కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 01 : బీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. స్థానికంగా పాదయాత్ర నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. శుక్రవారం అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్ సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 25వ రోజు సబ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలలో అల్లాపుర్ డివిజన్ రుపురేఖలు మార్చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది అని అన్నారు. నియోజక వర్గంలో అర్హులైన ప్రతిఒక్కరికీ విడుతల వారీగా డబుల్ బెడ్ రూములు అందిస్తామని చెప్పారు. నేడు 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలు అందిస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని చెప్పారు. అభివృధినీ చూసి ప్రజలు నీరాజనం పలుకుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మేల్యే కృష్ణారావు అన్నారు.