- 800 రకాల మందుల ధరలు భారీగా పెంచడానికి కేంద్రం నిర్ణయం
- 90 శాతం జనాభాపై ప్రభావం
- ఏప్రిల్ 1 నుంచి ఏకంగా 12.12 శాతం పెరగనున్న మందుల ధరలు
గడిచిన తొమ్మిదేండ్లలో దేన్నీ వదలకుండా ధరల్ని పెంచుతూ పోయిన కేంద్రం, ఇప్పుడు ఔషధాల ధరలకూ రెక్కల్ని తొడుగుతున్నది. నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12.12 శాతం పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచే ఈ పెంపు అమలులోకి రానుంది. ధరలు పెరిగే వాటిలో జ్వరం, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, బీపీ, చర్మ వ్యాధులు, అనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతోపాటు పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్, యాంటీఇన్ఫెక్టివ్స్ కూడా ఉన్నాయి. తాజా పెంపు ప్రభావం జాతీయ నిత్యావసర మందుల జాబితాలోని 800కుపైగా మందులపై పడనుంది. 27 చికిత్సలకు సంబంధించిన సుమారు 900 మిశ్రమాలలో వినియోగించే 384 పదార్థాల ధరలు 12 శాతం పెరిగినట్టు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి(ఎన్‌పీపీఏ) వెల్లడించింది. కాగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలు ప్రధానంగా ఈ ధరల పెంపునకు కారణమని భిలాయ్‌కి చెందిన కెమిస్ట్ రాజేశ్ గౌర్ తెలిపారు. ఔషధాల్లో వినియోగించే ముడిపదార్థాలు, ఏపీఐ(యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్స్) ధరలు బాగా పెరిగాయని, దీంతోపాటు సరకు రవాణా, ప్యాకింగ్ ధరలు కూడా పెరిగాయని చెప్పారు.
ఫలితంగా మందుల గరిష్ఠ అమ్మకం ధర(ఎంఆర్‌పీ) 12 శాతం పెరగనున్నట్టు తెలిపారు. వొచ్చే నెల మొదలు పెయిన్ కిల్లర్ దగ్గర్నుంచి షుగర్, బీపీ, గుండె ఇలా అత్యంత ప్రధానమైన ఆరోగ్య సమస్యలకు, ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా కనిపించే రుగ్మతలకు వాడే ప్రతి మందు గోళి రేటు మండిపోతున్నది మరి. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సగటు మనిషి బతుకుకు భరోసా లేకుండా ఏకంగా ఔషధాల ధరలను ఏప్రిల్ 1 నుంచి 12 శాతానికిపైగా పెంచుతున్నది బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం. డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం..హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మందుల ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇతరత్రా కారణాల పేరిట కేంద్రం మందుల ధరలను ఏటేటా పెంచుకుంటూ వస్తుంది. కరోనా సంక్షోభంలో మందులకు డిమాండ్ పెరిగిందని, ఉచిత వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం వడ్డించింది. జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి చరిత్రలో ఔషధ ధరలపై ఈ స్థాయిలో పెంపుదల ఇదే మొదటిసారి. జ్వరం మందులు (పారాసిటమాల్ వంటివి), యాంటి బయోటిక్స్ (అజిత్రోమైసిన్ వంటివి), అంటువ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు,రక్తపోటు (బీపీ), డయాబెటిస్ (షుగర్), చర్మవ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, రక్తహీనత(ఫోలిక్ యాసిడ్ వంటి ఔషధాలు), రక్తప్రసరణ సంబంధిత జబ్బులు, క్షయ (టీబీ), వివిధ రకాల క్యాన్సర్లు, మినరల్, విటమిన్ తదితర గోలీలు మరో 800 రకాల అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్‌లు దేశ జనాభా 140 కోట్లలో ఏదో విధంగా మందులు వాడుతున్నవారు 126 కోట్ల మంది.
కుటుంబానికి ఐదుగురుచొప్పున లెక్కేసుకొంటే మొత్తం ఫ్యామిలీలు 25 కోట్లు, ఒక్కో కుటుంబం సగటున నెలకు మందుల కోసం వెచ్చిస్తున్న మొత్తం 4,000. దేశంలోని మొత్తం కుటుంబాలు మందుల కోసం నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.లక్ష కోట్లు. మందుల ధర 12.12 శాతం పెరుగనుండడంతో కుటుంబాలపై అదనంగా పడనున్న భారం రు.12,120 కోట్లు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ లభ్యమవుతుండటంతో ఇప్పటికే మెడికల్ షాపుల గిరాకీ దెబ్బతిన్నది. ఆన్‌లైన్‌లోని మర్చంట్స్‌కు షాప్ కిరాయి, సిబ్బంది ఖర్చు ఉండదు. అందుకే వాళ్లు డిస్కౌంట్లు ఇస్తారు. షాపులకు అలా కుదరదు. అయినప్పటికీ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు కొంత మొత్తంలో డిస్కౌంట్ ఇస్తుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మందుల ధరలను ఎడాపెడా పెంచితే, కస్టమర్లతోపాటు మెడికల్ షాపులకు కూడా ఇబ్బందే. ఎందుకంటే వాళ్లు ఎక్కువమొత్తంలో డిస్కౌంట్ అడిగే అవకాశమున్నది.