట్టేందుకు అధికారపార్టీ వారితో ఆత్మీయ సమ్యేళనాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో  ఇందుకు సంబంధించిన  పూర్తి ప్రణాళికను పార్టీ వర్గాలకు అధినేత కెసిఆర్‌ ‌వివరించే అవకాశాలున్నాయి. జనాభాలో నలభై నుండి ఆ పై వయస్సున్న వారు ప్రభుత్వం నుండి ఏదో ఒక ప్రయోజనాన్ని పొందుతున్నవారే ఉన్నారు. నలభైకి కింద వోటు హక్కున్న 18 ఏళ్ళ వయసువారి వోట్ల శాతమే ఎక్కువ. అందుకు ఆ వయసు వారిని ప్రసన్నం చేసుకుంటే, వొచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌సాధించవొచ్చన్నది బిఆర్‌ఎస్‌ అధినేత ఆలోచనగా ఉందంటున్నారు. వీరితోపాటుగా తెలంగాణ సాధనలో అవిశ్రాంత పోరాటం చేసిన వారిలో జర్నలిస్టులు కూడా ఒకరు. అందుకే జర్నలిస్టుల కుటుంబాలతో కూడా ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేసి వారి సాధక బాధలను తెలుసుకోవడంతోపాటు, వారి సొంత• ఇంటి కలను నెరవేర్చాలని దిశగాకూడా కెసిఆర్‌ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇలా అన్ని వర్గాలతో ఆత్మీయ సమ్యేళనాలను నిర్వహించడంద్వారా రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌సాధించే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page