- టిఆర్‌ఎస్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నరు
- బీజేపీ మండల ప్రశిక్షణ శిబిరంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తాండూరు, మే 4(ప్రజాతంత్ర విలేఖరి) : సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు జీపీఆర్ గార్డెన్‌లో జరిగిన బీజేపీ మండల శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని ఎదురు చూసిన జనం ఆ తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను చూసి అసహ్యించుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామిలను తుంగలో తొక్కారని అన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మద్యం వ్యవస్థతో పేదలను మద్యానికి బానిస చేసి చావుల తెలంగాణగా మారుస్తున్నారని అన్నారు. మద్యం వ్యాపారంతో వొచ్చిన రూ. 30 వేల కోట్లతొనే రైతులకు రైతుబంధు, కల్యాణ లక్ష్యీ, షాధీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు డబ్బులను సీఎం కేసీఆర్ తన సొంత నిధులతో ఇవ్వడంలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు.
వొచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మె పరిస్థితి లేదని, గతంలో కాంగ్రెస్ నేతలకు వోట్లేసి గెలిపిస్తే టీఆర్‌ఎస్ చెంతకు చేరడంతో ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్‌కు వోటేస్తే టీఆర్‌ఎస్‌కే లాభమనే విషయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఇక్కడి ప్రాంతాలకు సాగునీరు కలం సాకారం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేణు గోపాల్, రణదీప్, జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగారం నర్సింలు, నాయకులు బంటారం భద్రేశ్వర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, పూజారి పాండు, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, యాలాల మండల అధ్యక్షులు మహిపాల్, కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, పూజా, యాలాల మండల ఇంచార్జ్ రజనీకాంత్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.