స్వామివారి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు

  • ఆలయమంతా రంగురంగుల విద్యుత్‌ ‌దీపాల అలంకరణ
  • శరవేగంగా సిద్ధమవుతున్న కల్యాణ మండపం
  • 10వ తేదీన స్వామివారి కల్యాణం…11న మహాపట్టాభిషేకం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబవుతుంది. 10వ తేది ఆదివారం నాడు స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం జరుగనుంది. ఇందుకోసం భద్రాచలం ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కోవిడ్‌ ‌ప్రభావంతో గత రెండేళ్ళు స్వామివారి కల్యాణాన్ని అంతరంగికంగానే నిర్వహించారు. ఈ ఏడాది కొరోనా ప్రభావం లేకపోవడం వలన స్వామివారి కల్యాణాన్ని భక్తుల సమక్షంలో కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు.

ఇందుకోసం ఏర్పాట్ల్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామాలయం అంతా రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలతో సుందరంగా కనపడుతుంది. అంతేకాకుండా స్వామివారి కల్యాణం నిర్వహించే కల్యాణ మండపాన్ని అత్యంత పవిత్రంగా, సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు కల్యాణాన్ని ప్రశాంత వాతావరణంలో తిలకించే విధంగా సెక్టార్లను ఏర్పాటు చేసారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కల్యాణ మండపం అంతా వెదురు చాపలతో సిద్ధం చేస్తున్నారు. అంతే కాకుండా మండపం అంతా రంగురంగుల చాందిని వస్త్రాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారులైన బ్రిడ్జి సెంటర్‌, ‌చర్ల రోడ్డు, కూనవరం రోడ్డు వద్ద స్వాగత ద్వారాలను ఏర్పాటు చేసారు.

తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ‌సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిస్సా ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏడాది జరిగే స్వామివారి కల్యాణాన్ని భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. స్వామివారి కల్యాణాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా అధికార యంత్రాంగానికి సూచనలు చేసారు.

ఈ ఏడాది మంత్రుల తాకిడి ఎక్కువే…
ఈసారి జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రులు తాకిడి ఎక్కువగా ఉండనుంది. ఈసారి కేంద్రమంత్రులు కూడ కల్యాణానికి వొచ్చే అవకాశం కనపడుతుంది. ఇదే జరిగితే భక్తులకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉండనుంది. మంత్రుల ప్రభావంతో పోలీస్‌ ‌యంత్రాంగం సామాన్యమైన భక్తులను అనుమతించే అవకాశం తక్కువగా ఉన్నందున ఈసారి జరిగే స్వామివారి కల్యాణం ఒక ప్రతిష్టాత్మకంగా రాజకీయ ప్రభావం చూపే విధంగా ఉండే అవకాశం కనపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page