సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: సిద్ధిపేట అసెంబ్లీ స్థానంపై భారతీయ జనతా పార్టీ(బిజెపి)స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. సిరిసిల్ల తరహా ఫార్మూలానే సిద్ధిపేటలోనూ అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై స్థానిక నాయకులను పోటీకి దించకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డిని పోటీ చేయిస్తున్నట్లుగానే…
సిద్ధిపేటలో కూడా మంత్రి హరీష్‌రావుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్‌పర్సన్, మలి విడుత తెలంగాణ ఉద్యమ నాయకురాలైన తుల ఉమను బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ స్థానంపై బిజెపి పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక దృష్టిని సారించినట్లు సమాచారం. బిఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమనేతగా పేరున్న తుల ఉమను బరిలో దించేందుకు ఈ మేరకు ఆదివారం రాత్రి రాజేందర్ ఇంట్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీకి చెందిన నేత ఒకరు సోమవారం ‘ప్రజాతంత్ర’కు తెలిపారు. ఈటల రాజేందర్ ఈ దఫా తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌తో పాటు సిఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి కూడా ఎన్నికల బరిలో దిగుతున్న విషయం విధితమే. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్న రాజేందర్..పక్క నియోజకవర్గమైన సిద్ధిపేటలో కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టడం కోసం అన్వేషణ చేస్తూ…తుల ఉమ అభ్యర్థిత్వంను తెరపైకి తెచ్చారని సమాచారం. వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట అసెంబ్లీ స్థానం నుండి స్థానిక బిజెపి నేతలు దూది శ్రీకాంత్‌రెడ్డి, కొత్తపల్లి వేణుగోపాల్, ఉడుత మల్లేశం యాదవ్, పూల బాలకృష్ణారెడ్డి, బైరి శంకర్ ముదిరాజ్, చక్రధర్‌గౌడ్, నాయిని నరోత్తంరెడ్డి, సొప్పదండి విద్యాసాగర్, అరుణారెడ్డి తదితరులు ఆశిస్తూ ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేతలందరూ ఎవరికి వారుగా టికెట్‌ను దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కొరకు పార్టీ రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డాక్టర్ ఎం.లక్ష్మణ్, రఘునందన్‌రావు ఇండ్ల చుట్టుతో పాటు దిల్లీ నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు సమాచారం.
కాగా, మరో ఒకట్రెండు రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సిద్ధిపేట అభ్యర్థి ఎవరు ఉంటే బాగుంటుంది. స్థానికంగా ఎవరెవరూ టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో మంత్రి హరీష్‌రావుకు ఎదరుపడి, నిలబడే వారెవరూ, ఎవరైతే పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని ఈటల రాజేందర్ ఇంట్లో జరిగిన పలువురు ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సిద్ధిపేట నియోజకవర్గంకు చెందిన పలువురు నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో… ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా ఈటల ఈ నాయకులతో తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న వారిలో అంతగా బలమైన అభ్యర్థి ఎవరూ లేరనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తుంది. స్థానికంగా నేతలెవరిని దించినా పెద్దగా ప్రయోజనం, ఫలితం ఉండకపోవచ్చనీ ఈటల రాజేందర్‌తో సమావేశమైన నేతల్లో మెజారిటీ నేతలు అభిప్రాయాన్ని చెప్పగా… సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థిగా తుల ఉమను దించితే ఎలా ఉంటుందని ఈటల రాజేందర్ తుల ఉమ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తుల ఉమ మలి విడుత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారనీ, బిఆర్‌ఎస్ పార్టీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పని చేశారనీ, ఆమె అయితే మంత్రి హరీష్‌రావుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని ఈటల రాజేందర్ చెప్పినట్లు తెలుస్తుంది. సిద్ధిపేట ఎన్నికల బరిలో బిజెపి పార్టీ తరపున తుల ఉమను దించుతామనీ, దీని కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిందిగా ఈటల రాజేందర్ సమావేశంలో పాల్గొన్న నేతలకు సూచనప్రాయంగా సంకేతాలు ఇచ్చారని తెలుస్తుంది. తుల ఉమతో పాటు స్థానికేతరుడైన ‘రెడ్డి’సామాజిక వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరును కూడా సమావేశంలో పాల్గొన్న నేతల దృష్టికి ఈటల రాజేందర్ తెచ్చారనీ, అయితే, తుల ఉమ అభ్యర్థిత్వంపైనే ఈటల మొగ్గును చూపెట్టారని సమాచారం.
ఇదిలా ఉంటే, ఈటల రాజేందర్ బిజెపిలో చేరిన సందర్భంలోనే తుల ఉమ కూడా బిఆర్‌ఎస్‌ను వీడి ఈటలతో పాటు బిజెపిలో చేరారు. తుల ఉమ ప్రస్తుతం బిజెపి తరపున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. తుల ఉమ కోసం కూడా ఈటల రాజేందర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కాగా, ఇదే స్థానం కోసం మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమేనని విద్యాసాగర్‌రావు కూడా తన కొడుకు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యాసాగర్‌రావు పట్ల బిజెపి అధిష్టానం మొగ్గు చూపుతుందని గ్రహించిన ఈటల రాజేందర్..తుల ఉమను సిద్ధిపేట నుండి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారనీ సమాచారం. ఇదే గనక జరిగితే సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకట్రెండు రోజుల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉందని పార్టీ నాయకుల ద్వారా తెలుస్తుంది. ఈ జాబితాలో సిద్ధిపేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థి పేరు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.