కడప,నవంబర్30 : తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం, విస్తీర్ణంలో 40 శాతం ఉన్న సీమపై రాష్ట్ర సర్కారు వైఖరిపై అందుకే నిరసనలు పెరుగుతున్నాయి. విశాఖ రాజధాని అయితే నష్టపోయేది సీమవాసులే అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా సాగునీటి, పారిశ్రామిక రంగం పురోగమించక పోవడం వల్ల నిరుద్యోగ యువతలో ఆందోళన పెరుగుతోంది. కడప ఉక్కు ఫ్యాక్టరీకి దిక్కు లేకుండా పోయింది. ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. నీటి వనరులకు మోక్షం దక్కడం లేదు. వర్షాకాలంలోనూ అనంతలో పంటలు కాపాడాల్సిన దుస్థితి నెలకొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనంతను తాను దత్తత తీసుకున్నానని ప్రకటించిన సిఎం చంద్రబాబు, విభజన తరవాత కూడా అనంత పై ప్రత్యేక దృష్టి పెట్టానని చెప్పినా పెద్దగా ఫలితం కనిపించ లేదు. ఒకప్పటి రతనాల సీమ ఇప్పుడు నిత్య దుర్భిక్ష సీమగా మారడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం అన్న నిరసనలు వినిపిస్తున్నాయి. సీమ ప్రజల కష్టాల కన్నీళ్లు ఈనాటివి కావు. పాలకవర్గాల దగా చరిత్రా ఇప్పటిది కాదు. నాటి పెద్ద మనుషుల ఒప్పందం లోని అంశాల అమలుతో మొదలుపెడితే, నిన్న మొన్నటి రాష్ట్ర విభజన ప్రహసనం వరకు సీమ జిల్లాలకు పాలకులు రిక్తహస్తాలనే చూపించారు. ఒకప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినా, ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను అందించినా సీమ ముఖచిత్రం మారలేదు. రాష్ట్ర విభజన తరువాతైనా తమ కష్టాలు తీరుతాయని, నిధుల కేటాయింపులో ప్రాధాన్యత లభిస్తుందని భావించిన ప్రజానీకానికి చంద్రబాబునాయుడి పాలన తీవ్ర నిరాశనే మిగిల్చింది. సీమవాసి అయిన జగన్ వల్ల కూడా ఇక్కడ పరిస్థితి మారడం లేదు.
సీమకు ఎంతో చేయాల్సి ఉన్నా జగన్ కూడా విశాఖ కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రాధాన్యత సంగతి అటు ఉంచి విభజన సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి అంటూ ఇచ్చిన హా అమలుకూ దిక్కులేని స్థితి ఏర్పడింది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఎప్పుడు కార్యరూపంలోకి వస్తాయో అంతుపట్టకుండా మారింది. ఎన్నికలప్పుడు పాలక వర్గాలు అరచేతిలో చూపించే స్వర్గం సామాన్య ప్రజానీకానికి ఎండమావి గానే మిగిలిపోయింది. ఊరించే నీటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీలు, అభివృద్ధి పథకాలు కాగితాలకే పరిమిత మయ్యాయి. ఫలితంగా తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల కడగండ్ల కు అంతులేకుండా పోతోంది. ఉన్న ఊరిలో పనులు లేక, బతకడానికి మరో మార్గం లేక వలస పోతున్న వ్యథా భరిత దృశ్యాలు సీమ జిల్లాల్లో అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇటీవల అనంత,కడప తదితర జిల్లాల నుంచి వేలాదిగా కూలీ పనులకు వసలపోయారు.
ఈ దయనీయ పరిస్థితిపై స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలకు పట్టడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను విమర్శించడంతో సరిపెట్టుకుంటున్నారు. సీమకు అన్యాయాలపై, నిర్లక్ష్యంపై అడపాదడపా వామపక్షాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో ప్రారంభమైన హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల ఫలితాలు ప్రజలకు ఎప్పుడందు తాయో తెలియని స్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులపై మరికొంత శ్రద్ధ చూపిస్తే కొంతమేరకైనా సీమ ప్రజల జలార్తి తీరే అవకాశం ఉంది. తుంగభద్ర హెచ్‌ఎల్‌సి, పెన్నా- అహోబిలం, తెలుగు గంగ ప్రాజెక్టుల పట్ల వీరిది చిన్నచూపే. వీటిని పూర్తిచేసి సత్వరంగా నీటిని అందించ డానికి బదులుగా గోదావరి జలాలను పారిస్తామనడం,కరువును పారదోలతామనడం ప్రజలను భ్రమల్లో ముంచే ప్రయత్నంగానే చూడాలి. సీమలో ప్రవహించే చిన్నాచితకా వాగులు, వంకల్లోని నీటిని సద్వినియోగం చేయాలన్న ఆలోచనగానీ, అటువంటి ప్రతిపాదనలు గానీ రాష్ట్ర సర్కారు చేయడం లేదు. ఉపాధికింద నిరుపేద కూలీలకు ఇవ్వాల్సిన వందల కోట్ల రూపాయల మొత్తాన్ని బకాయి పెట్టడం ఏ రకమైన ఆదుకునే చర్య అన్నది ఆలోచన చేయాలి.