- కేంద్రంతో కొట్లాడటానికి కేసీఆర్ రైతుల్ని వాడుకుంటున్నారు
- 45 రోజులు సివిల్ సప్లై శాఖపై పెత్తనం, 10 వేల కోట్లు ఇస్తే వడ్లు కొని చూపిస్తా
- రైతు బంధు పేరుతో వారి చావుకు కెసిఆర్ నజరానా ఇస్తున్నరు
- దేశానికి కావలసిన విధానాలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 30 : వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రాన్ని దోషిగా చూపేందుకు కేసీఆర్ రైతుల జీవితాలను పణంగా పెట్టారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఎంపి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నెపంతో ఎనిమిదేండ్ల దోపిడి, అనాలోచిత నిర్ణయాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం •చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మనుగడ కోసం వరి రైతులన్ని పావుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రైతులపై నిజంగా చిత్తశుద్ది ఉంటే దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ జంతర్ మంతర్‌లో అమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఒకరిపై ఒకరు పోటీ పడుతూ రాహుల్ గాంధీని విమర్శించే ప్రయత్నం చేశారన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ సహేతుక సూచనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశించామన్నారు. తాను మాత్రం విలాసవంతమైన విహార యాత్ర ముగించుకొని వొచ్చిన కేటీఆర్ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అడిగారు, కేటీఆర్‌కు దేశ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనల గురించి ఎలాంటి అవగాహన లేదు కనుకే ఇలా మాట్లాడుతూ వున్నారని రేవంత్ దుయ్యబట్టారు. చదువుకుంటున్న రోజుల్లో, తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌కు తెలంగాణతో సంబంధం లేదన్నారు. విజయవాడ, గుంటురులో విద్యాభ్యాసం, పుణే, అమెరికాలో ఉద్యోగం చేసిన ఆయనకు దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు తెలియవన్నారు. కాంగ్రెస్ చరిత్ర, తీసుకువచ్చిన సంస్కరణలు తెలియకపోతే తండ్రి కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలన్నారు.
‘దేశానికి స్వతంత్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. ప్రపంచం దేశాలతో పోటీ పడే సరళీకృత విధానాలను కాంగ్రెస్ తెచ్చిందన్నారు. దేశంలో హరిత విప్లవం తీసుకువచ్చి…భాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి శ్రీరాం సాగర్, అలీ సాగర్ వంటి ఎన్నో జలవనరుల ప్రోజెక్ట్‌లను కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్నారు. తెలంగాణలో నిర్మించిన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ వంటి ప్రాజెక్ట్‌లు ఇందులో భాగమే అన్నారు. స్టీలింగ్ యాక్ట్‌తో భూముల్ని సేకరించి, అసైన్డ్ పట్టాల ద్వారా పేదలకు భూముల్ని పంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఆ భూముల్లో పండించిన రైతు పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) తీసుకొచ్చింది తమ పార్టీయే అన్నారు. విత్తనాల పరిశోధన కోసం ఇక్రిసాట్ సంస్థ, రైతులకు రుణ మాఫీ, రుణ మాఫీ అందని కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం, ఉచిత కరెంట్, మార్కెట్ యార్డ్‌లు, మండీల వ్యవస్థలను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగాగ రేవంత్ గుర్తు చేశారు. 2004లో వైఎస్సార్ రూ.
1259 కోట్ల రైతుల విద్యుత్ బకాయిలను ఒక్క కలం పోటుతో మాఫీ చేశారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వచ్చని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. వీటితో పాటూ ఆర్టీఐ, ఉపాధి హామి పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రైట్ టూ ఎడ్యూకేషన్ యాక్ట్‌ను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందన్నారు. 120 ఏండ్ల తర్వాత భూసేకరణ చట్టాన్ని సవరించి భూ నిర్వాసితులకు, నష్టపోయిన వారికి మేలు చేసినట్లు చెప్పారు. ఎత్తైన ప్రాంతంలో ఉండే తెలంగాణకు సాగు, తాగు నీటిని అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు చేపట్టిందన్నరు. దీంతో తెలంగాణలో ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు జలయజ్ఞం పొగ్రామ్‌ను చేపట్టిందన్నారు. కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను ప్రారంభించిందని చెప్పారు. పాలమూరు ఎత్తి పోతలకు అనుమతి ఇవ్వడంతో పాటూ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కానీ, ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగ్ పేరుతో కెసిఆర్ రూ. 2 లక్ష లకోట్లు ఖర్చు పెట్టారన్నారు. అయినప్పటికీ ఒక్క ఎకరానికి నీరు ఇవ్వకుండ, వేలాది కోట్ల కనక వర్షాన్ని ఫామ్‌హౌజ్‌లో కురిపించుకున్నారన్నారు. ప్రాణహిత చేవేళ్ల పేరు మార్చి కాళేశ్వరం, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో రూ.38 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపడితే ఇప్పుడు లక్షన్నర కోట్లకు మార్చారన్నారు. అలాగే, రూ. 16 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపడితే, దాన్ని రూ. 65 వేల కోట్లకుపెంచి ఇంకో వంద ఏండ్లు అయినా ప్రాజెక్ట్ పూర్తి కాకుండా జఠిల సమస్యగా చేశారన్నారు. రంగా రెడ్డి జిల్లా ప్రజల జీవితాలతో కేసీఆర్ కుటుంబం, టీఆర్‌ఎస్ పార్టీ చలగాటం ఆడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాలపై కేటీఆర్‌తో చర్చకు తాను సిద్ధమన్నారు. దేశంలోనే తెలంగాణలో అత్యుత్తమ పథకాలు అమలవుతున్నాయని కేటీఆర్ గతంలో సవాల్ విసిరారి గుర్తు చేశారు. అయితే, చత్తీస్ ఘడ్‌లో కాంగ్రెస్ సర్కార్ దేశంలోనే అత్యుత్తమ వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తుందని తెలిపారు. వాటి గురించి తెలుసుకునేందుకు చత్తీస్ ఘడ్ పర్యటనకు రావాలని మంత్రి కేటీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్ సిఎం అయితే, వారి కుటుంబ సభ్యులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యారన్నారు. చుట్టాలు ఎన్నో పదవుల్లో కొనసాగుతున్నారని, వారికి వందల ఎకరాలు, వేల కోట్లు వొచ్చాయని ఆరోపించారు. ఒక దోపిడి దారుడికి ఎన్ని అవలక్షణాలు ఉండాలో అవన్నీ కేసీఆర్ కుటుంబానికి ఉన్నాయన్నారు. కానీ, దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందన్నారు.
దేశానికి ప్రధాని అయ్యే అవకాశం వొచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ త్యాగం చేశారన్నారు. తెలంగాణలోనూ ఎంతో మందికి కేంద్ర మంత్రులుగా పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రపతి, ప్రధానులుగా తెలుగు బిడ్డలకు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. వాళ్ల కుటుంబంతో, కేటీఆర్‌కు పోలికా అని ఎద్దేవా చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం చేస్తుందని, ఈ పోరాటంలో రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా పాల్గొంటారని రేవంత్ చెప్పారు.
నిజాం వారసులకంటే కెసిఆర్ వారసులే అత్యంత ధనవంతులు
తెలంగాణ పేద రాష్ట్రం అయితే, కేసీఆర్‌ది ధనిక కుటుంబం ఎలా అయిందని ప్రశ్నించారు. నిజాం వారసుల కంటే, కేసీఆర్ వారసులే నేడు అత్యంత ధనవంతులు అయ్యారన్నారు. తెలంగాణలో చెరుకు ఫ్యాక్టరీ మూసి చెరుకు పంటను రైతులకు దూరం చేశారన్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న, కందులు, జొన్నలు, మక్కలు అన్నింటికి రైతుల్ని దూరం చేశారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలన్నిటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కోటి ఎకరాలకు మాగాణి అన్న కేసీఆర్, ఇప్పుడు వరి వేస్తే ఉరే అంటున్నారని గుర్తు చేశారు. దిల్లీలో అగ్గి పుట్టిస్తా, మోడీపై యుద్ధం అని చెప్పి… చేసింది ఏమి లేదన్నారు. వడ్ల కొనుగోలు సమస్య జఠిలం కావడానికి కారణం కేసీఆరే అని అన్నారు.
బాయిల్డ్ రైస్ సరఫరా చేయమని సంతకం పెట్టి తెలంగాణ రైతులను మోసం చేశారన్నారు. మెడ మీద కత్తి పెడితే…ఫౌమ్ హౌస్, కోకాపేట్‌లోని విలువైన భూములు, ఆస్తులు రాసిస్తారా అని ప్రశ్నించారు. ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రమే బియ్యం కొంటే కేసీఆర్‌కు సిఎం పదవి ఎందుకని, బ్రోకర్ అవుతావా అని ప్రశ్నించారు. పండించిన పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతుల జీవితాలతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పంట సాగు చేశారో, ఎంత ఉత్పత్తి జరిగిందో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవన్నారు. దీనిపై మార్చి మొదటి వారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖతో మీటింగ్ జరగాలన్నారు. కానీ, కేసీఆర్ నిర్లక్ష్యంతో ఈ మీటింగ్ జరగలేదని, మరో రెండు రోజుల్లో కోతలు ప్రారంభకానున్నాయని చెప్పారు. ఒకవేళ కేంద్రం పంట కొనేందుకు అంగీకరించినా…రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదన్నారు.
ఒక నెల ఆలస్యంగా పంటను కొనుగోలు చేసే పరిస్థితులు ఏర్పడుతాయని, దీంతో మరోసారి కల్లాల్లో కుప్పలపై రైతులు ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి వొచ్చిందన్నారు. రైతు బీమా పథకంతో కేసీఆర్ రైతుల చావుకు నజరానా ఇస్తున్నారని విమర్శించారు. బతికున్నప్పుడు రైతు పంటను కొనలేని ప్రభుత్వం, రైతు బీమా పేరుతో చచ్చాక రూ. 5 లక్షల ఇస్తామంటూ ఆత్య హత్యలు పెంచుతుందని ఆరోపించారు. రైతు బీమా పథకం ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కేవలం 7,400 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డస్ బ్యూరో(ఎన్ సిఆర్బి) రికార్డు చెబుతున్నాయన్నారు. కానీ, పథకం అమలు తర్వాత ఆత్మహత్యలు 74 వేలకు పెరిగాయని ప్రభుత్వమే చెప్పిందన్నారు. బంగారు తెలంగాణ కాదు, బొందల గడ్డ తెలంగాణగా మార్చుతున్నారని విమర్శించారు.
ఎనిమిదేళ్లుగా కేంద్రంలో ప్రతి బిల్లుకు మద్దతిచారు…ఇప్పుడు విమర్శలు రాజకీయ ఎత్తుగడ
ఎనిమిదేండ్లుగా కేంద్రంతో అంటకాగి, ప్రతి బిల్లుకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ ఎత్తు గడలో కేంద్రంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ‘కేసీఆర్ ఏ నొప్పితో ఢిల్లీ వొస్తున్నారో నాకు తెలియదు. పంటి నొప్పో, కొడుకు నొప్పో. చావునోట్లు తలపెట్టే కేసీఆర్ వడ్ల సమస్యపై జంతర్ మంతర్‌లో కూర్చోవాలి. మేము టెంట్లు, రక్షణ కల్పిస్తాం. కేసీఆర్ చచ్చుడో…వడ్లు కొనుడో జరగాలి.’ అని అన్నారు. సెంట్రల్ హాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ఫోటోలు దిగి మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామంటున్నారని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో టీఆర్‌ఎస్ ఎంపీలు చెప్రాసీలు, గుమాస్తాలన్నారు. వివిధ పార్టీల నేతలతో రాజకీయంగా చర్చిండానికి వెళ్తే కవిత, సంతోష్‌లు ఉంటారని, కానీ, వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చలకు ఈ సన్యాసులు ఎందుకని ఎద్దేవా చేశారు. పార్టీలో తమ పరిస్థితి గురించి గోడ పక్కకు తీసుకెళ్లి అడిగితే ఎంపీలు బోరున ఏడుస్తారన్నారు.
వీడియోల మీద, ఫోటోల మీద, ట్విట్లర్ల మీద ఉన్న మోజు, ఫోజు రైతుల పట్ల టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. వడ్లు కొనకపోతే కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజలు బహిరంగంగా ఉరి వేస్తారన్నారు. ప్రగతి భవన్, పోలీసులు వాళ్లను అడ్డుకోలేరని హెచ్చరించారు. 45 రోజులు సివిల్ సప్లై శాఖ అప్పగించి రూ.10 వేల కోట్లు ఇస్తే వడ్లు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందన్నారు. బాయిల్డ్ రైస్ కాకుండా మిల్లర్లు రైస్ తీస్తే…నూకల రూపంలో వొచ్చే బియ్యానికి తాము నష్టం పరిహారం చెల్లిస్తామన్నారు. దీనికోసం కేవలం వెయ్యి కోట్లు సరిపోతుందని, మిగిలిన రూ.9 వేల కోట్లు తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్తామన్నారు.