సెల్‌ టవర్‌ రేడియేషన్‌ ప్రమాదకరమా…?

శాస్త్రసాంకేతిక ప్రగతి రథయాత్రలో నవ్య మానవుడు డిజిటల్‌ వలలో చిక్కి ఆధునిక జీవనశైలిలో మునిగి తేలుతున్నాడు. చరవాణి శరీరంలో మరో అంగమైంది. మొబైల్‌ లేకుండా క్షణమైనా గడవని దుస్థితికి చేరుకున్నాడు ఆధునిక నరుడు. సెల్‌ ఫోన్ల వాడకం గ్రామీణ భారతానికి కూడా పాకడంతో జనావాసాల నడుమ సెల్‌ టవర్లు వెలవడం సర్వ సాధారణమైంది. ఇండియాలో వాడబడే 1.2 బిలియన్‌ మెబైల్‌ వాడే వారు (ప్రపంచవ్యాప్తంగా 7.26 బిలియన్‌), 7.73 లక్షల మెబైల్‌ టవర్స్‌, 23.7 లక్షల బేస్‌ స్టేషన్లు ఉన్నట్లు అంచనా వేశారు. మొబైల్‌ వాడకం విపరీతంగా పెరగడంతో మరో లక్ష టవర్లు రాబోయే రోజుల్లో రానున్నాయని తేల్చారు.

టవర్‌ రేడియేషన్‌ ప్రభావం
రేడియోషన్‌లలో ఎక్స్‌-రే లాంటి అయొనైజింగ్‌ వికిరణాలే కాకుండా సెల్‌ టవర్స్‌ విడుదల చేసే రేడియో తరంగాలు లాంటి నాన్‌-అయొనైజింగ్‌ వికిరణాలు కూడా ఉంటాయి. సమీపాల్లో నివసించే ప్రజలకు సెల్‌ టవర్లు ప్రమాదకరంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. పిల్లలు, పెద్దల శరీరాలకు సెల్‌ టవర్‌ వికిరణాలు ప్రమాదమని, కణజాలంపై దుష్ప్రభావ కారణం అవుతున్నాయని తేలింది. సెల్‌ టవర్‌ విడుదల చేసే రేడియేషన్‌ అధికంగా సోకిన ప్రజలకు పలు అనారోగ్యాలతో పాటు గ్లియోమా (నాళపు జీవకణాల కంతి) వ్యాధితో మెదడు కాన్సర్‌ కూడా వచ్చే అవకాశం అధికమని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనా విభాగం నిర్థారించింది. టవర్‌కు 50 మీటర్ల లోపు ఆవాసాలు కలిగిన వారి ఆరోగ్యం అతి ప్రమాదంలో పడుతున్నదని అంటున్నారు. సెల్‌ టవర్‌కు 50 మీటర్ల దూరంలో నివసించే ప్రజలు మైక్రోవేవ్‌ ఓవెన్‌లో 24 గంటలు ఉన్న దానితో సమానంగా రేడియేషన్‌ దుష్ప్రభావానికి లోనవుతారని నిర్థారించారు.

సెల్‌ టవర్‌ వికిరణాల దుష్ప్రభావాలు
సెల్‌ టవర్ల స్థాపకకు సంబంధించిన విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ, జనావాసాలకు దూరంగా నెలకొల్పుటకు అనుమతులు ఇస్తున్నారు. సెల్‌ టవర్లు విడుదల చేసే రేడియో తరంగాల తీవ్రతతో సమీప ప్రజల మెదడుతో పాటు ఇతర సున్నిత కణజాలం దెబ్బతింటుందని వివరించారు. మెదడు కాన్సర్‌తో పాటుగా నిద్ర లేమి, ఏకాగ్రత లోపం, చికాకు, చెవుల్లో శబ్దాలు, మతి మరుపు, తల నొప్పి, అజీర్ణం, తీవ్రమైన దురద, వేగంగా గుండె కొట్టుకోవడం, మైకం కమ్మడం, అలసట, తలపై జలదరింపు, శరీర ప్రతి చర్య మందగించడం, శారీరక బలహీనత, స్పెర్మ్‌ కౌంట్‌, చలనశీలతలు పడి పోవడం లాంటి దుష్ప్రభావాలు కలుగుతాయని పరిశోధనా ఫలితాలు తెలుపుతున్నాయి. సెల్‌ ఫోన్‌ వాడకం పెరిగినా మెదడు వాపు, తల నొప్పి, వినికిడ సమస్య, అనవసర ఆందోళన రుగ్మతలు (న్యురోసిస్‌) కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. బాలల్లో చిన్న సైజులో పుర్రె (స్కల్‌), మృదు కణజాలం ఉండడంతో రేడియేషన్‌ దుష్ప్రభావం అధికమని తెలుపుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, క్రీడా మైదానాలకు అతి సమీపంగా సెల్‌ టవర్లు ఉండడం శాశ్వితంగా అనారోగ్యకరం, అతి ప్రమాదకరం. అతి ప్రమాదకర రసాయనాలైన సీసం, డిడిటీ, క్లోరోఫామ్‌, పెట్రోల్‌ వాయు వాసనలతో కలిగి అనారోగ్యాలకు సమానంగా సెల్‌ టవర్‌ రేడియేషన్‌ హానిని కలిగిస్తుందన్న విషయాలు భయాన్ని కలిగిస్తున్నాయి.

జాగ్రత్తలే శ్రీరామ రక్ష
సెల్‌ టవర్లను జనావాసాలకు దూరంగా నెలకొల్పడం, సెల్‌ ఫోన్‌ మాట్లాడే సమయంలో బ్లూటూత్‌ లేదా ఇయర్‌ ఫోన్లు వాడాలని సూచిస్తున్నారు. నిద్రించే సమయం సెల్‌ ఫోన్లను దూరంగా ఉంచడం సదా ఆరోగ్యదాయకం. మన జీవనశైలి సరళతకు దోహదపడుతున్న చరవాణి వినియోగాన్ని తగ్గించుకోవడం, టవర్లకు దూరంగా ఆవాసాలు ఏర్పరుచుకోవడం కనీస అవసరం అవుతున్నదని గుర్తుంచుకుందాం.
-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
 కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *