- రైలు మార్గంలోనే భదాద్రికి..
- జిల్లాలో మూడు రోజుల పర్యటన
- పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్
భద్రాచలం, ఏప్రిల్ 09(ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 11వ తేదీ సోమవారం నాడు నిర్వహించనున్న స్వామివారి మహా పట్టాభిషేకానికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రానున్నారు. పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే భద్రాచలం పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పాటు గవర్నర్ పర్యటన ఖారారైనట్లు అధికార యంత్రాంగం తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గవర్నర్ మూడు రోజుల పాటు పర్యటించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతీ ఏడాది గవర్నర్ ప్రభుత్వం నుండి ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా భద్రాచలం చేరుకుని పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈ ఏడాది ప్రభుత్వం నుండి హెలీక్యాఫ్టర్ తీసుకోకుండా ఆమె నేరుగా రైలు మార్గం ద్వారా కొత్తగూడెం రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకుని పట్టాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భద్రాచలంలో సరస్వతి శిశుమందిర్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు.
ఆ తరువాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి దమ్మపేట మండలం శ్రీజగదాంబ సమేత జైలింగేశ్వరస్వామి దేవాలయం నాచారం గ్రామం నందు దర్శనానికి వెళతారు. మరుసటి రోజు అదే మండలంలోని పూసుగుంట గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చివరి రోజు 12వతేదీ నాడు అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ నందు కార్యక్రమంలో పాల్గొని అదే రోజు తిరిగి రైలు మార్గం ద్వారా హైద్రాబాద్ చేరుకోనున్నారు. గవర్నర్ పర్యటన దాదాపు ఖరారైంది.
గవర్నర్ పర్యటనలో అధికారులకు తలనొప్పి
గవర్నర్ తమిళసై భదాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పర్యటన అధికారులకు తలనొప్పి కానుంది. గతంలో గవర్నర్ మేడారం మరియు యాదాద్రి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి యంత్రాంగం ప్రొటోకాల్ పాటించలేదని ఇప్పటికే ఆమె తన అసంతృప్తిని తెలిపారు. ఇదే క్రమంలో మూడు రోజుల జిల్లా పర్యటనలో అధికార యంత్రాంగం ఏమాత్రం పాల్గొంటుందో వేచిచూడాలి.
ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో రైలు మార్గం ద్వారానే గవర్నర్ భదాద్రికి చేరుకోనున్నారు. పర్యటన ఆద్యంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అవ్వడం, గిరిజన ప్రాంతం అవ్వడంతో అటు పోలీసులకు, ఇటు అధికారులకు గవర్నర్ పర్యటన తలనొప్పిగా మారినట్లు ఉన్నట్లు తెలుస్తుంది.