‘‘ఇప్పటికీ మహిళలను ఇంటికే పరిమితం చేయడం వల్ల వారి శక్తి ఉత్పాదక శక్తిగా కనిపించడం లేదు. వారు విద్యకు, సాధికారతకు, సమాన హక్కులు, అవకాశాలకు దూరమే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రవేశం పరిమితమే. భ్రూణ హత్యలు, వరకట్న హత్యలు, లైంగిక హింస ఎక్కువ. రక్షణ కరువు. అన్నింటా పురోగతి సాధించాల్సిన మహిళ వెనుకబాటులోనే వుంది. ఆకాశంలో సగం, అవనిలో సగం, అన్నింటా మహిళలు సమానం కావాలి.’’
సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రపంచ పురోభివృద్ధి జరుగదు. ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మన సమాజం డిజిటల్ టెక్నాలజీలో ముందుకు పోతూంది. అందుకే ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం లింగ సమానత్వం కోసం డిజిటల్ ఇన్నోవేషన్ సాంకేతికత అనే నినాదాన్ని ఇచ్చింది. మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ విజయాలను గుర్తు చేసుకుంటూ లింగ సమానత్వం కోసం, అవగాహన కోసం ఈ ఉత్సవాలను ప్రదర్శనలను జరుపుతుంటారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా జరుపుకొనుటకు ప్రధాన కారణం 1917లో ‘‘ఆహారం – శాంతి’’ అని డిమాండ్ చేస్తూ రష్యాలోని మహిళలు సమ్మెకు దిగారు. ఆహారపు కొరత, పేదల జీవన పరిస్థితులు, మొదటి ప్రపంచ యుద్ధానికి నిరసనగా వారి సమ్మె కొనసాగింది. అది జాక్ నికోలస్ -2 పదవీ విరమణకు దారి తీసింది. తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు మంజూరు చేసింది.
అధిక దేశాల్లో అమలులో . ఉన్న క్యాలండర్ (గ్రెగోరియన్ క్యాలండర్) ప్రకారం మహిళలు సమ్మెకు దిగిన రోజు మార్చి 8వ తేదీ. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మహిళల హక్కులను గౌరవిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈ సందర్భంగా చాలా దేశాలు మార్చి 8వ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించాయి. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రోజు సెలవు దినంగా ప్రకటించినది. ప్రతిఏటా మహిళా దినోత్సవాలు జరుపుకుంటూ పండుగ చేసుకుంటున్నాం కానీ చేరవలసిన దూరం చాలా ఉన్నది. సమ భాగస్వామ్యం లేదు. ప్రతి చోట మహిళలపై బాలికలపై అన్ని రకాల వివక్ష కొనసాగుతూనే ఉంది. హింస పెరిగిపోతూనే ఉంది. బాల్యవివాహాలు పూర్తిగా పోలేదు. రాజకీయ, ఆర్థిక, ప్రజా జీవితాల్లో నిర్ణయాధికారం అన్ని స్థాయిల్లో మహిళలకు సమ భాగస్వామ్యం, సమాన అవకాశాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నవి. కుటుంబంలోనూ సమ భాగస్వామ్యం లేదు. ఇంటి పనికి విలువ లేదు. దాన్ని విలువైనదిగా భావించడం లేదు లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, పునరుత్పత్తి హక్కులు అన్నింటా వెనుకబాటే. ఇంతకీ మన ప్రయాణం ఎటు జరుగుతున్నది ప్రపంచంలో మన మహిళ ఎక్కడ ఉంది అని చూసుకుంటే 146 దేశాల్లో 135 స్థానంలో భారతీయ మహిళ ఉందని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు 2022లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) చెబుతుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 27 శాతం బాలికలకు 18 ఏండ్ల లోపు పెళ్ళి జరిగిపోతున్నది.
అనధికార ఉపాధి రంగంలో పురుషులు 57.5 శాతం ఉంటే మహిళలు 27.7 శాతం ఉన్నారు. పురుషులు 82 శాతం సంపాదిస్తే మహిళల సంపాదన 18శాతం మాత్రమే. పురుషులు 68 శాతం సంపాదిస్తే మహిళలు 32శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా పురుషులకంటే మహిళలు 23శాతం తక్కువ సంపాదిస్తున్నారు. 26శాతం మాత్రమే పార్లమెంట్ లో ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు లైంగిక హింసకు గురవుతున్నారు. మన దేశం పార్లమెంట్లో మొత్తం 542 మందికి 78 మంది మహిళలు అంటే 15 శాతం లోపే, రాజ్యసభలో 13శాతం లోపే ఉన్నారు. మన రాజ్యాంగం, అందులోని చట్టాలు, హక్కులు హిమాలయాలంతా గొప్పగా కనిపిస్తుంటాయి. కానీ మన వెనుకబాటుకు కారణం ఏమిటని ఆలోచిస్తే పితృస్వామిక భావ జాలమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మహిళలను ఇంటికే పరిమితం చేయడం వల్ల వారి శక్తి ఉత్పాదక శక్తిగా కనిపించడం లేదు. వారు విద్యకు, సాధికారతకు, సమాన హక్కులు, అవకాశాలకు దూరమే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రవేశం పరిమితమే. భ్రూణ హత్యలు, వరకట్న హత్యలు, లైంగిక హింస ఎక్కువ. రక్షణ కరువు. అన్నింటా పురోగతి సాధించాల్సిన మహిళ వెనుకబాటులోనే వుంది. ఆకాశంలో సగం, అవనిలో సగం, అన్నింటా మహిళలు సమానం కావాలి.
భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. కుల, మత, లింగ ప్రాంతాల పేరుతో వివక్ష నిషేధం అని 14,15 అధికరణాలు చెప్తున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారు. మహిళా సాధికారిక కనుచూపుమేరలో కనిపించటంలేదు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన గణాంకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. లోక్సభలో 14.94 శాతం, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 8.2 శాతం మంది మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో ఒకే ఒక మహిళ గెలుపొందింది. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల్లో 8 శాతం మాత్రమే మహిళలు. 17వ లోక్సభలో మహిళల శాతం 14.9 శాతం మాత్రమే. బిల్లు కనుక చట్ట రూపం దాల్చితే లోక్సభలో మహిళా సభ్యులు 181కి పెరుగుతారు.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకొనే మన దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా తెరమరుగున పడింది. సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభలలో 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించాలని మహిళా సంఘాలు సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. 1996 సంవత్సరంలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నానా రభస జరిగినది. మహిళా రిజర్వేషన్ వలన కుటుంబ జీవనం, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని బిజెపి అభ్యంతరం ప్రకటించింది. వామపక్షాలు మినహా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయం లేదని బిల్లు సెలక్ట్ కమిటీకి పంపబడింది. గీతా ముఖర్జీ నాయకత్వాన ఏర్పడిన పార్లమెంటరీ సెలక్ట్ కమిటి ఏకగ్రీవంగా యథాతథంగా బిల్లును ఆమోదించమని తెలిపింది. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మహిళా బిల్లు ప్రస్తావనే లేదు. విశ్వ గురువుగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్న మోడీ మహిళా బిల్లు గురించి ఒక్క మాట కూడా మాట్లాడంలేదు. లోక్సభలో ఎస్.సి, ఎస్.టి లకు రిజర్వేషన్లు ఉన్నాయి. చట్టసభల్లో ఓబిసీలకు రాజ్యాంగం ఎటువంటి రిజర్వేషన్లు కల్పించలేదు. ఈ అంశంపైన పార్లమెంట్లో విడిగా చర్చను చేపట్టాలి. పార్లమెంట్లో చర్చ జరగనీయకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాత్రం లొల్లి చేస్తున్నారు.
మన స్వార్ధ రాజకీయ పార్టీలు అన్ని కూడా చట్టసభల్లో 1/3వ వంతు మహిళా రిజర్వేషన్ చట్టం చేస్తామని ఎన్నికల ప్రణాళికలలో, ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాగ్దానాలు చేస్తుంటాయి. ఓట్ల కోసం, రాజకీయ సభల కోసం మహిళలను ఉపయోగించుకుంటున్నాయి. పార్టీలో పదవులు, ఎన్నికల్లో సీట్లు ఇవ్వటంలో వెనుక అడుగు వేస్తున్నవి. సంవత్సరాలు గడిచినా రిజర్వేషన్ ఊసే ఎత్తటం లేదు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగితే శాసనాలు రూపొందించడంలో, ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే వీలు ఉంటుంది. మహిళలు వంటింటికి, పిల్లల్ని కని పెంచటానికి, కుటుంబ ఆలనా పాలనా బాధ్యత వహించాలని అంతవరకే పరిమితం కావాలనే మనువాద సిద్ధాంతకర్తల పాలనలో లో బిల్లుకి మోక్షం కలగదు. పైగా తమ రాజకీయ గుత్తాధిపత్యానికి బీటలు పడతాయనే భయం పాలక వర్గ రాజకీయ పార్టీలలో ఉంది. అనేక ప్రజా వ్యతిరేక బిల్లులు ఒంటి చేతితో ఆమోదింప చేసుకునే పాలక పార్టీలు మహిళా బిల్లును మాత్రం ఏకాభిప్రాయం పేరుతో సంవత్సరాల తరబడి ప్రక్కన పెడుతున్నాయి.
రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు గత 12 సంవత్సరాలుగా పార్లమెంట్ లో భద్రంగా ఉంచబడినది. మనకన్నా వెనుకబడిన రువాండా, టాంజానియా, ఉగాండా, ట్యునీషియా, దక్షిణ సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలే కాదు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల చట్టసభల్లో మనకన్నా మహిళల సంఖ్య మెరుగ్గా ఉంది. దేశ జనాభాలో సగభాగం మహిళలు ఆ మేరకు రాజకీయ రంగంతో సహా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. కానీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లునే గట్టెక్కించలేక మూలనపడేసిన ఘనత మన ఘనత వహించిన నాయకులది. మహిళలు సాధికారిత సాధించారని ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా వాస్తవ పరిస్ధితులు అపహాస్యం చేస్తున్నాయి. ఉన్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఒకరిద్దరు మంత్రులను చూపించి మహిళలందరూ సాధికారిత సాధించారని ప్రచారం చేస్తున్నారు మహిళలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఓటుహక్కు సాధించుకున్నారు.
1962 నుండి 2014 వరకు పాలనలో మహిళా ఓట్ల శాతం పెరుగుతూ వచ్చింది. పాలనలో మహిళల భాగస్వామ్యం కొరకు జరిగిన ఉద్యమాల ఫలితంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన రిజర్వేషన్లను వినియోగించుకొని స్థానిక సంస్థల్లో మహిళలు లక్షల మంది పాలన సాగిస్తున్నారు. ఎన్నికైన మహిళా ప్రతినిధులను పక్కన పెట్టి వారికి స్థానంలో భర్త లేదా కుటుంబ సభ్యులే అన్ని వ్యవహారాలు నడుపుతున్నారు.మహిళా బిల్లుపై జరుగుతున్న చర్చల ప్రక్రియ మహిళల సమానత్వానికి, మహిళాభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న ఫ్యూడల్ సంస్కృతికి అద్దం పడుతున్నది. నిర్ణయాధికారాల్లో సమాన భాగస్వామ్యం కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం. పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉన్న బిజెపి మహిళా బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా తొక్కిపెడుతోంది. బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదానికి పెట్టకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ పబ్బం గడుపుతున్న పార్టీలకు మహిళలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.
– దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణిభవన్ హైదరాబాద్
9849592958