వొచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి(బిఆర్‌ఎస్) పార్టీని ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలన్న లక్ష్యంగా పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఏక తాటిపైకి వొచ్చే అవకాశాలున్నాయా అన్నదిప్పుడు తెలంగాణ సమాజంలో ప్రధాన చర్చనీయాంశమైంది. అందులోనూ ఒకనాడు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తాను జగనన్న విడిచిన బాణంగా చెప్పుకుని తెలంగాణ వ్యాప్తంగా పర్యటించిన షర్మిల పిలుపుకు నిజంగానే పార్టీలు మద్దతిస్తాయా అన్న చర్చజరుగుతుంది. ఏపి ముఖ్యమంత్రైన జగనన్న కాదనటం వల్ల తెలంగాణలో తన తండ్రి పేర(వైఎస్‌ఆర్‌టిపి) పార్టీ పెట్టడమే కాకుండా, తెలంగాణ ఇంటి కోడలుగా తనకే వోటు అడిగే హక్కు ఉందని చెప్పుకుని తిరుగుతున్న వైఎస్ షర్మిలకిప్పుడు ఇతర పక్షాల మద్దతు కూడగట్టాలన్న ఆలోచన ఎందుకొచ్చిందన్న విషయాన్ని కూడా జనం చర్చించుకుంటున్నారు. ఒక మహిళ రాజకీయ నేతగా రాష్ట్రంలోని వివిధ సమస్యలను ఎత్తిచూపుతూ దాదాపు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం నిజంగా సాహాస చర్యగానే చెప్పాలి.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ఆయా జిల్లాల్లోని పలువురు శాసన సభ్యుల అవినీతి చర్యలను బహిర్ఘతం చేస్తూ ప్రజాదరణ పొందినట్లుగా భావిస్తున్న షర్మిల ఇంకా ఒంటరి పోరాటం చేయలేకపోతున్నదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల తెలంగాణలో రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు ఆమె వెనుక కెసిఆర్ ఉన్నాడని కొందరు, జగనే కావాలని పంపించాడని, ఇంకొందరు ఇప్పుడామె బిజెపి విడిచిన బాణమని ఇలా ఎవరికి తోచినట్లుగా వారు అనునయించుకున్నారు. అయితే తన 3500 కిలోమీటర్ల పాదయాత్రలో బిజెపిని మినహా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా విమర్శించడాన్ని బట్టి షర్మిల బిజెపి అనుకూలురాలని బిఆర్‌ఎస్ ఆరోపిస్తూ వొస్తుంది. దానికి తగినట్లుగా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించే క్రమంలో రాష్ట్ర గవర్నర్‌కు, కేంద్రం నాయకత్వానికి పలుసార్లు ఫిర్యాదులు చేయడం, వారితో చర్చించడాన్ని బట్టికూడా బిజెపి విడిచిన బాణంగానే షర్మిలపై బిఆర్‌ఎస్ ముద్రవేసింది.
ఇంతకాలం ఒంటరి పోరాటం చేస్తున్నా వైఎస్‌ఆర్‌టిపి పార్టీలో పెద్దగా చేరికలు కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఆ పార్టీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన బడా నాయకుల చేరికలేకపోవడం, రాష్ట్రాన్ని కుదుపేస్తున్న దిల్లీ లిక్కర్ స్కామ్, టిఎస్‌పిఎస్సీ పేపర్ లీకేజీ స్కామ్‌తోపాటు నిరుద్యోగ సమస్యపై అటు బిజెపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తీవ్ర పోరాటాన్ని సాగిస్తున్నాయి. ఈ విషయాలపై రాష్ట్ర, దేశ ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు, అరెస్టులు పెద్ద ఎత్తున హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ రసాబాస బిఆర్‌ఎస్‌కు నష్టం కలిగించేదిగా, బిజెపి, కాంగ్రెస్‌లకు అడ్వంటేజ్‌గా మారాయి. ఇందులో తనగొంతు సరిపోవడంలేదన్న భావనతోనే ఉమ్మడి పోరాటంకోసం విపక్షాలన్నిటినీ షర్మిల ఆహ్వానించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని పార్టీలు..బిజెపి మొదలుకుని కాంగ్రెస్, ఎంఐఎం, టిడిపి, తెలంగాణ జనసమితి, జనసేన, బిఎస్పీ, సిపిఐ, సిపీఎం, ఎంఆర్‌పీఎస్ పార్టీలన్నిటినీ బిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన సంఘటిత పోరాటంకోసం షర్మిల ఆహ్వానించింది. ఈ పార్టీలన్నీ సానుకూలతను వ్యక్తం చేసినా, పోరాటంలో మాత్రం ఎవరికి వారు తమ సత్తా చాటుకోవాలన్న దృక్ఫథంతో ఉన్నట్లు తెలుస్తున్నది.
త్వరలో ఎన్నికలు రానున్న దృష్ట్యా ఒంటరి పోరులో ఉన్న గుర్తింపు ఉమ్మడి పోరాటంలో కనిపించదన్న భావన ఆ పార్టీల్లో ఉన్నట్లున్నది. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి షర్మిల స్వయంగా ఫోన్‌లో ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారిద్దరు కూడా అనుకూలంగా స్పందించినట్లుగా వైఎస్‌ఆర్‌టిపి వర్గాలు వెల్లడించాయి. కాని, ఈ విషయంలో తాను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ తర్వాత బండి సంజయ్ ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ సర్కార్‌పై ఉమ్మడి పోరాటాలు చేయడం అవసరమేనని చెప్పినప్పటికీ, పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే అసలే బిజెపి, కాంగ్రెస్ మధ్య ఉప్పులో నిప్పులా ఉంది. దానికితోడు తాజాగా రాహుల్ సంఘటన ఈ పార్టీల మధ్య మరింత విద్వేషాన్ని పెంచింది. ఈ రెండు పార్టీలు బిఆర్‌ఎస్‌ను మట్టికరిపించాలన్న లక్ష్యంగా పోరాటం చేస్తున్నప్పటికీ షర్మిల కోరుకుంటున్నట్లు ఏకతాటిపైకి వొచ్చే అవకాశాలైతే కనిపించడంలేదు. షర్మిల పాదయాత్రల సందర్భంగా కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డిని అనేక సందర్భాల్లో తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.
ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకత్వం వహిస్తున్న రేవంత్‌రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలిమరి. ఇక పోతే సిపిఎం, సిపిఐ, ఎంఐఎం లాంటి పార్టీలు చాలాకాలంగా అధికార బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటున్న విషయం బహిరంగ రహస్యమే. త్వరలో రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీల పొత్తులపై చర్చ జరుగుతున్న విషయంకూడా తెలియందికాదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి ఏమేరకు సిద్ధమవుతాయన్నది ప్రశ్నే. టిడిపి, జనసేనపార్టీలు ఏపిలో మాదిరిగా తెలంగాణలోనూ కలిసి ఉంటాయనడంలో సందేహంలేదు. అయితే షర్మిల ఆహ్వానంపై ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాల్సిందే. ఎంఆర్‌పిఎస్, తెలంగాణ జనసమితి పార్టీలు మాత్రం ఇప్పటికే సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితిలో షర్మిల తలపెట్టిన ప్రగతి భవన్‌మార్చ్‌లో ఎన్నిపార్టీలు భాగస్వామ్యం అవుతాయన్నది చూడాలి.
– మండువ రవీందర్‌రావు