సాగునీటి ప్రాజెక్టులపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రుల యత్నం

  • అవినీతి గురించి మాట్లాడకుండా అడ్డుకునే చర్యలు
  • తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష సరికాదు
  • అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో సిఎల్‌పి నేత భట్టి
  • తెలంగాణ పథకాలు భేషుగ్గా ఉన్నాయన్న అక్బరుద్దీన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 15 : సాగునీటి ప్రాజెక్టు అసలు లెక్కలు, అవినీతి గురించి మాట్లాడకుండా తెరాస మంత్రులు సభను పక్కదారి పట్టించారని సిఎల్‌పినేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు? దానికి ఎంత విద్యుత్‌ ‌వినియోగించారు? ఆ విద్యుత్‌కు ఎంత ఖర్చయింది వంటి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సభలో మంత్రులు, తెరాస నేతలు..కాంగ్రెస్‌ ‌పార్టీని కించపరచకుండా గౌరవంగా మాట్లాడాలని కోరారు. పదేపదే అవమానించడం వల్ల అధికారపార్టీ పరువే పోతుందని హితవు పలికారు. అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపడం సరికాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మండిపడ్డారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.

దేశ వ్యాప్తంగా 171 కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వరు. ఒక్కో మెడికల్‌ ‌కాలేజీకి రూ. 200 కోట్లు కేటాయించారు. ఒక వేళ మనకు ఒక కాలేజీని కేటాయించినా బాగుండేది కదా అన్నారు. నవోదయ విద్యాలయాల కేటాయింపుల్లోనూ కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పిల్లలు ఏం చదువుకోవద్దా? అని నిలదీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంపదలో వాటా రావాల్సిందేనని స్పష్టం చేశారు. ట్రిపుల్‌ ఐటీలు, ఐఐటీ, ఐఐఎంలు మనకు ఎందుకు ఇవ్వరు? ఎయిమ్స్‌కు నిధులు ఇవ్వరు. ఐటీఐఆర్‌ను ఇవ్వలేదు, నిమ్జ్ ‌వంటి ప్రాజెక్టులకు నిధుల్లేవు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం దారుణం.

ఈ దేశంలో సృష్టించబడుతున్న సంపద తెలంగాణ రాష్ట్రానికి కూడా రావాల్సిందే. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం కేంద్రానికి తగదన్నారు. ఈ దేశ సంపదను బీజేపీ అమ్మేస్తుందని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ‌సభ్యుల తీరు చూస్తుంటే కౌరవ సభలా అనిపిస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సభలో అధికార పార్టీ సభ్యులు అన్‌పార్లమెంటరీ పదాలు మాట్లాడారన్నారు. స్పీకర్‌ ‌కూడా తాను ఒక కాంట్రాక్టర్‌ననే చెప్పారన్నారు. అయితే స్పీకర్‌ను సభాధిపతిగానే చూస్తామని..కాంట్రాక్టర్‌ అని పిలవలేమన్నారు. కోమటిరెడ్డిని టీఆర్‌ఎస్‌ ‌నేతలు పదే పదే కాంట్రాక్టర్‌ అనడం సరికాదని మండిపడ్డారు. సభ్యులకు బిజినెస్‌లు ఉంటాయని..వారి వృత్తి గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సభలో మంత్రుల వ్యవహారం బాగోలేదన్న భట్టి.. ఇరిగేషన్‌లో జరిగిన అవినీతి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణ కల సాకారం చేద్దామని ఓవైసీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్‌ ఓవైసీ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ..ప్రజలకు కేసీఆర్‌ ‌మరింత సేవ చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్‌ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు. పోలీస్‌, ‌మెడికల్‌, ఎడ్యుకేషన్‌ ‌విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు కేసీఆర్‌ ‌ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఓవైసీ సూచించారు. అదే విధంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఉర్దూ వి•డియం విద్యార్థుల కోసం ఉర్దూ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పాతబస్తీలో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.  సభ సజావుగా నడిపిన స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డికి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డికి ఓవైసీ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page