హైరాబాద్‌లో బిజెపి దొంగ దీక్షలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 :  24 ‌గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో తెలంగాణ రైతులతో కలిసి కొట్లాడుతామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ రైతులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్‌ ‌లో బీజేపీ దొంగ దీక్ష చేస్తుందని విమర్శించారు.

దేశవ్యాప్తంగా రైతులకు పంటకు పెట్టిన కనీస ఖర్చు కూడా రావడం లేదని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస సానుభూతి కూడా లేదని కవిత మండిపడ్డారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కవిత. రైతులందరికికీ ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఢిల్లీ తెలంగాణ భవన్‌ ‌వేదికగా టీఆర్‌ఎస్‌ ‌దీక్ష కొనసాగుతున్నది. ఇందులో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ‌ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధంగా ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్‌ ‌చేస్తున్నామన్నారు. రైతు నేత రాకేష్‌ ‌టికయిత్‌ ‌తమకు మద్దతు ఇవ్వడానికి దీక్షలో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికే ఆయన వ్యవసాయ సమస్యలపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *