కవిత్వం మనకు మనం వెతుక్కునే జ్ఞానదిశ/కవిత్వం మనకు మనం చేసుకునే విచికిత్స అని ప్రఖ్యాత కవి డాక్టర్ బెల్లి యాదయ్య చెప్పినట్టుగా ఎన్నో జీవన సంఘటనల నుండి సందర్భోచిత కోణాలు నిరంతర, నిత్యనూతన కవి దండమూడి శ్రీచరణ్ కవిత్వంలో కోకొల్లలుగా కన్పిస్తాయి. మధూళి పేరిట ఆయన కవితా సంపుటి వెలువడింది. నిశీధిలో నిశ్శబ్దం విషాదాన్ని పలికిస్తుంటే సాలె గూళ్ళ లాంటి సమాధానం చిక్కని ప్రశ్నలు చిక్కుముడులయ్యాయంటూ జీవన ప్రతిబింబాల్ని ఈ కవిత్వం కదిలించారు. తనకూ ప్రపంచానికీ, తన విలువలకూ, చలామణిలో వున్న విలువలకూ యుద్ధం జరగాల్సిందేనని చెబుతూ మనిషిని తనతోనూ తనకు యుద్ధం అనివార్యమవుతుందన్న నగ్న సత్యాన్ని గ్రహించమన్నారు. యుద్ధానంతరం శోకం నుండి అశోకుడుద్భవించాలని చెప్పారు. కవిని జగత్తులోని కల్మషంతో సంఘర్షించమన్నారు. నిర్మాణమే నిజమైన అభ్యుదయమని భావించారు. వర్షంలో వదిలిన కాగితప్పడవల్లో బాల్యం కొట్టుకుపోయిందని వేదనచెంది విషాదమే జీవనస్వరమైందని తెలిపారు. నీ జ్ఞాపకాలు నీరెండలో గులాబీరేకులపై మంచు బిందువులు అంటూ అనూహ్యమైన ఉపమానాలనూ చెప్పారు. స్వప్నాకాశం క్షితిజరేఖ, వెన్నెల దోసిలి, సామీప్యపు అనుభవం వంటి ప్రయోగాలు చేస్తూ వాస్తవరూప దర్శనంగా కవిత్వాన్ని మలిచారు. జనం గుండెల్లో, చరిత్రలో సజీవులై నిలిచేవారి కళ్ళు కన్నీళ్ళే కురుస్తాయని, జీవితాన్ని సమాధుల్లో వారు ముగిస్తారని చెప్పారు. ఉదయాల్ని ఊడ్చేసి, హృదయాల్ని పిండేసి కన్నీళ్ళను అక్షరాలుగా రాల్చే అతడి అనామకవేదనకు రూపం అద్దారు. నిట్టూర్పులు నిమిషాల్ని కొలిస్తే, ఉషస్సులు హృదయాన్ని తొలిస్తే రేయి గడిచి ఏకాంతం ముగిసిందన్నారు. జాజ్వల్య కాంతి పుంజం మనలను ముడివేసి దూరాలను తుడిచేసి ఆశలను వెలిగించాలని ఆకాంక్షించారు. నాలుగునాళ్లు, నాలుగు రాళ్ల గురించి మనిషి తెలుసుకుని తాను జీవించినంతకాలం మమతను పంచమని సందేశించారు. బ్రతుకంటే గానుగెద్దు జీవితం కాదన్నారు. అకుంఠిత దీక్షకు, అమరత్వానికి ప్రతీకగా బ్రతకమని సూచించారు. మతికి దొరకని, శ్రుతికి కలవని అంతర్జీవన గాత్రమే తనలోని నిరంతర హోత్రమని స్పష్టపరిచారు. నిశ్శబ్దాన్ని తెరలుగా చీల్చి రైలు శబ్దం దూసుకెళ్తోందంటూ హృదయానికి వెచ్చగా తగిలన వేదనకు సమాధానం చెప్పుకున్నారు. ఎడారి జీవితంలో సేద తీర్చి ఊరడించే ఒయాసిస్సుగా కవిత మారిందని తెలిపారు. ఆలోచనల చేప పిల్లల కదలికలు చేసిన అలికిడులే తన అక్షరాలని భావాత్మకంగా చెప్పుకున్నారు. కవిత్వమే సంభ్రమంగా చెల్లించుకునే మూల్యమని, నిజానికీ, భ్రమకూ నడుమ వెలికివచ్చిన సంగతులు వాక్యాల నడుమ కళ్లుగా మారి చూపులను ప్రసరిస్తాయని వివరించారు. దుఃఖం, పరాయీకరణ, అనుభవం, విశ్వజనీనం, కవిత్వం మృదంగధ్వానమని చెప్పారు. తనకు తానే సంజాయిషీ చెప్పుకుని మనసు దర్పణాన్ని శుభ్రం చేసుకుని జ్ఞానోదయం, సూర్యోదయాలను విశ్లేషించారు. చెమట దోపిడీనీ మానవజాతి దౌర్భాగ్యంగా చెప్పారు. అవసరం చేసే అనవసరాలను తెలిపారు. ముగింపు ఏమిటో అర్ధంకాక పడ్డ అవస్థను రచయిత కోణంలో వివరించారు. రాయని కవితను తలిచి రాసి ప్రయోజనమేమిటని లోతుగా తర్కించుకున్నారు. అపహాస్యమవుతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి వేదనాస్వరం వినిపించారు. సామాన్యుడే ఎప్పటికైనా మాన్యుడని తేల్చారు. కన్నుమూసేవేళ, మిన్నుకెగసిన వేళ బ్రతుకుకు మిగిలిన శేషం ఏది అని ప్రశ్నిస్తారు. ఎన్ని కడగళ్లు మోసావో, ఎన్ని వెక్కిల్లు దాచావో, నువ్వు వెళ్ళాక అంతా శూన్యమని సత్యాన్ని వివరించారు. మాటలెన్ని ఉన్నా వాస్తవం ఒకటేనని చెప్పారు. మాటలు కత్తివేటులు, అగ్నిజ్వాలలు, మల్లెమాలలు అని వేనవేల, వేవేల దండాలను ఆ మాటలకు పెట్టారు. జ్ఞాపకాలను దోసిట దాచుకుని తపించి, జ్వలించి, దుఃఖించిన తీరును వివరించారు. గాయాల హృదయాన్ని పుస్తకాల గొంతులు ఓదార్చుతున్నాయని చెప్పారు. రెప్పలపై ముద్దరేసి, నిద్దుర కలల దుప్పటి, వెచ్చని కత్తులు వంటి ప్రయోగాలతో రేయిక చీకటి సంద్రమని తేల్చారు. చెక్కిలిపై జారిన కన్నీటి బొట్టు ఎన్నో విశ్లేషణలకు విషయ మూలమని చెప్పారు. అనుభవించిన నరకానికి ప్రతీకగా రాలిన కన్నీటి బొట్టును చూపారు. దుఃఖానల కీలల నుండి దూరం పోవడం తప్ప మరో గత్యంతరం లేదంటారు. కవి కొవ్వొత్తిగా కరిగిపోయే వాడని, అతని కవిత మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతుందని తెలిపారు. విప్పని గొంతుక ఘోషను సూచించారు. జీవిత ఘర్షణే బహుమతి అని, నడిచిన త్రోవనే చివరకు మిగిలేదని తేల్చారు. అనంతాకాశం లాంటి ప్రేమను ప్రేమించే హృదయాన్ని కోరుకున్నారు. ఏకాంతమే ఓ శిక్ష, నీ తలపుల గాయంలో ప్రతి నిమిషమూ ఓ పరీక్ష, అనుక్షణమూ గుండెకోత అని హృదయ ఘోషను విడమర్చి చెప్పారు. కర్కశ కంటక లోకంలో అన్నీ పూలే ఉన్నాయని భావిస్తే గాయపడక తప్పదని హెచ్చరించారు. రాలిన కన్నీళ్లు ఏరుకుని నాలుగు వాక్యాలు రాసుకొని ఉపశమించు అని ధైర్యం చెప్పారు. నన్ను దప్పికతో వుండనివ్వుఏవో గీతికలు ఆలాపించనివ్వుఒంటరిగా వుండనివ్వు అన్నారు. మనసు తడిసేలా, హృదిలో జ్వాలలు ఆరిపోయేలా, కష్టం విడిపోయేలా వర్షం కురవాలని కోరారు. నువ్వు వదిలేసిన జ్ఞాపకాలు గుండెపై నెత్తురు మరకలయ్యాయని వేదన పడ్డారు. వేణువులు కాదు అతడు వేదనను అమ్ముతున్నాడు అంటూ అతడి ఆకలిని కనుక్కొమ్మని తెలిపారు. కనుల దారుల్లో కలల నెగళ్ళు మండుతున్నాయన్నారు. చెక్కిలిపై కవిత కన్నీటి చారికగా మారిందని నేనో తీగ తెగిన విపంచికనంటూ వేదనను వెల్లడించారు. కళ్ళలో దాగిన నిగూఢ స్వప్నాలలో ఎన్ని సత్యాలున్నాయో అంటారు. మనసు ద్రవించిందా కురిసిపోతాను అంటూ తన అంతరంగ తత్వాన్ని తేటతెల్లం చేశారు. నేను ముగిసాక నా గురుతులుంటాయినేను విడిచేసిన ఆనవాళ్ళు ఈ జగతిలో మిలుగుతాయని చెప్పారు. నేను మీకు అర్థం కాను, అనుభూతిలా మిగిలిపోతానంటారు… మనిషి ఓ సజీవశక్తి కనుక మానసికంగా వధించకండి అని తెలిపారు. రాసినవి కొన్నే రాయాల్సినవి ఎన్నెన్నో అన్నారు. బ్రతికిన కాలపు గొప్పతనమే చచ్చాక చిరంజీవత్వం అని చెప్పారు. పుట్టుక తప్ప చావులేని వాళ్ళే అసలు దేవుళ్ళన్నారు. దుఃఖ పడి శిక్ష విధింపబడిన వారే ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పారు. మనిషంటే నమ్మకం గనుక భుజం తట్టి నడపమన్నారు. హద్దులు గీయక, సరిహద్దుల్ని చెరిపేసి అనంతంగా కవిత్వాన్ని విస్తరింపజేస్తానని తెలిపారు. వెతుకుతూ వెళ్ళాక కన్నీళ్ళ అక్షరాలు కలయికగా కవిత్వం మిగిలిపోయిందన్నారు. నమ్మకాన్ని గుండెల్లో విత్తనంగా నాటుకొమ్మని సూచించారు. ఆకళించుకునేలోగా ఏదీ మిగలదన్న సత్యాన్ని గ్రహించమన్నారు. శ్రామికుడి కష్టాన్ని దోచేస్తున్నారని వేదన చెంది అతడి స్వేదం కలిసిన మట్టిని తమ పునాదులకు వాడుకుంటున్నారని చెప్పారు. బాధలకు పల్లవి రాసి చివరి దాకా కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇచ్చారు. లోకాన్ని మలుస్తూ మార్చడానికి నువ్వే ఒక కార్యసాధకుడివి, కర్తవ్య వాహకుడివి కావాలని తెలిపారు… శిఖరమై పైకి ఎదగమని సందేశించారు. తిరుగులేని సత్యమే స్నేహమని చెప్పారు. యాత్రానుభావాలు ఎంతో గొప్పవని తెలిపారు. నూతన వేదం లిఖించేందుకు అగ్నిపుష్పాలు రావాలని ఆకాంక్షించారు. జ్వలనంలోంచి కవిత్వం జనించి వెలుగునిస్తుందని తెలిపారు. అక్షరమే అగ్ని పుష్పమై వికసిస్తుందన్నారు. అబద్ధాన్ని అందలమెక్కించడమే నేటి నిజం అని తెలిపారు. తన ఎదలోపలి వెలుగులే వసంత యామినులని చెప్పుకొచ్చారు. కలతలెరుగని రేయిలో నిదురపోయి వేదనలు మరచిపోవాలని చెప్పారు. కణకణ సంచలనమే జీవం, మనమే జగం అని తెలిపారు. ప్రాణికి ప్రాణం విలువ తెలిపేది అనుబంధమేనన్నారు. జ్ఞాపకాలు మనసు రాల్చిన తారకలని తెలిపారు. జ్ఞాపకాలు విడిచిపెట్టడం లేదు, గాయాలు మానిపోవడం లేదన్నారు. అనుబంధానికి ప్రతీక అయిన సహచరిని తలుచుకుని నీ ఆరోగ్యం ఎలా ఉందో ఇవాళ అని బాధపడ్డారు. ఎలా గడిపానో రాత్రుల్ని ఎలా నడిచానో పగళ్లని నేను జీవిత పర్యంతం దిగుళ్ళని మోయబడ్డాను అనడంలో మనసుపడిన వేదన ఎంతటిదో తెలిసిపోతుంది. మధ్య తరగతి మర్యాదల మనోవైకల్యం నన్ను అసలు అర్థం కోసం దేవుడులాండించింది అన్నారు. హృదయం కోయబడి, బ్రతుకంతా నీకే రాయబడి నేను నా నుంచి విసిరివేయబడి సజీవంగా కాల్చబడ్డానని చెప్పారు. ఒకరిని కోల్పోడవడమంటే ఖర్మకు మిగిలిపోవడమేనన్నారు. జగత్తు మాయాజూదం, విపత్తు మృత్యునాదం, చుట్టూరా కోట్లాది జనం, తోడెవరన్నదే సందేహం, సృష్టికెందుకో ఈ వైకల్యం, దృష్టికెందుకో ఈ వైశిష్ట్యం అన్న వాక్యాలు ఎంతో లోతుగా ఆలోచింపజేస్తాయి. గోడలపై రాతలై, గుండెలలో బాసలై వెలిగిన వాడు తన మరణంతోనే వీరుడై తిరిగి జన్మిస్తాడని చెప్పారు. క్షణాలు పరిమళభరితమైతే హృదయ భారం తగ్గుతుందన్నారు. ప్రతిచోటా దృతరాష్ట్రులే అయినప్పుడు ధర్మనిరతి ఎక్కడ అని వాపోయారు. భరించడం ఒక సుదీర్ఘ ఓపిక అన్నారు. కన్నీరు ఇంకి పోయాక కవిత్వమెందుకు రాస్తారు అని సూటిగా ప్రశ్నించారు. లోకరీతి తోనే నా పేచీ అని తన దారిని తాను చేసుకుని ముందుకు పోతుంటానన్నారు. ఈ ఖర్మను నేను జయించేలోగా/ ఈ జన్మను నేను ముగించేలోగా/ మాట్లాడొచ్చుగా మరోసారి అని బతిమిలాడారు. ఎన్నెన్నో అంతరంగ సంవేదనలకు అపూర్వ అక్షరీకరణగా ఈ కవిత్వం అలరారింది.
– డా. తిరునగరి శ్రీనివాస్
8466053933