Take a fresh look at your lifestyle.

సమ్మెలో పంచాయతీ కార్యదర్శులు

పల్లెల్లో పేరుకుపోతున్న సమస్యలు
-15వ రోజుకు చేరిన కార్యదర్శుల నిరసనలు
-వసూలు కాని ఆస్తి, నల్లా పన్నులు : ఇబ్బందుల్లో సర్పంచులు
-ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వీసును రెగ్యులరైజ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్యదర్శులు వివిధ రీతిలో వినూత్నంగా నిరసనలు చేస్తూ తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కనీసం వారితో చర్చలు జరిపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 368 మంది జూనియర్‌  ‌కార్యదర్శులు విధులు బహిష్కరించి సమ్మెలో ఉన్నారు. కందుకూరు డివిజన్‌ ‌లోని ఆమనగల్లు, కడ్తాల్‌, ‌మహేశ్వరం, తలకొండపల్లి, కందుకూరు మండలాలకు చెందిన కార్యదర్శులు ప్రతిరోజు ఓ మండలాన్ని ఎంచుకొని సమ్మె చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు. శుక్రవారం మహేశ్వరం మండల కేంద్రంలో తమ నిరసనలు తెలియజేశారు. వీరి సమ్మెతో గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీలో కార్యదర్శి ఉండాలనే ఆలోచనతో 2018లో జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసింది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ప్రొబెషనరీ పీరియడ్‌ 2 ‌సంవత్సరాలు, కాగా, వీరికి మాత్రం 3 సంవత్సరాల గడువుతో విధుల్లోకి తీసుకున్నారు.  2021 ఏప్రిల్‌లో ప్రొబెషనరీ పీరియడ్‌ ‌పూర్తి అయ్యే ఆరు మాసాల ముందు మరో సంవత్సరం ప్రొబెషనరీ పీరియడ్‌ ‌పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా నాలుగు సంవత్సరాల పీరియడ్‌ 2022 ఏ‌ప్రిల్‌ ‌ప్రభుత్వం సర్వీసు రెగ్యులరైజ్‌ ‌చేయడాన్ని విస్మరించింది. దీంతో కార్యదర్శులు సమ్మెబాట పట్టారు.

కార్యదర్శుల గోడు పట్టించు కోవాలి
హనరోరియం పెంచి రెగ్యులరైజ్‌ ‌చేసే విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. తమ సర్వీసును రెగ్యులరైజ్‌ ‌చేయాలనే డిమాండ్‌తో గత నెల 13న కార్యదర్శులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఏప్రిల్‌ 27 ‌వరకు ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే నిరవదిక సమ్మెకు వెళతామని తెలిపారు. ఏప్రిల్‌ 13 ‌నుంచి 27 వరకు ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ నిరసన కార్యక్రమాలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో తమ డిమాండ్‌ను పరిష్కరించకుండా సమ్మె చేయవద్దని హెచ్చరించడంతో విధిలేని పరిస్థితిలో జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు పూనుకున్నారు. 12 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి గోడును ప్రభుత్వం పట్టించుకునే ప్రయత్నం సైతం చేయకపోవడం గమనార్హం.

పట్టించుకోని ప్రభుత్వం ముందుకు సాగని పనులు
రంగారెడ్డి జిల్లాలో 368 మంది జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలోని  పంచాయతీలకు కేవలం కొంతమంది పర్మినెంట్‌ ‌కార్యదర్శులు పని చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికి రెండు, మూడు పంచాయతీల ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఏ గ్రామానికి సరైన విధంగా సేవలు అందించలేని దుస్థితి నెలకొంది. జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు బర్త్, ‌డెత్‌ ‌సర్టిఫికెట్స్‌తో పాటు గ్రామాల్లో జరిగే ప్రతీ అభివృద్ధి కార్యక్రమాల బాధ్యతలు నిర్వహిస్తుంటారు. కరోనా సమయంలో వీరు కరోనా సర్వే విధులు, ప్రస్తుతం కంటి వెలుగు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. వీరంతా విధులు బహిష్కరించి సమ్మెలో ఉండడంతో గ్రామాల్లో పనులు ముందుకు సాగడం లేదు. కనీసం పారిశుధ్య కార్యక్రమాలు సైతం నిర్వహించలేని పరిస్థితి ఉంది. గ్రామాల్లో సర్పంచ్‌లు సైతం వీరి డిమాండ్‌ ‌పరిష్కరించాలని సంఘీభావం తెలుపడం విశేషం. సమ్మె చేస్తున్న జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులకు పలువురు  కలిసి సంఘీభావం తెలిపారు. ప్రతిపక్షాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకు మద్దతు లభిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

కార్యదర్శులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తుండడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ అవసరాల కోసం పంచాయితీలకు ప్రజలు వస్తున్న కార్యదర్శులు అందుబాటులో లేక పనులు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి జూనియర్‌ ‌పంచాయితీ కార్యదర్శుల సమస్యలు తీర్చాలి.
ఫొటో నంబర్‌ 1 : ‌యాచారం వెంకటేశ్వర్లు గౌడ్‌,
సుద్ధ పల్లి,  సర్పంచ్‌ ‌మాడుగుల మండలం

ప్రభుత్వానికి కార్యదర్శుల సమస్యలు కనిపించడం లేదు..
గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ ‌పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయితీలో కార్యదర్శి రాక పోవడంతో వివిధ అవసరాల కోసం నిత్యం గ్రామ పంచాయితీ చుట్టూ తిరుగుతున్న కార్యదర్శి లేకపోవడంతో పనులు కావడం లేదు. ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వవహరిస్తుందని కార్యదర్శుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఫోటో నంబర్‌ 2 : ‌తల్లోజు ఆచారి, జాతీయ బీసీ కమిషన్‌ ‌మాజీ సభ్యులు

ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
జూనియర్‌ ‌పంచాయితీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోవాలి. గ్రామాల్లో కార్యదర్శులు లేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం. ప్రభుత్వం కార్యదర్శుల సమస్యలపై చర్యలు చేపట్టాలి.
ఫోటో నెంబర్‌ 3 : ఆయిళ్ల  శ్రీనివాస్‌ ‌గౌడ్‌,
‌టిపిసిసి సభ్యులు
——–
-పంచాయితీ కార్యదర్శుల సమ్మెలో విషాదం
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సోని
:‌వరంగల్‌ ‌జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్‌ ‌మండల్‌ ‌రంగాపురంలో జూనియర్‌ ‌పంచాయతీ సెక్రెటరీ రంగు సోనీ ఆత్మహత్యచేసుకుంది.రంగాపురం కార్యాలయంలో పురుగుల మందు తాగిన ఆమెను చికిత్స కోసం  ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందింది.  గత కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్‌ ‌చేయాలని జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  రెండుమూడు రోజుల క్రితం  జూనియర్‌ ‌పంచాయతీ సెక్రటరీలు అందరూ విధుల్లోకితప్పనిసరిగా రావాలని  ప్రభుత్వం ఆదేశించినప్పటి నుంచి ఆమె  విధుల్లో చేరింది.సోని ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేక  ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

Leave a Reply