- వైఖరి వితండంగా వుంది…చాలా విచిత్రంగా చేస్తున్నారు
- బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం
- బాయిల్డ్ రైస్ వద్దు…రైతులకు మనవి
- నూకల ఖర్చు రాష్ట్రమే భరించాలి
- దేశం మొత్తం ఒకే విధానం ఉంది..కెసిఆర్ కుటుంబంలోనే వేర్వేరు విధానాలు
- ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్12 : కెసిఆర్ చేసినది రైతు దీక్షా కాదు, రైతు పోరాటమూ కాదు..కెసిఆర్‌ది రాజకీయ ఆరాటం, అధికారం నిలుపుకోవడం కోసం చేసే ప్రయత్నం..తన ముద్దుల కొడుకుకు అధికారం కట్టబెట్టటం కోసం చేసే ఆరాటమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. వడ్ల విషయంలో లేని సమస్యను ఉన్నట్టుగా కెసిఆర్ ప్రచారం చేస్తున్నారన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ కెసిఆర్ రాసిచ్చిన మాట నిజమా కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నిచారు. గతంలో వ్యవసాయ మోటర్లకు సంబంధించి కేంద్రం మీటర్లు పెడుతుందంటూ కెసిఆర్ నానా హంగామా చేశారు. అయితే మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తెలంగాణ రైతులు కూడా అర్థం చేసుకున్నారని, వడ్ల విషయంలో కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు. బాయిల్డ్ రైస్ తినే రాష్ట్రాల్లో బాయిల్డ్ రైస్ వినియోగం బాగా తగ్గిందని, తెలంగాణతో సహా ప్రజలు ఎక్కడా బాయిల్డ్ రైస్ తినడం లేదని, ఉచితంగా ఇచ్చినా సరే, తినే పరిస్థితి లేదని అన్నారు.
కేవలం తెలంగాణలోనే కాదు, బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలను కూడా ఇకపై బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేయవద్దని కేంద్రం కోరుతూ వొచ్చిందని, కేసీఆర్ కోసం బాయిల్డ్ రైస్ వద్దనలేదని, దేశంలో అన్ని రాష్ట్రాలకు తాము ఇదే చెప్పామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజాధనం వృథా చేయకూడదనే బాయిల్డ్ రైస్ వొద్దని చెబుతున్నామని అన్నారు. గత సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన బియ్యమే తెలంగాణా ఇంకా ఇవ్వలేదని, గత సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కొంటామని తాము చెప్పామని, ఆ అగ్రిమెంట్‌లో మిగులు బాయిల్డ్ రైస్ ఉంటే, అది కూడా కొంటామని అన్నమని, 8.34 లక్షల మెట్రిక్ టన్నుల (ఇందులో 1.34 లక్షల బాయిల్డ్ రైస్ కలుపుకుని) ఇవ్వాల్సిన బియ్యమే ఇప్పటివరకు ఎఫ్‌సిఐకి కెసిఆర్ అందించలేదని కిషన్ రెడి వివరించారు.
గతంలో ఇచ్చిన టార్గెట్ ఇంకా కెసిఆర్ పూర్తిచేయలేదని, ఇప్పటికే కేంద్రం ఆరు దఫాలు టార్గెట్ పొడిగించిందని, అయినా ఇంకా ఎందుకు వడ్లు ఇవ్వలేకపోయారనేదానికి కెసిఆర్ సమాధానం చెప్పాలని, టార్గెట్ మేరకు తెలంగాణాలో పంట పండలేదా? లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేసుకున్నారా? అసలు ఏమైందో ముందు కెసిఆర్ వెల్లడించాలని అన్నారు. కేసీఆర్‌ను కాదని, తాము చెబితేనే రైతులు వరి సాగు చేసినట్టు కెసిఆర్ ప్రచారం చేస్తున్నారని, మోటర్లకు మీటర్ల విషయంలో ఎలాగైతే తప్పుడు ప్రచారం చేశారో ఇప్పుడు కూడా అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఇప్పటికైనా రబీలో వొచ్చిన దిగుబడిని నేరుగా మిల్లు పట్టించి ఇవ్వండి…బాయిల్డ్ రైస్ చేయకండి…నూకలు వస్తే భరించండి… ఆ మాత్రం రైతులకోసం చేయలేరా? తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం ఈ నష్టాన్ని భరించలేదా..? అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశించారు.
నియమాల ప్రకారం కేంద్రం కూడా కొంత శాతం నూకలు తీసుకుంటుందని, నియమ, నిబంధనల ప్రకారం 25శాతం నూకలు తీసుకునేందుకు ఎఫ్‌సిఐ అనుమతిస్తుందని, ఇవన్నీ పోను మిగిలే నూకలు చాలా తక్కువ ఉంటాయని కేంద్ర మంత్రి వివరించారు. ఆ మాత్రం తెలంగాణ రాష్ట్రం భరించలేదా? కర్ణాటక, ఏపీ సహా ఇతర రాష్ట్రాలు భరిస్తున్నాయ్ కదా అది చూసి కెసిఆర్ నేర్చుకోలేరా అని ఎదురు ప్రశ్నిచారు. కేంద్రం ఇస్తున్న అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ద్వారా రాష్ట్ర సివిల్ సప్లైస్ పనిచేస్తుందని అన్నారు. ప్రతి క్వింటాలు మీద 3,187 రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తుందని, బస్తా సంచులకు, సుతిలి దారానికి, హమాలికి.. ఇలా అన్ని ఖర్చులు కేంద్రమే భరిస్తుందని తెలిపారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే సంచలనం అన్నారు. చరిత్ర సృష్టిస్తామన్నారు. కానీ ఇంతవరకు అమలే కాలేదని ఆయన అన్నారు.
24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులు తెలంగాణలో రైతులకు 100 శాతం ఉచితంగా సరఫరా చేస్తామని కేసీఆర్ అన్నారని చెబుతూ కెసిఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను చూపించారు. గిట్టుబాటు ధర లేకపోతే రైతు సమన్వయ సమితులు కొంటాయన్నారని, సమితులు ఉన్నాయో లేవో తెలీదు కానీ ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం వున్నారని అన్నారు. బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారని, రైతులు వడ్లనే పండిస్తారని, బాయిల్డ్ రైస్ పండించరని, పండిన వడ్లను రా రైస్ చేయాలా లేక బాయిల్డ్ రైస్ చేయాలా అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో బాయిల్డ్ రైస్ లేదని, ఓ 20 రోజులు ముందు సాగు మొదలుపెట్టినా, విత్తనం రకాన్ని మార్చినా ఈ బాయిల్డ్ రైస్ సమస్య సమసిపోతుందని అన్నారు. కేంద్రం పెట్టిన టార్గెట్‌ను తెలంగాణ రాష్ట్రం అందుకోలేకపోయిందన్నారు.
కేంద్రం ఎక్కడా మాట తప్పలేదని, ఇచ్చిన అంచనాకు మించి కేంద్రం కొంటూ వొచ్చిందని, ఇప్పటికైనా ముడి బియ్యం సరఫరా చేయండని, చివరి గింజ వరకు కేంద్రం కొనుగోలు చేస్తుందని అన్నారు. తెలంగాణకు ఒక విధానం, దేశంలో మిగతా రాష్ట్రాలకు ఇంకో విధానం లేదన్నారు. తాను 2004లో ఎమ్మెల్యే అయినప్పటి కంటే ముందు నుంచే ఈ విధానం ఉందని, తమ హయాంలో చేసింది కాదని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని, ఈ సేకరణ విధానం ఎందుకు మార్చలేదని కిషన్ రెడ్డి ప్రశ్నిచారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న చందంగా పోటీలు పడి, వంతులు వేసుకుని కేంద్రాన్ని తిడుతున్నారని, ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం ఏరోజూ వెనుకడుగు వేయలేదని, తాము అధికారంలోకి రాకముందు 3,400 కోట్లు మాత్రమే తెలంగాణ రైతుకు అందితే తాము అధికారంలోకి వొచ్చాక 26 వేల కోట్లకు పైగా అందుతున్నదన్నారు.
తెలంగాణలో బాయిల్డ్ రైస్ తీసుకోకుండా, పంజాబ్‌లో తీసుకుంటే…ఇదే నా సవాల్.. నేను దేనికైనా సిద్ధం..నిరూపించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు. కనీస మద్ధతు ధర పెంచడమే తమ పొరపాటా..ఇదే రైతు వ్యతిరేక విధానమా అని ప్రశ్నిచారు. స్వాతంత్య్రం వొచ్చినప్పటి నుంచి ఒక ధర ఉంటే, తాము అధికారంలోకి వొచ్చాక 50శాతం పైగా కనీస మద్దతు ధర పెంచామని తెలిపారు. దేశంలో ఒకే విధానం ఉందని, కేసీఆర్ కుటుంబంలోనే వేర్వేరు విధానాలు ఉన్నాయని కిఫన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కుటుంబ రాజకీయాల మీద మోడీ యుద్ధం ప్రకటించారని, దాన్ని ఎదుర్కునడం కోసమే ఈ యుద్ధం కెసిఆర్ మొదలు పెట్టారని, కుటుంబ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు తిలోదకాలు ఇవ్వనున్నారని అన్నారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని, ఆ కుటుంబం అడుగులకు మడుగులొత్తడం కోసం కాదని, మోడీకి చాలా పనులున్నాయని, ఆయనకు కేసీఆర్‌ను టచ్ చేయాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలే కెసిఆర్‌ను టచ్ చేస్తారన్నారు.
రైతులకు తము బాయిల్డ్ రైస్ వద్దు…ముడి బియ్యం ఎంతైనా తీసుకుంటామని మనవి చేస్తున్నామన్నారు. నూకల శాతం తగ్గించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏపీలోనూ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని, బాయిల్డ్ రైస్ విషయంలో ఏపీ కూడా ఒప్పుకుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక బడ్జెట్ పెట్టి మరీ నూకల నష్టాన్ని భరిస్తామని, రాజకీయ దురుద్దేశాలతో కేసులు ఉండవని, అయితే అవినీతిని చూస్తూ ఊరుకోమని అన్నారు. మీ రాజకీయ చదరంగంలో..మీ పుత్రవాత్సల్యంతో తెలంగాణ రైతులను బలి చేయొద్దని సిఎం కెసిఆర్‌కు కిషన్ రెడ్డి సూచించారు. ఎందరో సీఎంలు వొచ్చారు, పోయారని, వ్యవస్థలను నిర్వీర్యం చేయొద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థ మీద కత్తులు నూరడం సరికాదని, ఒక ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ కెసిఆర్ చెప్పినట్టు వినలేదని ఆమెను అవమానిస్తున్నారని అన్నారు.