- వేలాదిగా పాల్గొన్న భక్తులు…భారీ భద్రత కల్పించిన నగర పోలీసులు
- రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
- కల్యాణోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలోని సీతారాంబాగ్ రామమందిరం నుంచి శ్రీరామ్ శోభాయాత్ర గురువారం ఉదయం ప్రారంభమై హనుమాన్ వ్యాయమశాల వరకు మొత్తం 6.5 కిలో వి•టర్ల మేర శోభాయాత్ర జరిగింది. శ్రీరామ్ శోభాయాత్రలో భారీగా భక్తులు పాల్గొన్నారు. సీతారాంబాగ్ ఆలయం-బోయగూడ కమాన్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ వి•దుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంది.
శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్, ఆక్టోఫస్ బలగాలతో శోభాయాత్రపై నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ యాత్రను పోలీసులు పర్యవేక్షించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు….కల్యాణోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు
రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని పలు ఆలయాల్లో శ్రీరామ కల్యాణాలను నిర్వహించారు. సీతారామ్ బాగ్ సహా అనేక ఆలయాల్లో కల్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం గాంధీ పార్క్ వద్దగల రామ మందిరంలో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పాల్గొని పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి సత్యవతి రాథోడ్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రావి•ణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలను సతీమణి ఉషా దయాకర్ రావుతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి మడూరు, వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి తదితర దేవాలయాల్లో కల్యాణోత్సవాలకు మంత్రి హాజరయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు పూజల్లో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, ఖిలావనపర్తి ఆలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేటలోని బొడ్రాయి బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో జరిగిన శ్రీరామ కల్యాణ మహోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో జరిగిన కల్యాణంలో ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. నల్లగొండలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలకమండలి చైర్మన్‌లకు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, పూజా ద్రవ్యాలు భక్తిశ్రద్దలతో అందజేశారు.