బానిసలంటే…
దోపిడీ పీడనలో
అణిచివేత రాపిడిలో

నిర్భందాల నీలి నీడల్లో
నియంతల పదఘట్టనలో
మగ్గువారు మాత్రమే కాదు
వీరుల వారసులమని

త్యాగానికి ప్రతీకలమని
దేశ భక్తికి మారుపేర్లమని
బాధ్యత గల పౌరులమని
ఉత్తపుణ్య ముచ్చట్లు వల్లించి
ఊరేగేవారే సిసలు గులాములు

శాంతిని కాంక్షించని
స్వేచ్ఛను శ్వాసించని
మార్పును స్వాగతించని
సమైక్యతను స్వప్నించని
చాందసులే నికార్సు దాసీలు

అన్యాయాన్ని ప్రశ్నించని
ఆధిపత్యాన్ని ఎదురించని
నిరంకుసత్వాన్ని నిలదీయని
రాజ్య హింసను దనుమాడని
నియంతల్ని తుదముట్టించని
పిరికిపందలే ఫక్తు పరతంత్రులు

ధిక్కారాలకు శృతి కలుపక
విప్లవాలకు జేజేలు పలుకక
ఉద్యమాలకు ఊతమివ్వక
తిరుగుబాటుకు అడుగేయక
బుద్ధవిగ్రహంలా పడుండేవారే
బానిసత్వానికి చిరునామాలు
పరాధీనతకు సజీవ సాక్ష్యాలు

– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *