రూ 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం
ఆగస్టుకు ముందే అందజేస్తాం..
అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు
త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు
కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వలేదంటూ దుష్ప్రచారం చేశారని, కానీ అధాకారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ 7,500 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామని, రైతుకు రుణమాఫీ చేయరంటూ మళ్ళీ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రూ 42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారని, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారని, అయినా ఇంటింటికి తాగు నీటిని ఇవ్వలేకపోయారని విమర్శించారు. గురువారం కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి పాల్గొని శంకుస్థాన చేశారు. ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు నెలకు ముందే అమలు చేసి తీరుతామన్నారు. దీనిని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు.
ఇక రైతు భరోసా విషయానికొస్తే ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి అన్నది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అందజేస్తామన్నారు. గత పది ఏళ్ళుగా రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఖజానాను లూటీ చేసి రూ 7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మాత్రం ప్రతీ రూపాయి పోగు చేసి అర్థవంతంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తుందన్నారు. మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి గత పది ఏళ్ళు పాలించి రూ 42 వేల కోట్లు అప్పు తెచ్చారని, అయినా ఇంటింటికి తాగునీరు రాని దుస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సరఫరాకు రూ 150 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చిందని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి రూ 150 కోట్లతో తాగునీరు అందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం పట్టణానికి ఒకటే దారి ఉంది..
ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బందులు ఏర్పడతాయి. సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి గాను స్థల సేకరణ పూర్తయిందని తెలిపారు. ఆర్ఓబి నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్వో బీల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కావలసినంత స్థలం, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నందున రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. కొత్తగూడెంలో ఐటీ హబ్ నిర్మాణానికి కావలసిన స్థలం ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తానని, టైర్ టు సిటీ, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఐటి హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గత పాలకులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 9వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు చుక్క నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలన్నిటిని తెప్పించుకున్నామని, ఆరు నెలల్లో పూర్తి చేయగలిగేవి ఏంటి, ఏడాదిలో, మూడు సంవత్సరాల కాలంలో, ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్టులను గుర్తించామని తెలిపారు. వీటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని పారిస్తామన్నారు. రూ 70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్‌ను అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు.
గత పాలనలో ఆర్థిక విధ్వంసం : మంత్రి పొంగులేటి
తెలంగాణలో గత పాలకుల ధన దాహాంతో తెలంగాణలో ఆర్ధిక విధ్వంసం సృష్టించారని, ప్రజా ధనాన్ని దోచుకోడమే తప్పా ప్రజల దాహార్థిని తీర్చాలనే తపన గత పది ఏళ్ళ పాలనలో ఏన్నడూ కనిపించలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గోదావరి నీటితో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాను శస్యశామలం చేసేందకు సీతారామ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను రూపొందిస్తే, రాజకీ లబ్ధి కోసం రూ 9వేల కోట్లు అప్పు చేశారని, కానీ కనీసం ఒక్క ఎకరాకు నీళ్ళు అందించలేదని మండిపడ్డారు.
ప్రజా ధనాన్ని దోచుకునేందుకు స్కీమ్‌ల పేర్లు మార్చి స్కాములు చేశారని బిఆర్ఎస్ను పరోక్షంగా విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులను రాజును చేస్తామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రూ 31వేల కోట్ల రైతుల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైందని అన్నారు. కొత్తగూడెం ప్రజలు సుదీర్ఘ కాలంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, తమ ప్రభుత్వం మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి సుమారు రూ 125 కోట్లు కేటాయించిందన్నారు. పట్టణంలో అనేక మౌళిక వసతుల కల్పనకు అనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.




