సిఎం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి

మేమూ భాగస్వాములమవుతాం…భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు
కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్న మంత్రి సీతక్క

సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 25 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి  సీతక్క తమ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి దర్శించుకున్నారు. ఉదయం ఆలయ అతిథి గృహంకు  చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పి అఖిల్‌ మహాజన్‌లు పూల మొక్కలు బహూకరించి సాదర స్వాగతం పలికారు.

ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అద్దాల మండపంలో మంత్రికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ ఈఓ కృష్ట ప్రసాద్‌ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా  మంత్రి సీతక్క మాట్లాడుతూ…మన పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చిన తెలంగాణలోని రాజన్న ఆలయం, సమ్మక్క – సారక్క జాతర, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. వీటి ప్రాశస్త్యం దేశం మొత్తం తెలిసేలా విస్తృత ప్రచారం చేయడమే కాకుండా, ఇక్కడకు పెద్ద సంఖ్యలో వొచ్చే భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. రాజన్న ఆలయం అభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామని చెప్పారు.

పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు
పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి సీతక్క తెలిపారు. దానికి సంబంధించి ఎట్లా చేయాలో అనేది రెండు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు ఇతర పనులకు వెచ్చించడం వల్లే సర్పంచ్‌ల బిల్లులు పెద్ద మొత్తంలో పెండిరగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. నిధుల లభ్యతను బట్టి సర్పంచుల పెండిరగ్‌ బకాయిలను దశల వారీగా చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి నెల 5వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లర్‌ల వేతనాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కేటీఆర్‌కు మైండ్‌ బ్లాకైందని విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లు గడీల పాలన చేసిందని విమర్శించారు.

ఇప్పుడు కూడా కేసీఆర్‌ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు కేటీఆర్‌కు బుద్దుందా అని ప్రశ్నించిన సీతక్క. ఆయన కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు మావైపే ఉన్నాన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారన్నారు. తమ అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైందని దుయ్యబట్టారు. అధికారం లేకుండా కేటీఆర్‌ ఉండలేకపోతున్నారని, అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులకు వేల బిల్లులు పెండిరగ్‌ పెట్టింది ఎవరు..? గత ప్రభుత్వం కాదా..?అని సీతక్క ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారని, చేయకపోతే ఇవ్వరన్నారు. కేటీఆర్‌ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయాలని, లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారన్నారు.

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా
తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి శ్రీమతి సీతక్క తెలిపారు. సిఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అప్రతిహాసంగా కొనసాగించేందుకు, ఆశీస్సులు అందించాలని , ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. సమ్మక్క- సారక్క జాతరకు ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, పూజించడం తన అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులకు ఆనవాయితీగా వొస్తుందన్నారు. మొదట ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు ఇక్కడి నుండి తీసుకెళ్లిన అక్షింతలు, నైవేద్యాలను అక్కడ సమర్పిస్తామన్నారు. ఆది సీనన్నది, తనది అన్నాచెల్లెల్ల అనుబంధమని, శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన విప్‌గా, ఎమ్మెల్యేగా, తాను మంత్రిగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *